బ్రిటన్‌ పార్లమెంట్‌పై టెర్రర్‌ అటాక్‌ | Terror attack on Britain Parliament, several dead | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ పార్లమెంట్‌పై టెర్రర్‌ అటాక్‌

Published Thu, Mar 23 2017 1:52 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

Terror attack on Britain Parliament, several dead


- ‘పార్లమెంట్‌’పైకి కారులో దూసుకొచ్చిన ముష్కరుడు
- పోలీసుపై కత్తితో దాడి చేసి హత్య.. కాల్పుల్లో ఉగ్రవాది హతం
- అంతకుముందు థేమ్స్‌ బ్రిడ్జిపై కారుతో బీభత్సం
- ఇద్దరు పాదచారులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది
- పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ఘటన
- హుటాహుటిన ప్రధాని థెరిసా మేను సురక్షిత ప్రాంతానికి తరలించిన సిబ్బంది


లండన్‌:
బ్రిటన్‌ పార్లమెంటుపై ఉగ్రపంజా.. కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న లండన్‌పై ఓ ఉగ్రవాది విరుచుకుపడ్డాడు. థేమ్స్‌ బ్రిడ్జిపై కారుతో బీభత్సం సృష్టించి.. సమీపంలోని పార్లమెంట్‌ను టార్గెట్‌ చేశాడు. బ్రిడ్జిపై కారును వేగంగా నడిపి ఇద్దరిని పొట్టనబెట్టుకొని.. పార్లమెంట్‌ భవనం వద్దా ఓ పోలీసు అధికారిని కత్తితో పొడిచి చంపాడు. చివరికి పోలీసుల కాల్పుల్లో అతడు హతమయ్యాడు. బుధవారం పార్లమెంటులో సమావేశాలు జరుగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.

ఏం జరిగింది..?
పార్లమెంటు సమీపంలోని వెస్ట్‌మినిస్టర్‌ బ్రిడ్జిపై ముష్కరుడు కారుతో బీభత్సం సృష్టించాడు. బూడిద రంగు హ్యుందాయ్‌ ఐ40 కారులో పేవ్‌మెంట్‌ పైనున్న పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఇందులో ఓ మహిళ సహా ఇద్దరు చనిపోయారు. 20 మంది దాకా గాయపడ్డారు. బ్రిడ్జిపై విధ్వంసం సృష్టించిన ఉగ్రవాది.. అదే కారులో వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌(పార్లమెంట్‌ భవనం) వైపు వెళ్లాడు. అక్కడ కారు ఇనుప రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోయింది. పార్లమెంటు దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్, ప్రఖ్యాత బిగ్‌బెన్‌ గడియారం ఈ భవనంలోనే ఉన్నాయి. పార్లమెంట్‌ ప్రధాన ద్వారం గుండా భవనం లోపలికి చొరబడేందుకు యత్నించిన ముష్కరుడు అక్కడి ఒక పోలీసు అధికారిని కత్తితో పొడిచాడు. మరో అధికారిని పొడవబోతుండగా సివిల్‌ దుస్తుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

దుండగుడిపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పుల మోత నడుమ.. ప్రధాని థెరిసా మేను కారులో అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఆమె క్షేమంగా ఉన్నారని, తన కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారని ప్రధాని కార్యాలయం తెలిపింది. భద్రతా సిబ్బంది ఘటనా స్థలిని చుట్టుముట్టారు. ఎమర్జెన్సీ హెలికాప్టర్‌ పార్లమెంటు ఆవరణలో దిగింది. ఎంపీలను, సిబ్బందిని పార్లమెంటులోనే ఉంచారు. సమీప భవనాల్లోని ఉద్యోగులనూ బయటికి రానివ్వలేదు. కాల్పులతో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సమావేశాలను నిలిపేశారు. మరోవైపు లండన్‌ పోలీసు గుప్పిట్లోకి వెళ్లింది. పోలీసు హెలికాప్టర్లు నగరంలో చక్కర్లు కొట్టాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. లండన్‌ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బ్రిటన్‌ ప్రధానితో మాట్లాడారు. ఉగ్రపోరులో అన్ని రకాలుగా సాయం అందిస్తామన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

భారత్‌ ఖండన..
లండన్‌ దాడిని భారత్‌ ఖండించింది. ప్రజాస్వామ్యాల్లో, నాగరిక సమాజాల్లో ఉగ్రవాదానికి తావు లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్‌ బాగ్లే ట్వీట్‌ చేశారు. బ్రిడ్జిపై దాడిలో భారతీయులెవరైనా గాయపడి ఉంటే తమ సహాయక బృందాన్ని, info. london @ hcilondon. in; 02086295950లను సంప్రదించాలని భారత హైకమిషన్‌ సూచించింది.

ముగ్గురు ఫ్రాన్స్‌ విద్యార్థులకు గాయాలు
పారిస్‌: ఈ దాడిలో ఫ్రాన్స్‌కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థులకు గాయాలయ్యాయని ఆ దేశ విదేశాంగ మంత్రి రుమైన్‌ నాదల్‌ చెప్పారు. వారంతా లండన్‌కు స్కూల్‌ ట్రిప్‌లో భాగంగా వెళ్లిన వారని తెలిపారు. విద్యార్థులంతా బ్రిడ్జిపై ఉన్నప్పుడు ఈ ముగ్గురిని కారు ఢీకొందని స్థానిక పత్రిక వెల్లడించింది.

అరుపులు.. కేకలు
పార్లమెంటు ఘటనకు సమీపంలోని ప్రెస్‌ అసోసియేషన్‌ సంస్థ పొలిటికల్‌ ఎడిటర్‌ ఆండ్రూ ఉడ్‌కాక్‌ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. తన ఆఫీసు కిటికీ గుండా చూసిన వివరాలను ఆయన వెల్లడించారు. ‘అరుపులు, కేకలు వినిపించడంతో అటువైపు చూశాను. 40 నుంచి 50 మంది బ్రిడ్జ్‌ స్ట్రీట్‌ నుంచి పార్లమెంట్‌ స్క్వేర్‌వైపు ఏదో తరుముకొస్తున్నట్లు పరిగెతుడూ వచ్చారు. భద్రతా సిబ్బంది కాపలా కాస్తున్న క్యారేట్‌ గేట్స్‌ వద్దకు రాగానే ఆ గుంపులోంచి ఒక వ్యక్తి ఆవరణలోకి ఉరికాడు. అతని చేతిలో వంటగదిలో వాడే పొడవాటి కత్తి ఉన్నట్లు కనిపించింది’అని ఆయన వివరించారు.

నోటితో శ్వాస అందించిన మంత్రి
ముష్కరుడి కత్తిపోట్లకు బలైన పోలీసు అధికారి ప్రాణాలు కాపాడేందుకు బ్రిటన్‌ విదేశాంగ సహాయ మంత్రి తోబియాస్‌ ఎల్‌వుడ్‌.. క్షతగాత్రుడి నోటిలో నోరు ఉంచి శ్వాస అందించారు. రక్తస్రావం కాకుండా గాయాలను అదిమిపెట్టారు. అయినా ఫలితం లేకపో యిందని, ఆ అధికారి చనిపోయాడని తోబియాస్‌ తెలిపారు. ఇండోనే సియాలోని బాలిలో జరిగిన ఉగ్రదాడిలో తోబియాస్‌ సోదరుడు చనిపోవడం గమనార్హం.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement