న్యూఢిల్లీ: భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఇంధన, వ్యవసాయం, బీమా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికా కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. భారత్ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. ‘‘నేడు భారత్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆశావాదం నెలకొంది. ఎందుకంటే భారత్ ఎన్నో అవకాశాలను, ఎంపికలను కల్పించడంతోపాటు తలుపులు తెరుస్తోంది’’ అంటూ అమెరికా–భారత్ వాణిజ్య కౌన్సిల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ పేర్కొన్నారు.
గడిచిన ఆరేళ్ల కాలంలో ఎన్నో సంస్కరణలు చేపట్టడంతోపాటు ఎన్నో రంగాల్లోకి పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్టు వివరించారు. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం ప్రాముఖ్యతను కరోనా మహమ్మారి చూపించిందన్నారు. దేశీయంగా బలమైన ఆర్థిక సామర్థ్యాలతో భారత్ బలంగా నిలిచిందన్నారు. భారత్ అవకాశాల కేంద్రంగా మారుతోందంటూ ఒక ఉదాహరణను తెలియజేశారు. పట్టణల్లో కంటే గ్రామీణం గానే ఇంటర్నెట్ వినియోగదారులు అధికంగా ఉన్నారన్న ఆసక్తికరమైన నివేదికను ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment