సాక్షి, హైదరాబాద్: ఆదాయం పన్ను(ఐటీ) వసూళ్లలో రాష్ట్రం దేశంలో ఐదవ స్థానంలో ఉంది. పారిశ్రామిక పురోగతి కారణంగా ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో ఉండవచ్చని 2009లో అంచనా వేశారు. కానీ ఆ తర్వాత కాలంలో రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం వల్ల ఈ లక్ష్యం నెరవేరలేదు. పెట్టుబడిదారులు వెనక్కు తగ్గడం, కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో ఆదాయం అనుకున్న రీతిలో వృద్ధి చెందలేదు. బహుళజాతి కంపెనీలు సైతం తమ శాఖల విస్తరణకు ఇతర రాష్ట్రాలను ఎంపిక చేసుకున్నాయి. ప్రాజెక్టు నివేదికలు సిద్ధమైనప్పటికీ.. కొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. భారీ ఆదాయం పన్ను చెల్లించే సంస్థలు కూడా గడచిన నాలుగేళ్లుగా వ్యాపార లావాదేవీల్లో వెనుకబడి ఉన్నాయి. ఇలాంటి కంపెనీలు దాదాపు 58 వరకూ ఉన్నాయని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బ్యాంకుల విస్తరణ కూడా ముంబై, ఢిల్లీతోపాటు దక్షిణ భారతదేశంలో బెంగళూరు, చెన్నైకే పరిమితమయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి క్షీణించింది. కార్పొరేట్ ట్యాక్స్ గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రూ.36 వేల కోట్ల ఆదాయ పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అది రూ.29 వేల కోట్లు దాటలేదు. ఈ విషయంలో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సైతం మనకన్నా ముందుండడం విశేషం. దేశంలో ఆదాయపన్ను వసూళ్లలో మహారాష్ట్ర (రూ. 1,74,980 కోట్లు) అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ(రూ. 79,236 కోట్లు), కర్ణాటక(రూ. 49 వేల కోట్లు), తమిళనాడు(రూ. 35,266 కోట్లు) తరువాతి స్థానాల్లో నిలిచాయి. కానీ రాష్ట్రంలో రూ. 29,716 కోట్లు మాత్రమే ఆదాయపన్ను వసూలైంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) పరిశ్రమలకు కేంద్ర బిందువైన హైదరాబాద్‌లోనూ అనిశ్చితి కొనసాగుతుండడం ఇందుకు కారణం. సుస్థిరత దిశగా అడుగులు పడకపోతే భవిష్యత్‌లో ఆర్థిక పురోగతి మరింత క్షీణించే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయపన్ను వసూళ్లలో రాష్ట్రానిది ఐదో స్థానం
Published Thu, Oct 17 2013 12:24 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement