
లండన్ : బ్రిటన్ ప్రధాని థెరిసా మే సంచలన నిర‍్ణయం. జూన్ 7 శుక్రవారం నాడు తాను రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఎంపీల మద్దతు దక్కించుకోవడంలో తీవ్రంగా విఫలమైన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దేశంకోసం నిబద్ధతతో పనిచేశానని ఇందుకు తాను గర్వపడుతున్నానన్నారు. జూన్ 7న కన్జర్వేటివ్ పార్టీ నేతగా రాజీనామా చేయనున్నానని, కొత్త నాయకుడి ఎన్నిక ప్రక్రియ ఆ తరువాతి వారం మొదలుకానుందని పేర్కొన్నారు. అప్పటివరకు తాను ప్రధానిగా కొనసాగుతానని తెలిపారు
బ్రెగ్జిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన నిరసనలు, ఆందోళనలు, బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రతిపక్ష లేబర్ పార్టీ అవిశ్వాస తీర్మానం, బ్రెగ్జిట్ చర్చల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ నేతలు ఆమెపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి థెరిసా రాజీనామా చేస్తారనే వార్తలు గతకొంత కాలంగా బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒత్తిడికి తలవొంచిన మే చివరకు రాజీనామా బాట పట్టారు. ‘‘రెండవ మహిళా ప్రధాన మంత్రిగా దేశానికి సేవలందించడం నా అదృష్టం. కానీ ఖచ్చితంగా ఇది చివరిది కాదు." అని మే వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు ‘కాంప్రమైజ్ ఈజ్ నాట్ ఏ డర్టీ వర్డ్’ నికోలస్ వింటన్ కోట్‌ను ఆమె ఉటంకించారు.
Comments
Please login to add a commentAdd a comment