‘బహుళజాతి’ మోసం | multinational companies froudings | Sakshi
Sakshi News home page

‘బహుళజాతి’ మోసం

Published Wed, Sep 30 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

‘బహుళజాతి’ మోసం

‘బహుళజాతి’ మోసం

అబద్ధమాడటానికీ, మోసం చేయడానికీ ఉండే తేడాను చెబుతూ ‘నిజం చెప్పకపోవడం అబద్ధం... అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’ అంటాడు ఓ చిత్రంలో కథానాయకుడు. లక్షల కోట్లకు పడగలెత్తి దేశదేశాల్లోనూ ఎన్నికైన ప్రభుత్వాలను శాసించగల స్థాయికి చేరుకున్న బహుళజాతి సంస్థలు ఇలాంటి మోసాలను సునాయాసంగా, యథేచ్ఛగా  చేస్తున్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా... మార్కెట్ లీడర్‌గా చలామణి అవుతున్న ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు కంపెనీ ఈమధ్య చేసిన ప్రకటన అందరినీ దిగ్భ్రాంతిపరచింది. తాము ఉత్పత్తి చేస్తున్న డీజిల్ కార్లలో అవి వెలువరించే ఉద్గారాల తీవ్రత పరీక్షలకు దొరక్కుండా చేసే సాఫ్ట్‌వేర్‌ను అమర్చామని... ఇలా చేయడం ద్వారా లక్షలాది మంది ఖాతాదార్ల విశ్వాసాన్ని వమ్ము చేశామని ఆ సంస్థ వెల్లడించింది. ఇందుకు తమను క్షమించాలని కోరింది. ఈ ప్రకటన చేశాక ఆ సంస్థ సీఈఓ మార్టిన్ వింటర్‌కార్న్ పదవినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

మామూలుగా అయితే ఫోక్స్‌వ్యాగన్‌తో పరుగెత్తలేక ఆయాసపడుతున్న మిగిలిన కంపెనీలన్నిటికీ ఈ ప్రకటన ఉపశమనం కలిగించేదే. అయితే మదుపుదార్లు వాటికా అవకాశాన్నివ్వ లేదు. స్టాక్ మార్కెట్లలో ఫోక్స్‌వ్యాగన్‌ను కాస్త ఎక్కువగా శిక్షిస్తే... మిగిలిన వాటికి కూడా అంతో ఇంతో వాతలు పెట్టారు. ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు వాటా ధర ఒక్కసారిగా 20 శాతం పడిపోతే... టయోటా, జనరల్ మోటార్స్ వంటి సంస్థల వాటా ధరలు కూడా పల్టీలు కొట్టాయి. ఫోక్స్‌వ్యాగన్ వెలువరించిన క్షమాపణ ప్రకటన చాలా ఖరీదైంది. అది చెల్లించుకోవాల్సిన మూల్యం సామాన్యమైనది కాదు. తమ దేశంలో 2009 నుంచి ఇంతవరకూ విక్రయించిన దాదాపు 5 లక్షల డీజిల్ కార్లనూ వెనక్కి తీసుకోవాలని అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఫోక్స్ వ్యాగన్‌ను ఆదేశించింది.

అంతేకాదు... ఆ సంస్థ ఉత్పత్తులైన ఆడి, ఫోక్స్‌వ్యాగన్, పోర్షే డీజిల్ కార్లను ఇకపై విక్రయించవద్దని తాఖీదు పంపింది. జరిమానాల రూపంలో అది చెల్లించాల్సిన మొత్తం కూడా దాదాపు 18 వందల కోట్ల డాలర్ల (రూ.1,18,800 కోట్లు) వరకూ ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ఫోక్స్‌వ్యాగన్ కాళ్లావేళ్లా పడితే ఇది ఏమేరకు తగ్గుతుందో తెలియదుగానీ షేర్ల ధరల పతనం వల్ల ఆ సంస్థ మార్కెట్ విలువ 17 వందల కోట్ల డాలర్ల (రూ.1,12,200 కోట్లు)మేర పడిపోయింది. ఆ సంస్థ క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలనూ, నష్టపరిహారం కోసం న్యాయస్థానాల్లో దాఖలయ్యే క్లాస్ యాక్షన్ దావాలను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది.

ఈ పెను సంక్షోభాన్ని కేవలం ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకొచ్చే ఆర్థిక నష్టాలతో మాత్రమే చూస్తే... కార్ల సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి కలిగిస్తున్న నష్టాన్నీ, జనం ప్రాణాలకు తెస్తున్న ముప్పునూ తగ్గించి చూపినట్టే అవుతుంది. ఫోక్స్‌వ్యాగన్ దొరికిన దొంగైతే దొరకని దొంగలు చాలామంది ఉన్నారు. తమ వాహనాల మైలేజీని అతిగా చూపడం, ఉద్గారాలను తగ్గించి చూపడం అందరికీ అలవాటైంది. దాదాపు ఏ కంపెనీ విడుదల చేసే కారైనా ప్రయోగశాలల్లో జరిగే పరీక్షల్లో వెలువరించే ఉద్గారాలకూ... రోడ్లపై పరుగెత్తినప్పుడు వదిలే ఉద్గారాలకూ మధ్య ఎంతో తేడా ఉంటున్నదని వారు చెబుతున్నారు. యూరప్ ప్రయోగశాలలు ఇస్తున్న ధ్రువీకరణ పత్రాల్లో పేర్కొంటున్న నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలకూ, అవి విడిచిపెట్టే ఉద్గారాలకూ మధ్య 2001లో 10 శాతం తేడా వస్తే ఇప్పుడది 40 శాతానికి చేరిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈ ధోరణిని గమనించాక ఉద్గారాల తగ్గింపునకు సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అమర్చుకోవాల్సిందేనన్న నిబంధన వచ్చింది. చాలా తక్కువ వ్యవధిలోనే దాన్ని అమలు చేయాల్సి రావడంతో ఫోక్స్‌వ్యాగన్ అడ్డదార్లు తొక్కింది. పెట్రోల్ ఇంజిన్లుండే వాహనాల్లో ఉద్గారాల తగ్గింపునకు ఉపయోగించే సాంకేతికత డీజిల్ ఇంజిన్లకు సరిపోదు. నేరుగా దాన్నే ఉపయోగిస్తే వాహనాని కుండే ఇంధన సామర్థ్యం పడిపోవడంతోపాటు ఇంజిన్ శక్తి కూడా తగ్గిపోతుంది. కనుక డీజిల్ కార్ల కోసం మరింత సంక్లిష్టమైన, ఖరీదైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. అందుకు సమయం సరిపోకపోవడంతో పాటు... ఆ సాంకేతికతకయ్యే వ్యయానికి తగ్గట్టు వాహనం ధరను కూడా పెంచాల్సి ఉంటుంది.

ఇందువల్ల మార్కెట్ డిమాండ్ పడిపోతుందన్న భయంతో ఫోక్స్‌వ్యాగన్ సాఫ్ట్‌వేర్‌లో మాయాజాలాన్ని ప్రదర్శించింది. సాధారణ పరిస్థితుల్లో రోడ్లపై అడ్డూ ఆపూ లేకుండా ఉద్గారాలను వెదజల్లే ఇంజిన్... పరీక్షకు నిలిచినప్పుడు మాత్రం పరిమితులకు లోబడి ఉండేలా కారులో అమర్చిన సాఫ్ట్‌వేర్ నియంత్రిస్తుంది. నిజానికి ఈ వంచన ఇన్నాళ్లూ బయటకు రాకపోవడానికి అమెరికాలో అమల్లో ఉన్న కాపీరైట్ చట్టమే ఒక రకంగా కారణం. వాహనం కొనే వినియోగదారు స్టీరింగ్ మొదలుకొని బ్రేకులు, టైర్ల వరకూ అన్నిటినీ తనిఖీ చేసుకోవచ్చు. కానీ వాహనంలో వాడే సాఫ్ట్‌వేర్ జోలికి మాత్రం వెళ్లకూడదు. దీన్ని మార్చాలని ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ (ఈఎఫ్‌ఎఫ్) ఎప్పటినుంచో కోరుతున్నది.

మొత్తానికి ఇలాంటి కుంభకోణాల్లో కూరుకుపోయిన సంస్థల్లో ఫోక్స్‌వ్యాగన్ మొదటిదీ కాదు... బహుశా చివరదీ కాదు. గతంలో జీఎం, టయోటా వంటివి తమ ఉత్పత్తులను వెనక్కి రప్పించుకోవడంతోపాటు భారీగా జరిమానాలు కట్టాల్సి వచ్చింది. బ్రిటిష్ పెట్రోలియం సంస్థ కనీస భద్రతా నిబంధనలు ఖాతరు చేయ కుండా చమురు వెలికితీత కార్యకలాపాలు నడిపి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రమా దాలకు కారణమైంది. బహుళజాతి కంపెనీలన్నిటిదీ ఈ విషయంలో దుర్మార్గమైన చరిత్రే. లాభార్జన కోసం ఎంతకైనా దిగజారే చరిత్రే. తాజా స్కాంతోనైనా ప్రపంచ దేశాల్లోని పాలకులు బహుళజాతి వ్యామోహం నుంచి బయటపడి వాటిపట్ల కఠినంగా వ్యవహరిస్తే ప్రజలకు మేలు కలిగించినవారవుతారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement