ట్రంప్‌పై పోరుకు సై
రూ. 10.8 కోట్ల విరాళం ప్రకటించిన ట్వీటర్
శాన్ ఫ్రాన్సిస్కో: ట్రంప్ నిరంకుశ నిర్ణయాలపై పోరుకు అమెరికన్లే కాకుండా మల్టీ నేషనల్ కంపెనీలు సైతం సై అంటున్నాయి. ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధాన్ని ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, గూగుల్, ట్వీటర్‌లతోపాటు పలు బడా కంపెనీలు తీవ్రంగా తప్పుపట్టాయి. తాజాగా ఈ పోరుకు సాయమందించేందుకు ట్వీటర్ ముందుకొచ్చింది. శరణార్థులు, వలసదారులపై నిషేధంపై పోరాటానికి ట్విటర్ సీఈవో జాక్ డోర్సే, ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు 1.59 మిలియన్ .10.8 కోట్ల) విరాళం ప్రకటించారు.
మొదటిగా 925 మంది ట్వీటర్ ఉద్యోగులు 5.30 లక్షల డాలర్లు సేకరించగా... సీఈవో డోర్సే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఒమిద్ కొర్దెస్తానీలు ఆ మొత్తాన్ని 1.59 మిలియన్ డాలర్లకు పెంచారు. ట్రంప్ నిర్ణయంపై కోర్టు వెలుపల, లోపల పోరాడుతున్న ‘అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్‌యూ)’ సంస్థకు ఈ సాయం అందుతుంది. ‘పౌర హక్కులు ప్రమాదంలో పడ్డప్పుడు... వ్యక్తులగా మనం ఐక్యంగా పోరాడి స్వేచ్ఛను పరిరక్షించాలి... ప్రజల తరఫున పోరాడాలి’ అని ట్వీటర్ జనరల్ కౌన్సిల్ విజయ గద్దె అన్నారు.
ఇష్టం లేకున్నా అమలు చేస్తాం..
శరణార్థుల ఒప్పందంపై ఆస్ట్రేలియా ప్రధానితో గొడవపడ్డ ట్రంప్ ఒకడుగు వెనక్కి తగ్గారు. ఒప్పందంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నా దాన్ని అమలు చేస్తామని, అయితే శరణార్థుల వివరాలు క్షుణ్నంగా పరిశీలించాకే అమెరికాలోకి అనుమతిస్తామని వైట్‌హౌస్ పేర్కొంది. మరోవైపు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ... ‘గత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పకుండా గౌరవించాలి. అదే సమయంలో దానిని ప్రశ్నించాల్సిన అవసరముంది’ అని చెప్పారు..
చైనీయుల మనసు దోచిన ట్రంప్ కుమార్తె, మనువరాలు
ఒకవైపు చైనాపై ట్రంప్ విమర్శలు చేస్తుంటే ఆయన కుమార్తె ఇవాంకా, మనువరాలు ఆరబెల్లాలు మాత్రం చైనీయుల మనసు దోచుకున్నారు. చైనీయుల కొత్త సంవత్సరం లూనార్ వేడుకల సందర్భంగా చైనీస్‌లో ఆరబెల్లా పాడిన పాట ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. కాగా, వలస విధానాలపై నిరసనల నేపథ్యంలో ఆయన వ్యాపార సలహా మండలి నుంచి ఉబర్ కంపెనీ చీఫ్ ట్రావిస్ కలనిక్ తప్పుకున్నారు. మండలిలో ఉండలేనని చెప్పానని కలనిక్ తన ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు.
మరో కొత్త చట్టం ప్రయత్నాల్లో ట్రంప్?
ట్రంప్ సర్కారు మరో షాకిచ్చేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ పత్రిక వాషిం గ్టన్ పోస్టు పేర్కొంది. ఈ వివాదాస్పద ఉత్తర్వుల ప్రకారం.... వ్యక్తుల మతాల్ని ఆధారంగా చేసుకుని వారికి సేవలు, ఉద్యోగం, ఇతర సౌకర్యాల కల్పనను తిరస్కరించే హక్కు ఉంటుంది. ఈ చట్టం కోసం చాలా ఏళ్లుగా సంప్రదాయ క్రైస్తవులు పట్టుపడుతున్నారు. అయితే అమెరికా ప్రభుత్వానికి అలాంటి ఆలోచనేదీ లేదని వైట్‌హౌస్ వర్గాలు ఖండించాయి.