ఐటీ సంస్థలకు మించి నియామకాలు
క్యూ1లో డిమాండ్ 46 శాతం వృద్ధి
బడా బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) తమ సొంత అవసరాల కోసం దేశీయంగా ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాలు జోరుగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటిసారిగా ఐటీ సేవల కంపెనీలను మించి వీటిలో హైరింగ్ జరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈసారి క్యూ1లో 46 శాతం అధికంగా జీసీసీల్లో నియామకాలకు డిమాండ్ నెలకొంది బహుళజాతి సంస్థలు భారత్‌లో కొత్తగా జీసీసీలను ఏర్పాటు చేయడం లేదా ఉన్నవాటిని విస్తరించడంపై అంతర్జాతీయ కంపెనీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ సరీ్వసుల విభాగంలో సిబ్బంది సంఖ్య నికరంగా 50,000 పైచిలుకు పెరగ్గా జీసీసీల్లో 60,000 పైచిలుకు స్థాయిలో వృద్ధి చెందిందని వివరించాయి. అంతే గాకుండా ఐటీ సరీ్వసుల కంపెనీలతో పోలిస్తే కేపబిలిటీ సెంటర్లలో వేతనాలు 30–40 శాతం అధికంగా ఉంటున్నాయని పేర్కొన్నాయి. దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉండగా.. వచ్చే ఏడాదినాటికి ఇది 1,900కి చేరొచ్చని అంచనాలు ఉన్నాయి.
70వేల పైచిలుకు నియామకాలు..
పరిశ్రమ వర్గాలు తెలుపుతున్న సమాచారం ప్రకారం గత ఆరు నెలల్లో తాత్కాలిక ఉద్యోగుల (గిగ్ వర్కర్లు) నియామకాలకు ఎంఎన్‌సీల జీసీసీల్లో డిమాండ్ 20–25 శాతం మేర పెరిగింది. బహుళజాతి సంస్థలు తక్కువ వ్యయాలతో అవసరాల మేరకు కార్యకలాపాలను విస్తరించుకునే వెసులుబాటుపై దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమనది విశ్లేషణ .
ఈ నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో జీసీసీలు 70,000 వరకు గిగ్ వర్కర్లను నియమించుకునే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి. కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లు, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లు మొదలైన వారు ఈ జాబితాలో ఉన్నారు. వ్యాపారపరమైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఫుల్–టైమ్ ప్రాతిపదికన కన్నా ఎప్పటికప్పుడు మారిపోయే అవసరాలను బట్టి తక్కువ వ్యయాలతో ఎంతమందినైనా తీసుకోవడానికి అవకాశం ఉండటం ఆయా కంపెనీలకు కలిసొచ్చే అంశమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఫుల్–టైమ్ ఉద్యోగులతో పోలిస్తే గిగ్ వర్కర్లను నియమించుకోవడం ద్వారా కంపెనీ సగటున 25–40 శాతం వరకు వ్యయాలను ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నాయి. తాత్కాలిక, ప్రాజెక్ట్–ఆధారిత థర్డ్ పార్టీ నియామకాల విధానంలో మానవ వనరుల విభాగంపరమైన వ్యయాలు, హైరింగ్..ఆన్‌బోర్డింగ్ వ్యయాలు, అడ్మిని్రస్టేషన్ వ్యయాలు, ఎప్పటికప్పుడు వేతనాల పెంపు మొదలైన భారాలను కంపెనీలు తగ్గించుకోవచ్చని వివరించాయి. కొన్ని వర్గాలు వేస్తున్న అంచనాల ప్రకారం ప్రస్తుతం మొత్తం జీసీసీ సిబ్బందిలో 8 శాతంగా ఉన్న గిగ్ వర్కర్ల సంఖ్య వచ్చే 12 నెలల్లో సుమారు 11.6 శాతానికి చేరనుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment