బహుళజాతి కంపెనీల ‘డిగ్రీ’ రూట్‌ | Campus placements in degree colleges: Telangana | Sakshi
Sakshi News home page

బహుళజాతి కంపెనీల ‘డిగ్రీ’ రూట్‌

Published Tue, Jan 9 2024 2:48 AM | Last Updated on Tue, Jan 9 2024 7:54 AM

Campus placements in degree colleges: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  డిగ్రీ విద్యార్థులకు తిరిగి మంచి రోజులొస్తున్నాయి. బహుళజాతి కంపెనీలు కూడా డిగ్రీ కాలేజీల్లో క్యాంపస్‌ నియామకాలకు ఆసక్తి చూపుతున్నాయి. ఇంజనీరింగ్‌ కాలేజీల తరహాలోనే ఇక్కడా నిపుణులైన వారికి మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) గత ఏడాది నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది.

గత ఏడాది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారిలో కంప్యూటర్‌ కాంబినేషన్‌ ఉన్న డిగ్రీ కోర్సులు చేసిన వారు 43శాతం ఉన్నట్టు గుర్తించారు. విప్రో, అమెజాన్, టీసీఎస్, యాక్సెంచర్‌ వంటి మల్టీ నేషనల్‌ కంపెనీల్లో గరిష్టంగా రూ.16 లక్షలు, కనిష్టంగా రూ.4 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్టు తేలింది.

తెలంగాణలోనూ 45వేల మంది బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్టు విద్యాశాఖ చెబుతోంది. నిజానికి ఈ ట్రెండ్‌ ఐదేళ్ల క్రితమే మొదలైందని.. గత ఏడాది నుంచి ఊపు వచ్చిదని నిపుణులు చెప్తున్నారు. డిగ్రీ స్వరూప స్వభావం మారుతోందని, అందుకే ఇప్పుడు వీటిని నాన్‌–ఇంజనీరింగ్‌ కోర్సులుగా పిలుస్తున్నారని ఉన్నత విద్య వర్గాలు అంటున్నాయి. 

టెక్నాలజీ ఆధారిత కోర్సులతో..
తెలంగాణవ్యాప్తంగా 4 లక్షల పైచిలుకు డిగ్రీ సీట్లున్నాయి. ఏటా 2.25 లక్షల సీట్ల వరకూ భర్తీ అవుతున్నాయి. ఇందులో చాలా మంది కంప్యూటర్‌ సాంకేతికత కోర్సులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. సాధారణ కోర్సుతోపాటు ఏదైనా డిమాండ్‌ ఉన్న కాంబినేషన్‌ సబ్జెక్టులను ఎంచుకుంటున్నారు.

అలాంటి విద్యార్థులకు బహుళజాతి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో బీకాం కంప్యూటర్స్‌ చేసిన వారికి ఎక్కువ డిమాండ్‌ కనిపిస్తోంది. కోవిడ్‌ తర్వాత అన్ని విభాగాల్లో యాంత్రీకరణ ప్రభావం కనిపిస్తోంది. అన్ని కంపెనీలు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విధానాలను అభివృద్ధి చేసుకున్నాయి. డేటా ఎనాలసిస్, మార్కెటింగ్‌ ట్రెండ్స్, ఆడిట్‌ కోసం సాంకేతిక నిపుణులు అవసరం. బీకాం చేసినవారికి ఆడిట్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంటున్నాయి. పెద్ద ఆడిటర్ల కన్నా బీకాం పూర్తిచేసే ఆడిటర్లను అసిస్టెంట్లుగా కంపెనీలు నియమించుకుంటున్నాయి.

మూడో వంతు మందికి..
తెలంగాణవ్యాప్తంగా గత ఏడాది 76వేల మంది కామర్స్‌ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వచ్చారు. వారిలో 24వేల మంది వరకు అసిస్టెంట్‌ ఆడిటర్లు, అనలిస్టులుగా బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. గత సంవత్సరం బీఏ నేపథ్యంతోపాటు కంప్యూటర్స్‌ ఆప్షన్‌తో ఉత్తీర్ణులైన విద్యార్థులు 18 వేల మంది మార్కెటింగ్‌ విభాగాల్లో ఉద్యోగాలు పొందినట్టు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి.

ఇంజనీరింగ్‌ విద్యార్థులతో సమానంగా డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యం ఉండటం, వారిని తక్కువ వేతనంతో తీసుకున్నా వీలైనంత త్వరగా శిక్షణ ఇచ్చి అనుకూలంగా మార్చుకోవచ్చని కంపెనీలు భావిస్తుండటమే దీనికి కారణం. విద్యార్థులు కూడా మొదట్లో తక్కువ వేతనాలకే చేరుతున్నా.. నైపుణ్యం పెరిగితే మంచి వేతనం వస్తుందని ఆశిస్తున్నారు. 

రాజధానికే పరిమితం...
ఇప్పటికీ నాణ్యమైన డిగ్రీ విద్య కేవలం హైదరాబాద్, పరిసర ప్రాంతాలకే పరిమితమైంది. మంచి వేతనంతో ఉద్యోగం పొందుతున్నవారిలో ఇక్కడి కాలేజీల్లో చదివినవారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని 83 కాలేజీల నుంచి డిగ్రీ విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో మంచి ఉద్యోగాలు పొందారు.

గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని డిగ్రీ కాలేజీల్లో నాణ్యత పెరగడం లేదు. క్యాంపస్‌ సెలక్షన్‌కు వెళ్ల కంపెనీలు కూడా హైదరాబాద్‌ ప్రాంత డిగ్రీ కాలేజీలకే ప్రాధాన్యమిస్తున్నాయి. డిగ్రీలో విద్యార్థుల్లో 43శాతం హైదరాబాద్, పరిసరాల్లోకి కాలేజీల్లోనే చేరుతున్నారు. ఇక్కడ డిగ్రీ చేస్తూనే పార్ట్‌టైం జాబ్‌ చేసుకోవచ్చనే ఆలోచన, చదువుకునే సమయంలో ఇతర కోర్సులు చేయడానికీ హైదరాబాద్‌ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశమే దీనికి కారణం.

విద్యార్థుల చేరిక ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో డిమాండ్‌ ఉండే వివిధ కాంబినేషన్ల కోర్సులను హైదరాబాద్‌లోని డిగ్రీ కాలేజీలు ప్రవేశపెట్టగలుతున్నాయి. ఇలా డేటాసైన్స్, ఆనర్స్‌ వంటి కోర్సులు హైదరాబాద్‌ పరిధిలోనే విజయవంతంగా కొనసాగుతున్నట్టు ఉన్నత విద్యా మండలి వర్గాలు కూడా చెప్తున్నాయి. భవిష్యత్‌లో అన్ని జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లోని కోర్సుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నాయి. 

నైపుణ్యమే డిగ్రీ విద్యార్థులకు నజరానా 
డిగ్రీ విద్యార్థులను నియమించుకునేందుకు పెద్ద కంపెనీలు ఇష్టపడుతున్నాయి. వీరిలో ఇంజనీరింగ్‌ విద్యార్థులతో సమానమైన నైపుణ్యం ఉంటుందని భావిస్తున్నాయి. వారిని తేలికగా తమ కంపెనీ అవసరాలకు తగినట్టుగా మలుచుకోవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. డిగ్రీలో వస్తున్న కాంబినేషన్‌ కోర్సుల వల్ల నైపుణ్యం పెరిగింది. తక్కువ వేతనాలతో ఉద్యోగులను తీసుకునే కంపెనీలు కూడా డిగ్రీ విద్యార్థులను ఇష్టపడుతున్నాయి. వారు అంత తేలికగా కంపెనీ మారరనే భావన ఉంది. ఇవన్నీ డిగ్రీ విద్యార్థులకు కలసి వచ్చే అంశాలే.    – బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement