PM Theresa may
-
బ్రెగ్జిట్ వైఫల్యం : థెరిసా మే రాజీనామా
లండన్ : బ్రిటన్ ప్రధాని థెరిసా మే సంచలన నిర్ణయం. జూన్ 7 శుక్రవారం నాడు తాను రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఎంపీల మద్దతు దక్కించుకోవడంలో తీవ్రంగా విఫలమైన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దేశంకోసం నిబద్ధతతో పనిచేశానని ఇందుకు తాను గర్వపడుతున్నానన్నారు. జూన్ 7న కన్జర్వేటివ్ పార్టీ నేతగా రాజీనామా చేయనున్నానని, కొత్త నాయకుడి ఎన్నిక ప్రక్రియ ఆ తరువాతి వారం మొదలుకానుందని పేర్కొన్నారు. అప్పటివరకు తాను ప్రధానిగా కొనసాగుతానని తెలిపారు బ్రెగ్జిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన నిరసనలు, ఆందోళనలు, బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ అవిశ్వాస తీర్మానం, బ్రెగ్జిట్ చర్చల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ నేతలు ఆమెపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి థెరిసా రాజీనామా చేస్తారనే వార్తలు గతకొంత కాలంగా బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒత్తిడికి తలవొంచిన మే చివరకు రాజీనామా బాట పట్టారు. ‘‘రెండవ మహిళా ప్రధాన మంత్రిగా దేశానికి సేవలందించడం నా అదృష్టం. కానీ ఖచ్చితంగా ఇది చివరిది కాదు." అని మే వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు ‘కాంప్రమైజ్ ఈజ్ నాట్ ఏ డర్టీ వర్డ్’ నికోలస్ వింటన్ కోట్‌ను ఆమె ఉటంకించారు. -
లండన్ ఉగ్రదాడి
ఇతర సంపన్న దేశాలతోపాటు తాను కూడా నాయకత్వం వహించి అమలు చేసిన ప్రపంచీకరణ పర్యవసానాల నుంచి ఎలా బయటపడాలా అని బ్రిటన్ గుంజాటన పడుతున్నవేళ... ఆ దేశ రాజధాని లండన్‌లో బుధవారం ఉగ్రవాద దాడి జరిగింది. పార్లమెంటుకు కూతవేటు దూరంలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో అతనితో పాటు నలుగురు మరణించిన తీరు, అందుకు తామే బాధ్యులమంటూ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు ప్రకటించుకోవడం గమనిస్తే ప్రపంచంలో ఎలాంటి అభద్రతా వాతావరణం నెలకొని ఉన్నదో అర్ధమవుతుంది. దుండగుడు ఒక్కడుగా వచ్చి కారు నడుపుతూ వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జిపై ఇద్దరు పౌరుల్ని చంపేశాడు. దాదాపు 40మందిని గాయపరిచాడు. పార్లమెంటు ఆవరణలోకి వెళ్లబోతుండగా అడ్డుకున్న పోలీసు అధికారిపై కత్తితో దాడిచేసి హతమార్చాడు. ఈ క్రమంలో మరో పోలీస్ అతన్ని కాల్చిచంపాడు. అనంతరం లండన్, బర్మింగ్‌హాం నగరాల్లో దాడులు చేసి ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నిరుడు జూలైలో ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలోనూ, అనంతరం డిసెంబర్లో అదే దేశంలోని బెర్లిన్‌లోనూ అచ్చం ఈ తరహాలోనే ఉగ్రవాద దాడులు జరిగాయి. ఆ రెండుచోట్లా వాహనాలను ఇష్టాను సారం నడిపి జనం ప్రాణాలు తీశారు. నీస్ దాడిలో 86మంది ఉసురుతీస్తే, బెర్లిన్ దాడిలో 12మందిని పొట్టనబెట్టుకున్నారు. వేర్వేరు దేశాల్లో ఇలా ఉగ్రవాద దాడులకు తెగబడుతున్న ఐఎస్ తీరే వేరు. దాని అడుగుజాడలను పసిగట్టడానికి, దాని సానుభూతిపరులెవరో గుర్తించడానికి అవసరమైన పకడ్బందీ ఉపకరణాలు పాశ్చాత్య దేశాల వద్ద ఇప్పటికైతే లేవనే చెప్పాలి. దాడి జరిగాక ఆ ఉగ్రవాది ఎవరో, అతడికి ఎవరెవరితో సంబంధా లున్నాయో ఆరా తీసి నిర్బంధించడం సాధారణమే. సంస్థకు నిర్వాహకులు, వారు చెప్పినట్టల్లా నడుచుకునే కార్యకర్తలు ఉంటే... వారి మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే నెట్వర్క్ నడుస్తుంటే ఏదో ఒకచోట అది లీక్ అవుతుంది. ముందస్తు సమాచారం అందుతుంది. కానీ ఇంతకు ముందుగానీ, ఇప్పుడుగానీ దుండగుల కార్యకలాపాల గురించి అలాంటి సమాచారం లేదు. వారు అంతటి దారుణానికి పాల్పడగలరన్న అనుమానం కుటుంబసభ్యులకు లేదా ఇరుగు పొరుగుకు ఎప్పుడూ రాలేదు. ఐఎస్ సంస్థ తీరుతెన్నులే ఇలా ఉంటున్నాయి. వారికి సామాజిక మాధ్యమాలు తప్ప వేరే వాహికలు లేవు. ఆదేశాలివ్వడం, అమలు చేయడమన్న విధానాలే ఉండవు. వారు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసే వీడియోలు, ప్రకటనలు చూసి వాటి స్ఫూర్తితో ఉగ్రవాద ఉదంతాలకు పాల్పడు తున్న సందర్భాలే అధికం. ఇందువల్ల ఐఎస్‌కు రెండు రకాల ప్రయోజనాలు ఏకకాలంలో నెరవేరుతున్నాయి. తాము ఖండాంతరాల్లో ఉండి సంపన్న దేశాల్లోని ప్రధాన నగరాలల్లో దారుణానికి పాల్పడి ప్రపంచం దృష్టిని ఆకర్షించడం, తమను అణచడం సాధ్యం కాదన్న సందేశాన్ని పంపడం ఇందులో ఒకటైతే... దాడి జరిగిన దేశంలో ఉండే ముస్లిం మతస్తులపై అక్కడి పాలకులూ, పోలీసులూ, సమాజమూ అనుమాన దృక్కులు సారించేలా చేయడం రెండోది. ఇది ఎంత ఎక్కువగా సాగితే అంత ఎక్కువగా ఆయా దేశాల్లోని ముస్లింలు న్యూనతకు లోనవుతారు... వివక్షకు గురవుతారు... చివరకు తమ వైపు చూస్తారు అన్నదే ఉగ్రవాదుల ఎత్తుగడ. ఆయా దేశాల పాలకులు ఉగ్రవాదుల ఎత్తుగడలను బలపర్చే తరçహాలో వ్యవహరి స్తున్నారు. ఈ సందర్భంగా రెండేళ్లక్రితం అమెరికా, బ్రిటన్లలో జరిగిన ఘటనలు గుర్తు తెచ్చు కోవాలి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు సొంతంగా తయారుచేసిన గడియారాన్ని టీచర్లకు చూపించి వారి మెప్పు పొందు దామని తీసుకెళ్తే ఆ టీచర్లు దాన్ని బాంబును చూసినట్టు చూశారు. నిలువెల్లా వణికి, పోలీసులకు పట్టించి ఇచ్చారు. వారొచ్చి ఆ భయాలను పోగొట్ట డానికి బదులు అతని చేతులు వెనక్కి విరిచి కట్టి జువెనైల్ హోంకు తీసుకెళ్లి అయిదు గంటలపాటు ప్రశ్నించారు. బాంబు తయారు చేయడం కోసం ముందుగా ఆ గడియారాన్ని రూపొందించావంటూ దబాయించారు. బ్రిటన్‌లోనూ ఇంతే. పర్యా వరణంపై తరగతి గదిలో పాఠం చెబుతున్న టీచర్ నుంచి వివరణ కోరుతూ ఒక విద్యార్థి ‘ఇకో టెర్రరిస్టు’(పర్యావరణ ఉగ్రవాది) అనే పదం వాడాడు. అంతే...ఆ టీచర్ పోలీసులకు సమాచారం అందించడం, వారు అతడిని ఓ గదిలో బంధించి ఆ పదం నీకెలా తెల్సు... ఎక్కడ విన్నావు... ఐఎస్ గురించి నీకు తెలుసా అంటూ ప్రశ్నించడం వంటివి జరిగిపోయాయి. చిన్న వయసులోనే పర్యావరణ స్పృహ ఉన్నందుకు అతడిని ప్రశంసించకపోగా శంకించారు. గత నెలలో కేవలం ముస్లిం అన్న అనుమానంతో తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ను ఒక శ్వేత జాతీయుడు పొట్టనబెట్టుకున్నాడు. ఆ తర్వాత మరికొన్ని చోట్ల ఇలాంటి దాడులే జరిగాయి. సమాజంలో అన్ని వర్గాల సహకారాన్నీ తీసుకుని ఉగ్రవాదాన్ని తుద ముట్టించడానికి అవసరమైన చైతన్యాన్ని కలిగించాల్సిన పాశ్చాత్య ప్రభుత్వాలు నీడను చూసి భయపడే స్థాయికి పౌరులను దిగజారుస్తున్నాయి. దాడి జరిగాక దుండగుడు ఆసియా పౌరుడు అయి ఉండొచ్చని పోలీసులు ప్రకటించారు. దర్యా ప్తులో అతను లండన్‌కు పొరుగునున్న కెంట్ నివాసి అని తేలింది. అంతక్రితం ఇతర కేసుల్లో అరెస్టయి శిక్షలు పడటమే కాక... బ్రిటన్ పోలీసు విభాగం ఎంఐ5 నిఘాలో కూడా అతనున్నాడని పోలీసులు చెబుతున్నారు. లండన్ వంటి మహా నగరాల్లో అందరిపైనా నిఘా ఉంచడం కష్టమే. కానీ చిన్న చిన్న జాగ్రత్తలతో ఇలాంటి ఘోరాలను నివారించడం అసాధ్యమేమీ కాదు. దాదాపు పదిహేనేళ్లుగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నా వాటితో వ్యవహరించడంలో ప్రతిసారీ తప్పటడుగులు పడుతున్నాయి. ఏదైనా దాడి జరిగిన వెంటనే పౌరుల్లో మరింతగా ఆందోళన పెంచే తరహా ప్రకటనలు పాలకుల నుంచి వెలువడుతున్నాయి. సమాజంలో అందరూ ఒక్కటై ఎదుర్కొన వలసిన ఉగ్రవాదం విషయంలో మరింత అప్రమత్తత, మూలా లను గుర్తించి తుదముట్టించే తరహాలో చర్యలుండటం అవసరమని లండన్ దాడి వెల్లడిస్తోంది. -
బ్రిటన్ పార్లమెంట్‌పై టెర్రర్ అటాక్
-
బ్రిటన్ పార్లమెంట్‌పై టెర్రర్ అటాక్
- ‘పార్లమెంట్’పైకి కారులో దూసుకొచ్చిన ముష్కరుడు - పోలీసుపై కత్తితో దాడి చేసి హత్య.. కాల్పుల్లో ఉగ్రవాది హతం - అంతకుముందు థేమ్స్ బ్రిడ్జిపై కారుతో బీభత్సం - ఇద్దరు పాదచారులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది - పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ఘటన - హుటాహుటిన ప్రధాని థెరిసా మేను సురక్షిత ప్రాంతానికి తరలించిన సిబ్బంది లండన్: బ్రిటన్ పార్లమెంటుపై ఉగ్రపంజా.. కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న లండన్‌పై ఓ ఉగ్రవాది విరుచుకుపడ్డాడు. థేమ్స్ బ్రిడ్జిపై కారుతో బీభత్సం సృష్టించి.. సమీపంలోని పార్లమెంట్‌ను టార్గెట్ చేశాడు. బ్రిడ్జిపై కారును వేగంగా నడిపి ఇద్దరిని పొట్టనబెట్టుకొని.. పార్లమెంట్ భవనం వద్దా ఓ పోలీసు అధికారిని కత్తితో పొడిచి చంపాడు. చివరికి పోలీసుల కాల్పుల్లో అతడు హతమయ్యాడు. బుధవారం పార్లమెంటులో సమావేశాలు జరుగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఏం జరిగింది..? పార్లమెంటు సమీపంలోని వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జిపై ముష్కరుడు కారుతో బీభత్సం సృష్టించాడు. బూడిద రంగు హ్యుందాయ్ ఐ40 కారులో పేవ్మెంట్ పైనున్న పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఇందులో ఓ మహిళ సహా ఇద్దరు చనిపోయారు. 20 మంది దాకా గాయపడ్డారు. బ్రిడ్జిపై విధ్వంసం సృష్టించిన ఉగ్రవాది.. అదే కారులో వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్(పార్లమెంట్ భవనం) వైపు వెళ్లాడు. అక్కడ కారు ఇనుప రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోయింది. పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్, ప్రఖ్యాత బిగ్‌బెన్ గడియారం ఈ భవనంలోనే ఉన్నాయి. పార్లమెంట్ ప్రధాన ద్వారం గుండా భవనం లోపలికి చొరబడేందుకు యత్నించిన ముష్కరుడు అక్కడి ఒక పోలీసు అధికారిని కత్తితో పొడిచాడు. మరో అధికారిని పొడవబోతుండగా సివిల్ దుస్తుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దుండగుడిపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పుల మోత నడుమ.. ప్రధాని థెరిసా మేను కారులో అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఆమె క్షేమంగా ఉన్నారని, తన కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారని ప్రధాని కార్యాలయం తెలిపింది. భద్రతా సిబ్బంది ఘటనా స్థలిని చుట్టుముట్టారు. ఎమర్జెన్సీ హెలికాప్టర్ పార్లమెంటు ఆవరణలో దిగింది. ఎంపీలను, సిబ్బందిని పార్లమెంటులోనే ఉంచారు. సమీప భవనాల్లోని ఉద్యోగులనూ బయటికి రానివ్వలేదు. కాల్పులతో హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశాలను నిలిపేశారు. మరోవైపు లండన్ పోలీసు గుప్పిట్లోకి వెళ్లింది. పోలీసు హెలికాప్టర్లు నగరంలో చక్కర్లు కొట్టాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. లండన్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ప్రధానితో మాట్లాడారు. ఉగ్రపోరులో అన్ని రకాలుగా సాయం అందిస్తామన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ ఖండన.. లండన్ దాడిని భారత్ ఖండించింది. ప్రజాస్వామ్యాల్లో, నాగరిక సమాజాల్లో ఉగ్రవాదానికి తావు లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్వీట్ చేశారు. బ్రిడ్జిపై దాడిలో భారతీయులెవరైనా గాయపడి ఉంటే తమ సహాయక బృందాన్ని, info. london @ hcilondon. in; 02086295950లను సంప్రదించాలని భారత హైకమిషన్ సూచించింది. ముగ్గురు ఫ్రాన్స్ విద్యార్థులకు గాయాలు పారిస్: ఈ దాడిలో ఫ్రాన్స్‌కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థులకు గాయాలయ్యాయని ఆ దేశ విదేశాంగ మంత్రి రుమైన్ నాదల్ చెప్పారు. వారంతా లండన్‌కు స్కూల్ ట్రిప్‌లో భాగంగా వెళ్లిన వారని తెలిపారు. విద్యార్థులంతా బ్రిడ్జిపై ఉన్నప్పుడు ఈ ముగ్గురిని కారు ఢీకొందని స్థానిక పత్రిక వెల్లడించింది. అరుపులు.. కేకలు పార్లమెంటు ఘటనకు సమీపంలోని ప్రెస్ అసోసియేషన్ సంస్థ పొలిటికల్ ఎడిటర్ ఆండ్రూ ఉడ్‌కాక్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. తన ఆఫీసు కిటికీ గుండా చూసిన వివరాలను ఆయన వెల్లడించారు. ‘అరుపులు, కేకలు వినిపించడంతో అటువైపు చూశాను. 40 నుంచి 50 మంది బ్రిడ్జ్ స్ట్రీట్ నుంచి పార్లమెంట్ స్క్వేర్‌వైపు ఏదో తరుముకొస్తున్నట్లు పరిగెతుడూ వచ్చారు. భద్రతా సిబ్బంది కాపలా కాస్తున్న క్యారేట్ గేట్స్ వద్దకు రాగానే ఆ గుంపులోంచి ఒక వ్యక్తి ఆవరణలోకి ఉరికాడు. అతని చేతిలో వంటగదిలో వాడే పొడవాటి కత్తి ఉన్నట్లు కనిపించింది’అని ఆయన వివరించారు. నోటితో శ్వాస అందించిన మంత్రి ముష్కరుడి కత్తిపోట్లకు బలైన పోలీసు అధికారి ప్రాణాలు కాపాడేందుకు బ్రిటన్ విదేశాంగ సహాయ మంత్రి తోబియాస్ ఎల్వుడ్.. క్షతగాత్రుడి నోటిలో నోరు ఉంచి శ్వాస అందించారు. రక్తస్రావం కాకుండా గాయాలను అదిమిపెట్టారు. అయినా ఫలితం లేకపో యిందని, ఆ అధికారి చనిపోయాడని తోబియాస్ తెలిపారు. ఇండోనే సియాలోని బాలిలో జరిగిన ఉగ్రదాడిలో తోబియాస్ సోదరుడు చనిపోవడం గమనార్హం.