Britain Parliament
-
రిషి సునాక్‌పై తీవ్ర విమర్శలు చేసిన బ్రిటన్ ఎంపీ
లండన్: బ్రిటిష్ మాజీ కల్చర్ సెక్రెటరీ నాడైన్ డోరీస్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో ప్రధాని రిషి సునాక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బోరిస్ జాన్సన్ ఎంపీగా రాజీనామా చేసినప్పుడే ఆమె కూడా రాజీనామా చేయాల్సి ఉంది కానీ అప్పుడు ఆమె రాజీనామా చేయనందుకు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు రాజీనామా చేసిన ఆమె రిషి సునాక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ భారీ లేఖను రాశారు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అత్యంత సన్నిహితురాలైన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ నాడైన్ డోరీస్ చాలా కాలంగా రిషి సునాక్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ప్రధాని జాంబీల ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయనకు ఎటువంటి రాజకీయ ముందుచూపు లేదన్నారు. రిషి సునాక్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఆర్ధిక పరమైన కుంభకోణాలతో పాటు మరికొన్ని కుంభకోణాల కారణంగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవి నుండి తప్పుకున్నారు. మాజీ ఆర్ధిక మంత్రి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన రిషి సునాక్ పార్టీ నాయకత్వ పోటీలో నామినేట్ చేయబడిన ఏకైక అభ్యర్థి కావడంతో ప్రధానిగా నియమితులయ్యారు. ఎంపీ రాసిన రాజీనామా లేఖ సంగతి అటుంచితే రిషి సునాక్ ప్రభుత్వం ప్రస్తుతానికైతే వెంటిలేటర్‌పైనే ఉండాలి చెప్పాలి. కొద్దీ రోజుల క్రితం ఖాళీ అయిన పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ రెండు స్థానాలను కోల్పోగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన చోట మాత్రం గెలిచింది. ప్రధాని రిషి సునక్ తన సాంకేతిక నాయకత్వాన్ని ఉపయోగించుకుని పార్టీ విశ్వసనీయతను కాపాడుకంటూ వస్తున్నారు. కానీ అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక స్తబ్దత, పారిశ్రామిక అస్థిరత ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో జాప్యం వంటి కారణాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఈ కారణాల వల్లనే వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థి లేబర్ పార్టీ కంటే చాలా వెనుకబడి ఉన్నారని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. -
బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం
లండన్: బ్రిటన్ రాజు హోదాలో కింగ్ ఛార్లెస్–3 పార్లమెంట్లో తొలి ప్రసంగం చేశారు. సోమవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉభయ సభల సభ్యులనుద్దేశిస్తూ మాట్లాడారు. ‘‘దివికేగిన ప్రియమైన మాతృమూర్తి నిస్వార్థ సేవకు ప్రతిరూపం. ప్రజాసేవకు అంకితమైన రాణి ఎలిజబెత్ బాటలో నడుస్తూ రాజ్యాంగబద్ధ అత్యున్నత పాలనా ప్రమాణాలను కొనసాగిస్తా. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన బ్రిటన్ పార్లమెంట్లో క్వీన్ ఎలిజబెత్ సేవను మరోసారి స్మరించుకుందాం. దేవుడి, మీ పరిపూర్ణ సహకారంతో నా బాధ్యతలు నిర్వరిస్తా’’ అని అన్నారు. అస్తమయం చెందిన రాణి ఎలిజబెత్–2కు ఎంపీలు సహా దాదాపు 900 మంది ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు, రాణి పార్థివదేహాన్ని మంగళవారం స్కాట్లాండ్ నుంచి లండన్‌కు వాయు మార్గంలో తీసుకురానున్నారు. ఇదీ చదవండి: చనిపోయే ముందు వాళ్లకు రాణి గ్రీటింగ్స్!! -
బ్రిటన్ కొత్త ప్రధాని ఎంపిక రేసులో 11 మంది.. ముహూర్తం ఫిక్స్!
లండన్: బ్రిటన్ కొత్త ప్రధాని ఎంపికకు ముహూర్తం ఖరారు చేసింది అధికార కన్జర్వేటివ్ పార్టీ. సెప్టెంబర్ 5న పార్టీ నాయకుల సమక్షంలో కొత్త ప్రధాని పేరును అధికారికంగా ప్రకటించనుంది. ప్రధాని పదవికి పోటీ పడేందుకు 11 మంది నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో ఉండాలనుకునేవారు నామినేషన్లు సమర్పించేందుకు మంగళవారం ఒక్కరోజే గడువుంది. వేసవి విరామం అనంతరం బ్రిటన్ పార్లమెంట్ సెప్టెంబర్‌లోనే తిరిగి ప్రారంభమవుతుంది. అప్పుడే కొత్త ప్రధాని ప్రకటన ఉండనుంది. రౌండ్ల వారీగా ఓటింగ్.. ప్రధాని పదవికి పోటీ పడాలనుకునే వారికి కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలి. పోటీలో ఉన్నవారిని పార్టీ నేతలు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. రౌండ్ల వారీగా ఓటింగ్ నిర్వహించి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. చివరకు మిగిలిన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే కన్జర్వేటివ్ పార్టీ నూతన సారథిగా, ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు. ఈ ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమవుతుంది. కొత్త ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ఉన్నారు. మొన్నటివరకు ఆర్థిక మంత్రిగా సేవలందించిన ఈయన బోరిస్ జాన్సన్ కేబినెట్ నుంచి మొదటగా తప్పుకున్నారు. ఆ తర్వాత సొంత ప్రభుత్వంలో మంత్రులతో పాటు మొత్తం 58 మంది రాజీనామా చేశారు. దీంతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బోరిస్ ప్రకటించారు. కొత్త ప్రధాని ఎంపిక జరిగేవరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానన్నారు. చదవండి: Who Is Rishi Sunak: బ్రిటన్ తదుపరి ప్రధానిగా భారత సంతతి వ్యక్తి! అదే నిజమైతే చరిత్రే.. -
‘పసిపిల్లలను పార్లమెంట్‌కు తీసుకురావద్దు’... బ్రిటన్‌లో దుమారం
లండన్: బ్రిటన్ పార్లమెంట్ లోకి పసిపిల్లలను తీసుకురావద్దని ఆంక్షలు విధించడం అక్కడ తీవ్రమైన నిరసనకు దారితీసింది. పార్లమెంట్ లోకి చిన్నారులను తీసుకురావద్దంటూ ఓమహిళా ఎంపీకి ఈ మెయిల్స్ పంపారు. ఈ క్రమంలో వివాదం రాజుకుంది. అయితే వీటిపై స్పందించిన ఓ ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ నియమాళికి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, పనిచేసే తల్లులకు పిల్లల సంరక్షణ చూసుకునేలా వేసులుబాటు కల్పించాలంటూ చర్చ చేపట్టారు. వివాదం రాజుకుంది ఇలా.. వెస్ట్‌మినిస్టర్ హాల్లో మంగళవారం తన మూడు నెలల కొడుకుతో కలిసి ఎంపీ స్టెల్లా క్రీసీ పార్లమెంట్ చర్చలో పాల్గొన్నారు. చర్చకు హాజరైన తర్వాత బిడ్డను పార్లమెంట్ కు తీసుకురావడం నిబంధనలకు విరుద్ధమని ఎంపీకి పార్లమెంటు దిగువ సభ ప్రతినిధి చెప్పారు. మంగళవారం కాన్ఫరెన్స్‌లో బైనౌపే లేటర్ కన్స్యూమర్ క్రెడిట్ స్కీమ్‌ల గురించి చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్నఆమె పసికందును స్లింగ్లో ఛాతీకి కట్టుకుని హాజరయ్యారు. క్రీసీ చర్యలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్‌కు ఇలా పిల్లలను తీసుకురావడం సమస్య కాలేదని నిలదీసిన క్రీసీ... దీనిపై కామన్స్ అధికారుల నుంచి ఆమె వివరణ కోరింది. ఇదివరకు తన పిల్లలిద్దరినీ ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే హౌస్ ఆఫ్ కామన్స్లోకి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ట్విట్టర్లో షేర్ చేయడంతో నిరసన తనకు ఎదురైన అనుభవం గురించి క్రీసీ ట్విట్టర్లో షేర్ చేసింది. నేను ఛాంబర్లో మాట్లాడేటప్పుడు నా 3 నెలల... నిద్రపోతున్న బిడ్డను తీసుకుపోకూడదని (ఇప్పటికీ పార్లమెంట్ లో మాస్క్‌లు ధరించాలనే నియమం లేదని విమర్శించారు ) నాకు నోటిసులు పంపారు’’ అని ఆమె ట్విట్టర్లో తనకు పంపిన లెటర్ ను షేర్ చేశారు. తనకు పార్లమెంట్ ప్రసూతి కవరేజ్ లేదని... అది కలిగి ఉండటానికి ఉపాధి హక్కులు లేవని ఎంపీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వివరించారు. పెద్ద ఎత్తున నిరసనలు... క్రీసీ లెటర్ ఆన్లైన్లో పెద్ద ఎత్తున నిరసనకు దారితీసింది. ఈ విషయంపై అన్ని రంగాల్లోని మహిళలు నిరసనగళం వినిపించారు. తమ ఉద్యోగాలను సులభతరం చేయడానికి పార్లమెంట్ నిబంధనలను మార్చాలని పలువురు మహిళా చట్టసభ సభ్యులు కోరారు. ఎంపీలకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదని నిలదీశారు. పనిచేసే ప్రాంతానికి శిశువును తీసుకెళ్లాడనికి చాలా చోట్ల అనుమతించడం లేదని పలువురు మహిళలు వాపోయారు. తమ బిడ్డను వేరే వాళ్లకి అప్పగించి చూసుకోమని చెప్పడానికి ఆర్థిక స్థోమత లేదని ఆవేదన వెలిబుచ్చారు. సోషల్ మీడియా ఆగ్రహం అనంతరం... ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీసింది. నెటిజన్ల ఆగ్రహం అనంతరం... తాము ఈ విషయాన్ని సమీక్షిస్తున్నట్లు హౌస్ ఆఫ్ కామన్స్ ప్రతినిధి చెప్పారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఎంపీలందరూ పార్లమెంటులో తమ విధులను నిర్వహించగలగడం చాలా ముఖ్యం. సభ్యులు ఎప్పుడైనా ఛాంబర్లో లేదా వెస్ట్మిన్స్టర్ హాల్లో ఉన్నప్పుడు తమ అవసరాల గురించి స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు, క్లర్క్‌లు, డోర్కీపర్లతో సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఈ విషయం గురించి స్టెల్లా క్రీసీతో మాట్లాడుతున్నట్లు వివరించారు. ఇదేం కొత్త కాదు... శిశువులను పార్లమెంటుకు తీసుకురావడం ఇదేం కొత్త కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజాప్రతినిధులు తమ పిల్లలను చట్టసభలకు తీసుకువెళ్లారు. అన్నెలీస్ డాడ్స్ తన బిడ్డను 2016లో యూరోపియన్ పార్లమెంట్‌కు తీసుకెళ్లడం నుంచి న్యూజిలాండ్ పీఎం జసిండా ఆర్డెర్న్ 2018లో మూడు నెలల కుమార్తెను యూఎన్ జీఏకి తీసుకురావడం ద్వారా చరిత్ర సృష్టించడం వరకు... చాలా మంది మహిళా చట్టసభ సభ్యులు గతంలో ఇలా చేశారు. -
బ్రిటన్ పార్లమెంటులో వేధింపులు!
లండన్: బ్రిటన్ పార్లమెంటులో లైంగిక హింస, బెదిరించడం, విసిగించడం వంటి వేధింపులు ఉన్నాయనీ, వాటిని భరించి, దాచేసే ఇబ్బందికర సంస్కృతి అక్కడ చాలా ఏళ్లుగా కొనసాగుతోందని తాజాగా ఓ విచారణలో తేలింది. ఎంపీలపై వరుస వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ ఏడాది మొదట్లో బ్రిటన్ పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ నాయకురాలు ఆండ్రియా లీడ్సమ్ విచారణకు ఆదేశించారు. విశ్రాంత న్యాయమూర్తి డేమ్ లారా కాక్స్ విచారణ జరిపి రూపొందించిన నివేదిక సోమవారం విడుదలైంది. పార్లమెంటులో ౖసైతం వేధింపులను అడ్డుకట్ట వేయగల సమర్ధ యంత్రాంగం లేకపోవడాన్ని ఈ నివేదిక ఎత్తిచూపింది. 200 మందికి పైగా బాధితులు తాము అనుభవించిన హింసను/ వేధింపులను కాక్స్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుత /మాజీ ఎంపీలు మహిళా సిబ్బందిపై సాగించిన లైంగిక వేధింపుల ఘటనలు నివేదిక ద్వారా వెల్లడయ్యాయి. రూపురేఖలు – వస్త్రధారణపై వ్యాఖ్యానించడం, ఎగతాళి చేయడం, ఇతరుల ముందు అవమానించడం, నడుం చుట్టూ చేతులేయడం, మోకాళ్ల మీద మరింతసేపు చేతులేసి ఉంచడం, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించడం, వక్ష భాగాన్నీ, చేతుల్నీ అసభ్యకర రీతిలో తాకడం, ఆశించిన విధంగా పని చేయని మహిళలపై బూతు పదాలు ప్రయోగించడం సహా ఎన్నో రకాలుగా వేధింపులు సాగాయని ఆమె పేర్కొన్నారు. విచారణ నిబంధనల మేరకు కాక్స్ వ్యక్తుల పేర్లు బయటపెట్టలేదు. ‘కొందరి దురహంకార ప్రవర్తనను కప్పి ఉంచే సంస్కృతి పార్లమెంటులో ఉంది’ అని నివేదికలో లారా పేర్కొన్నారు. సీనియర్ క్కర్లుల నుంచి కూడా మహిళలకు వేధింపులు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. ఉద్యోగులను హింసించడం, రకరకాలుగా వేధించడం, బాధితులకు మద్దతు లభించే వాతావరణం లేకపోవడం, వేధింపుల వ్యవహారాలను కావాలనే కప్పిపెట్టడం, ఫిర్యాదు చేసిన వారికి కనీస రక్షణ లేకపోవడం, వారి పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించక పోవడం దిగువసభలో సర్వసాధారణమైపోయిందని నివేదికలో కాక్స్ స్పష్టం చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు పదవుల నుంచి దిగిపోయే వరకు ఇక్కడ మార్పు రాదని బాధితులు చెప్పినట్లు లారా తెలిపారు. ‘విచారణ సమయంలో కొందరు తెలిపిన అభిప్రాయాల ప్రకారం.. ఇక్కడ సమూల మార్పు సాధ్యమన్న నమ్మకాన్ని బాధితుల్లో కలిగించడం కూడా చాలా కష్టం’ అని 155 పేజీల తన నివేదికలో కాక్స్ వెల్లడించారు. -
వేధింపుల చట్టానికి ఎంపీ అడ్డుపుల్ల
మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ఉద్యమాలు జరిగాయి.(జరుగుతున్నాయి కూడా). ఈ క్రమంలో యూకేలో ఓ యువతి నిర్వహించిన ఉద్యమం పార్లమెంట్(హౌజ్ ఆఫ్ కామన్స్)ను కదిలించింది. అయితే కఠిన చట్టం దిశగా అడుగులు వేసిన క్రమంలో ఓ ఎంపీ వేసిన అడ్డుపుల్ల ప్రజల్లో ఆగ్రహజ్వాలలను రగిల్చింది. సున్నితమైన అంశం, పైగా అధికారపక్ష ఎంపీ కావటం ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. లండన్: గినా మార్టిన్(26) గతేడాది జూలైలో లండన్ హైడ్ పార్క్‌లో జరిగిన ఓ ఫెస్టివల్‌కు తన సోదరితో కలిసి హాజరయ్యింది. ఆ సమయంలో ఆమెను వెంబడించిన కొందరు యువకులు వేధింపులకు దిగారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె స్కర్ట్ కింద నుంచి ఫోన్‌తో ఫోటోలు తీశాడు. అది గమనించి ఆమె వారితో వాగ్వాదానికి దిగింది. ఫోన్ లాక్కుని పరిగెత్తటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటం, వారిని పోలీసులు ప్రశ్నించటం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ వ్యవహారంలో ఆమెకు సరైన న్యాయం జరగలేదు. దీంతో స్టాప్స్కర్టింగ్ పేరిట ఆమె సోషల్ మీడియాలో ఉద్యమాన్ని మొదలుపెట్టింది. కఠిన చట్టం... మహిళల అనుమతి లేకుండా వారిని అభ్యంతకరంగా ఫోటోలు తీయటం నేరమనే ఉద్దేశంతో ఈ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. దీనికి సామాన్యులు, సెలబ్రిటీలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో మద్ధతు ప్రకటించారు. దీంతో చివరకు ఈ వ్యవహారం హౌజ్ ఆఫ్ కామన్స్‌కు చేరింది. అందరి మద్ధతుతో కఠిన చట్టం రూపకల్పన చేయాలని నిర్ణయించారు. లిబరల్ డెమొక్రట్ ఎంపీ వెరా హోప్హౌజ్ ప్రతిపాదిత బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అనుమతులు లేకుండా మహిళల ఫోటోలను తీయటం నిషేధం. అలా కాదని తీస్తే వేధింపుల కిందకే వస్తుంది. నేరం కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తారు. అధికార ఎంపీ అడ్డుపుల్ల... అయితే బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా కన్సర్వేటివ్ ఎంపీ సర్ క్రిస్టోఫర్ చోప్(71) బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి సభలో కలకలం రేపారు. ఆ వెంటనే సభలో ‘సిగ్గు చేటు’ అంటూ ఎంపీలంతా నినాదాలు చేశారు. బిల్లును తాను ఎందుకు వ్యతిరేకిస్తున్న అన్న అంశంపై మాత్రం చోప్ స్పష్టత ఇవ్వలేదు. తోటి ఎంపీలు ఆయన నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేయగా, సొంత పార్టీ ఎంపీ తీరుపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా చోప్ మౌనంగా ఉండటంతో విమర్శలు తారా స్థాయికి చేరాయి. ఉద్యమకారిణి గినా మార్టిన్ కూడా చోప్ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఈ లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టం కార్యరూపం దాల్చటం మాత్రం ఖాయమని అధికార పార్టీ ఎంపీలు చెబుతున్నారు. ఆయనంతే... క్రిస్టోఫర్ చోప్(71)కు వివాదాలు కొత్తేం కాదు. మానవ హక్కులకు సంబంధించిన చట్టం, సమాన వేతన చట్టం, స్వలింగ వివాహ చట్టం.. తదితరాలను వ్యతిరేకించి వార్తల్లో కెక్కారు. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలను నిషేధించాలని, కనీస వేతన చట్టాలను రద్దు చేయాలని, మరణ శిక్షను పునరుద్ధరించాలని, నిర్భంద సైనిక శిక్షణ అమలు చేయాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేసి దుమారం రేపారు. ఇవన్నీ ఒక్క ఎత్తయితే 2013లో హౌజ్ ఆఫ్ కామన్స్ సిబ్బందిని ‘పనివాళ్లుగా’ అభివర్ణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. చోప్ క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయినప్పటికీ ఆ పెద్దాయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. -
ఊరిస్తున్న బ్రిటన్ వీసా..
లండన్: విదేశీ వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూర్చేలా.. తన వలస విధానం(ఇమిగ్రేషన్ పాలసీ)లో మార్పులు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇమిగ్రేషన్ పాలసీలో సవరణల్ని ఆమోదం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. బ్రిటన్ వ్యాపార సంస్థలు, కంపెనీలు తమ అవసరం మేరకు విదేశీ వృత్తి నిపుణుల్ని నియమించుకునేందుకు అవకాశం కల్పించేలా వీసా నిబంధనల్ని సరళతరం చేయాలని ఈ సవరణల్లో ప్రతిపాదించారు. బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయం మన వృత్తి నిపుణులకు మేలు చేకూరుస్తుందని భారత ఐటీ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. విదేశీ వృత్తి నిపుణుల కోసం బ్రిటన్ జారీ చేస్తోన్న టైర్ 2 వీసాల ప్రక్రియలో ఇంతవరకూ కఠిన నిబంధనలు కొనసాగాయి. అయితే బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్ మానవవనరుల కొరతతో ఇబ్బందిపడుతోంది. దాన్ని అధిగమించేందుకు వలస విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. వీసాల పరిమితిని సడలించడంతో పాటు.. ప్రస్తుతం కొనసాగుతున్న కఠిన నిబంధనల్ని సమీక్షించాలని ప్రతిపాదించింది. వేర్వేరు రంగాల్లో ఉద్యోగుల కొరతపై నెలవారీ సమీక్ష నిర్వహించాలని స్వతంత్ర వలసల సలహా కమిటీని కోరతామని పార్లమెంటుకు తెలిపింది. బ్రిటన్ పార్లమెంట్ ప్రకటన ప్రకారం.. ‘ఐరోపాయేతర దేశాల నుంచి బ్రిటన్‌లో పనిచేయడానికి వచ్చే వైద్యులు, నర్సుల్ని టైర్–2 వీసాల పరిధి నుంచి మినహాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఆస్పత్రుల్లో వైద్య నిపుణులు, సిబ్బంది కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది’ అని వెల్లడించారు. ప్రస్తుతం నెలకు 1,600 వరకూ టైర్ 2 వీసాలు జారీ చేస్తుండగా.. ఆ కేటగిరి నుంచి వైద్యులు, నర్సుల్ని మినహాయించడంతో భారతీయ వైద్యులు, నర్సులు లబ్ధి పొందనున్నారు. ఇతర కీలక వృత్తులను టైర్ 2 కేటగిరీ నుంచి మినహాయించవచ్చని భావిస్తున్నారు. సృజనాత్మకత ఉన్న ఫ్యాషన్ డిజైనర్లకు టాలెంట్ వీసాను జారీ చేయనున్నట్లు సవరణల్లో బ్రిటన్ వెల్లడించింది. ఆహ్వానించదగ్గ పరిణామం: ఫిక్కీ బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఫిక్కీ, బ్రిటిష్ పరిశ్రమల సమాఖ్య స్వాగతించాయి. ‘భారతీయ నిపుణులు ఎంతో కాలంగా ఈ డిమాండ్‌ను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టైర్ 2 వీసా కేటగిరీని సులభతరం చేయాలన్న బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో వృత్తి నిపుణులు బ్రిటన్‌లో పనిచేసేందుకు మార్గం సులభతరమవుతుంది. దీర్ఘకాలంలో బ్రిటన్ వ్యాపార సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుంది’ అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) అధ్యక్షుడు రశేష్ షా అన్నారు. రెండు దేశాల మధ్య ఉత్సాహపూరితమైన వాణిజ్య, ఆర్థిక సంబంధాల కోసం స్వేచ్ఛాయుత, నిజాయితీ, పారదర్శకతతో కూడిన వీసా నిబంధనల కోసం ఫిక్కీ ప్రయత్నాలు చేసిందని ఆయన చెప్పారు. బ్రిటన్ వ్యాపార సంస్థలు ఈ సంస్కరణల్ని ఆహ్వానిస్తాయని, అంతర్జాతీయ నైపుణ్యం, ప్రతిభ బ్రిటన్ కంపెనీలకు కీలకమని బ్రిటన్ పరిశ్రమ సమాఖ్యకు చెందిన ముఖ్య అధికారి మాథ్యూ ఫెల్ పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులకు బ్రిటన్ ఝలక్ బ్రిటన్‌లో విద్యార్థి వీసాలకు సంబంధించి ‘లో రిస్క్’ దేశాల జాబితా నుంచి భారత్‌ను మినహాయించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వలస విధానం సవరణల్లో భాగంగా విదేశీ విద్యార్థులకు ఇచ్చే ‘టైర్ 4’ వీసాలకు సంబంధించి 25 దేశాల విద్యార్థులకు నిబంధనల్లో సడలింపు నిచ్చారు. ఈ జాబితాలో ఉన్న అమెరికా, కెనడా, న్యూజిలాండ్ తదితర దేశాలకు ఎప్పటినుంచో సడలింపు కొనసాగుతుండగా.. తాజాగా చైనా, బహ్రైన్, సెర్బియా తదితర దేశాల్ని చేర్చారు. జూలై 6 నుంచి ఇది అమల్లోకి రానుంది. జాబితాలోని దేశాలకు చెందిన విద్యార్థులు పెద్దగా తనిఖీలు ఎదుర్కోవాల్సిన అవసరముండదు. అయితే మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులు కఠిన తనిఖీలు ఎదుర్కోక తప్పదు. ఇది అవమానకరమని, తప్పుడు సంకేతాలు పంపుతుందని భారత సంతతి వ్యాపారవేత్త లార్డ్ కరణ్ బిలిమోరియా విమర్శించారు. -
లైంగిక వేధింపులు.. ఒప్పుకుని మరీ రాజీనామా
లండన్ : ప్రపంచ వ్యాప్తంగా లైంగిక వేధింపుల పర్వాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సెలబ్రిటీలు మీడియా ముందుకు వస్తుండటంతో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో యునైటెడ్ కింగ్డమ్(బ్రిటీష్) రక్షణ కార్యదర్శి మైకేల్ ఫాల్లొన్ పేరు కూడా వినిపించటంతో... ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు. అయితే గతంలో తాను మహిళలను వేధించిన మాట వాస్తవమేనని ఆయన తప్పు అంగీకరించటం విశేషం. బుధవారం ఆయన తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి థెరిసా మే కు పంపించారు. ప్రస్తుత ఆరోపణలను ఖండించిన ఆయన.. గతంలో మాత్రం తాను కొన్ని తప్పులు చేశానంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే కార్యదర్శి పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎంపీగా మాత్రం ఆయన కొనసాగనున్నట్లు ప్రకటించారు. కాగా, ఇలా లైంగిక ఆరోపణలు ఎదుర్కుని ఉన్నత పదవికి రాజీనామా చేసిన మొదటి పార్లమెంటేరియన్‌గా మైకేల్ ఫాల్లొన్ నిలిచారు. ఆయన రాజీనామా నిర్ణయాన్ని ప్రధాని థెరిసా మే ప్రశంసించారు. విచారణలో నిజాలు బయటపడతాయని ప్రధాని పేర్కొన్నారు. కాగా, 2002 లో జులియా హర్ట్లే-బ్రూవర్ అనే మహిళా జర్నలిస్ట్ తొడల మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఫాల్లొన్పై వినిపించాయి. ఈ ఘటనపై గత వారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫాల్లొన్ క్షమాపణలు తెలియజేశారు. అయితే ఈ మధ్య ఆయనపై మళ్లీ లైంగిక ఆరోపణలు వినిపించటం మొదలైంది. ఈ క్రమంలో వాటిని ఖండించిన ఆయన గతంలో మాత్రం మహిళలతో అసభ్యంగా ప్రవర్తించానని ఆయన చెప్పారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై క్షమాపణలు చెప్పటంపై జులియా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతని రాజీనామాను ఓ మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. రాజీనామా వెనుక అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె, మరిన్ని ఘటనలు బయటపడే అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఆయన ఖాతాలో ఇలాంటి ఘటనలు బోలెడు ఉన్నాయని స్నేహితులే చెబుతుండటం గమనించదగ్గ విషయం. Here is Sir Michael Fallon's resignation letter pic.twitter.com/RyRvAYT23f — Press Association (@PA) 1 November 2017 -
‘హై హీల్స్, డ్రెస్ కోడ్ అవసరం లేదు’
లండన్: ఎత్తు మడాల చెప్పులు(హై హీల్స్), ప్రత్యేక డ్రెస్ మాత్రమే వేసుకొని విధులకు రావాలని ఆయా కంపెనీలు చెప్పడం చట్ట విరుద్ధం అని బ్రిటన్ ప్రభుత్వం తమ దేశ వ్యాపారసంస్థలు, కేంద్రాలకు స్పష్టం చేసింది. ఇకపై మహిళలను ఇలాంటి వాటితోనే రావాలని ఏ కంపెనీ వేధించిన దానిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నికోలా థార్ప్ అనే యువతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఆమె గతంలో ఓసారి ఫ్లాట్ షూ వేసుకొని వెళ్లింది. అయితే, కంపెనీ మాత్రం ఆమెను లోపలికి అంగీకరించలేదు. దీనిపై బ్రిటన్ పార్లమెంటులో పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. ఈ నిబంధన తొలగించాలని దాదాపు 1,52,000 సంతకాలు కూడా సేకరించారు. దీనిపై చర్చించిన పార్లమెంటు చివరకు ఇది మహిళలపట్ల వివక్ష చూపడమేనని పేర్కొంది. ప్రత్యేక డ్రెస్ కోడ్, హై హీల్స్ వేసుకోవడంలాంటివి పనిచేసే కంపెనీలు ఆదేశించడం నేరం అవుతుందని స్పష్టం చేశారు. ఇకపై కంపెనీలు ఇలాంటి ఆదేశాలు చేయొద్దని హెచ్చరించారు. -
ఆ ఒక్కడి కోసం మహానగరం కదిలింది..
-
ఆ ఒక్కడి కోసం మహానగరం కదిలింది..
లండన్: అతని స్థాయి.. సాధారణ కానిస్టేబుల్. కానీ తెగువ కొలవాలంటే సాధనాలు సరిపోవు! దేశాన్ని కాపాడిన హీరో. అందుకే అతని వెంట ఊరు ఊరంతా కదిలింది.. సంఘీభావంతో మైళ్ల దూరం నడిచింది! బ్రిటన్ పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటనలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ కీత్ పామర్‌కు లండన్ యావత్తూ ఘన నివాళులు అర్పించింది. సోమవారం నిర్వహించిన అంతిమయాత్ర.. అసాధారణరీతిలోసాగింది. హోదాతో సంబంధంలేకుండా బ్రిటన్‌లోని అన్ని పోలీసు శాఖలకు చెందిన ఉద్యోగులు కీత్ పామర్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అతను ప్రాణాలు కోల్పోయిన బ్రిటన్ పార్లమెంట్ భవనం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. రెండు మైళ్లదూరంలోని స్మశానవాటికలో ముగిసింది. రోడ్డుకు ఇరువైపులా పోలీసులు, వారి వెనుకే జనం నిలబడి కీత్ పామర్ స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో అతని కుటుంబసభ్యులు, కలిసి పనిచేసిన ఉద్యోగినులు కంటతడిపెట్టారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. మార్చి 22న బ్రిటన్ పార్లమెంట్‌పైకి కారులో దూసుకొచ్చిన ముష్కరుడు.. పోలీసుపై కత్తితో దాడి చేసి హత్యచేశాడు. అంతకుముందు థేమ్స్ బ్రిడ్జిపై కారుతో బీభత్సం సృష్టించి ఇద్దరు పాదచారులను పొట్టనబెట్టుకున్నాడు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడంతో దేశం ఉలిక్కిపడింది. (చదవండి: బ్రిటన్ పార్లమెంట్‌పై టెర్రర్ అటాక్) (బ్రసెల్స్ దాడి జరిగిన రోజే లండన్ లో... ) (ఖలీద్ మసూద్ అలియాస్ అడ్రియన్ రస్సెల్) -
లండన్ ఉగ్రదాడి
ఇతర సంపన్న దేశాలతోపాటు తాను కూడా నాయకత్వం వహించి అమలు చేసిన ప్రపంచీకరణ పర్యవసానాల నుంచి ఎలా బయటపడాలా అని బ్రిటన్ గుంజాటన పడుతున్నవేళ... ఆ దేశ రాజధాని లండన్‌లో బుధవారం ఉగ్రవాద దాడి జరిగింది. పార్లమెంటుకు కూతవేటు దూరంలో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో అతనితో పాటు నలుగురు మరణించిన తీరు, అందుకు తామే బాధ్యులమంటూ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు ప్రకటించుకోవడం గమనిస్తే ప్రపంచంలో ఎలాంటి అభద్రతా వాతావరణం నెలకొని ఉన్నదో అర్ధమవుతుంది. దుండగుడు ఒక్కడుగా వచ్చి కారు నడుపుతూ వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జిపై ఇద్దరు పౌరుల్ని చంపేశాడు. దాదాపు 40మందిని గాయపరిచాడు. పార్లమెంటు ఆవరణలోకి వెళ్లబోతుండగా అడ్డుకున్న పోలీసు అధికారిపై కత్తితో దాడిచేసి హతమార్చాడు. ఈ క్రమంలో మరో పోలీస్ అతన్ని కాల్చిచంపాడు. అనంతరం లండన్, బర్మింగ్‌హాం నగరాల్లో దాడులు చేసి ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నిరుడు జూలైలో ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలోనూ, అనంతరం డిసెంబర్లో అదే దేశంలోని బెర్లిన్‌లోనూ అచ్చం ఈ తరహాలోనే ఉగ్రవాద దాడులు జరిగాయి. ఆ రెండుచోట్లా వాహనాలను ఇష్టాను సారం నడిపి జనం ప్రాణాలు తీశారు. నీస్ దాడిలో 86మంది ఉసురుతీస్తే, బెర్లిన్ దాడిలో 12మందిని పొట్టనబెట్టుకున్నారు. వేర్వేరు దేశాల్లో ఇలా ఉగ్రవాద దాడులకు తెగబడుతున్న ఐఎస్ తీరే వేరు. దాని అడుగుజాడలను పసిగట్టడానికి, దాని సానుభూతిపరులెవరో గుర్తించడానికి అవసరమైన పకడ్బందీ ఉపకరణాలు పాశ్చాత్య దేశాల వద్ద ఇప్పటికైతే లేవనే చెప్పాలి. దాడి జరిగాక ఆ ఉగ్రవాది ఎవరో, అతడికి ఎవరెవరితో సంబంధా లున్నాయో ఆరా తీసి నిర్బంధించడం సాధారణమే. సంస్థకు నిర్వాహకులు, వారు చెప్పినట్టల్లా నడుచుకునే కార్యకర్తలు ఉంటే... వారి మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే నెట్వర్క్ నడుస్తుంటే ఏదో ఒకచోట అది లీక్ అవుతుంది. ముందస్తు సమాచారం అందుతుంది. కానీ ఇంతకు ముందుగానీ, ఇప్పుడుగానీ దుండగుల కార్యకలాపాల గురించి అలాంటి సమాచారం లేదు. వారు అంతటి దారుణానికి పాల్పడగలరన్న అనుమానం కుటుంబసభ్యులకు లేదా ఇరుగు పొరుగుకు ఎప్పుడూ రాలేదు. ఐఎస్ సంస్థ తీరుతెన్నులే ఇలా ఉంటున్నాయి. వారికి సామాజిక మాధ్యమాలు తప్ప వేరే వాహికలు లేవు. ఆదేశాలివ్వడం, అమలు చేయడమన్న విధానాలే ఉండవు. వారు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసే వీడియోలు, ప్రకటనలు చూసి వాటి స్ఫూర్తితో ఉగ్రవాద ఉదంతాలకు పాల్పడు తున్న సందర్భాలే అధికం. ఇందువల్ల ఐఎస్‌కు రెండు రకాల ప్రయోజనాలు ఏకకాలంలో నెరవేరుతున్నాయి. తాము ఖండాంతరాల్లో ఉండి సంపన్న దేశాల్లోని ప్రధాన నగరాలల్లో దారుణానికి పాల్పడి ప్రపంచం దృష్టిని ఆకర్షించడం, తమను అణచడం సాధ్యం కాదన్న సందేశాన్ని పంపడం ఇందులో ఒకటైతే... దాడి జరిగిన దేశంలో ఉండే ముస్లిం మతస్తులపై అక్కడి పాలకులూ, పోలీసులూ, సమాజమూ అనుమాన దృక్కులు సారించేలా చేయడం రెండోది. ఇది ఎంత ఎక్కువగా సాగితే అంత ఎక్కువగా ఆయా దేశాల్లోని ముస్లింలు న్యూనతకు లోనవుతారు... వివక్షకు గురవుతారు... చివరకు తమ వైపు చూస్తారు అన్నదే ఉగ్రవాదుల ఎత్తుగడ. ఆయా దేశాల పాలకులు ఉగ్రవాదుల ఎత్తుగడలను బలపర్చే తరçహాలో వ్యవహరి స్తున్నారు. ఈ సందర్భంగా రెండేళ్లక్రితం అమెరికా, బ్రిటన్లలో జరిగిన ఘటనలు గుర్తు తెచ్చు కోవాలి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు సొంతంగా తయారుచేసిన గడియారాన్ని టీచర్లకు చూపించి వారి మెప్పు పొందు దామని తీసుకెళ్తే ఆ టీచర్లు దాన్ని బాంబును చూసినట్టు చూశారు. నిలువెల్లా వణికి, పోలీసులకు పట్టించి ఇచ్చారు. వారొచ్చి ఆ భయాలను పోగొట్ట డానికి బదులు అతని చేతులు వెనక్కి విరిచి కట్టి జువెనైల్ హోంకు తీసుకెళ్లి అయిదు గంటలపాటు ప్రశ్నించారు. బాంబు తయారు చేయడం కోసం ముందుగా ఆ గడియారాన్ని రూపొందించావంటూ దబాయించారు. బ్రిటన్‌లోనూ ఇంతే. పర్యా వరణంపై తరగతి గదిలో పాఠం చెబుతున్న టీచర్ నుంచి వివరణ కోరుతూ ఒక విద్యార్థి ‘ఇకో టెర్రరిస్టు’(పర్యావరణ ఉగ్రవాది) అనే పదం వాడాడు. అంతే...ఆ టీచర్ పోలీసులకు సమాచారం అందించడం, వారు అతడిని ఓ గదిలో బంధించి ఆ పదం నీకెలా తెల్సు... ఎక్కడ విన్నావు... ఐఎస్ గురించి నీకు తెలుసా అంటూ ప్రశ్నించడం వంటివి జరిగిపోయాయి. చిన్న వయసులోనే పర్యావరణ స్పృహ ఉన్నందుకు అతడిని ప్రశంసించకపోగా శంకించారు. గత నెలలో కేవలం ముస్లిం అన్న అనుమానంతో తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ను ఒక శ్వేత జాతీయుడు పొట్టనబెట్టుకున్నాడు. ఆ తర్వాత మరికొన్ని చోట్ల ఇలాంటి దాడులే జరిగాయి. సమాజంలో అన్ని వర్గాల సహకారాన్నీ తీసుకుని ఉగ్రవాదాన్ని తుద ముట్టించడానికి అవసరమైన చైతన్యాన్ని కలిగించాల్సిన పాశ్చాత్య ప్రభుత్వాలు నీడను చూసి భయపడే స్థాయికి పౌరులను దిగజారుస్తున్నాయి. దాడి జరిగాక దుండగుడు ఆసియా పౌరుడు అయి ఉండొచ్చని పోలీసులు ప్రకటించారు. దర్యా ప్తులో అతను లండన్‌కు పొరుగునున్న కెంట్ నివాసి అని తేలింది. అంతక్రితం ఇతర కేసుల్లో అరెస్టయి శిక్షలు పడటమే కాక... బ్రిటన్ పోలీసు విభాగం ఎంఐ5 నిఘాలో కూడా అతనున్నాడని పోలీసులు చెబుతున్నారు. లండన్ వంటి మహా నగరాల్లో అందరిపైనా నిఘా ఉంచడం కష్టమే. కానీ చిన్న చిన్న జాగ్రత్తలతో ఇలాంటి ఘోరాలను నివారించడం అసాధ్యమేమీ కాదు. దాదాపు పదిహేనేళ్లుగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నా వాటితో వ్యవహరించడంలో ప్రతిసారీ తప్పటడుగులు పడుతున్నాయి. ఏదైనా దాడి జరిగిన వెంటనే పౌరుల్లో మరింతగా ఆందోళన పెంచే తరహా ప్రకటనలు పాలకుల నుంచి వెలువడుతున్నాయి. సమాజంలో అందరూ ఒక్కటై ఎదుర్కొన వలసిన ఉగ్రవాదం విషయంలో మరింత అప్రమత్తత, మూలా లను గుర్తించి తుదముట్టించే తరహాలో చర్యలుండటం అవసరమని లండన్ దాడి వెల్లడిస్తోంది. -
బ్రిటన్ పార్లమెంట్‌పై టెర్రర్ అటాక్
-
బ్రిటన్ పార్లమెంట్‌పై టెర్రర్ అటాక్
- ‘పార్లమెంట్’పైకి కారులో దూసుకొచ్చిన ముష్కరుడు - పోలీసుపై కత్తితో దాడి చేసి హత్య.. కాల్పుల్లో ఉగ్రవాది హతం - అంతకుముందు థేమ్స్ బ్రిడ్జిపై కారుతో బీభత్సం - ఇద్దరు పాదచారులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది - పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ఘటన - హుటాహుటిన ప్రధాని థెరిసా మేను సురక్షిత ప్రాంతానికి తరలించిన సిబ్బంది లండన్: బ్రిటన్ పార్లమెంటుపై ఉగ్రపంజా.. కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న లండన్‌పై ఓ ఉగ్రవాది విరుచుకుపడ్డాడు. థేమ్స్ బ్రిడ్జిపై కారుతో బీభత్సం సృష్టించి.. సమీపంలోని పార్లమెంట్‌ను టార్గెట్ చేశాడు. బ్రిడ్జిపై కారును వేగంగా నడిపి ఇద్దరిని పొట్టనబెట్టుకొని.. పార్లమెంట్ భవనం వద్దా ఓ పోలీసు అధికారిని కత్తితో పొడిచి చంపాడు. చివరికి పోలీసుల కాల్పుల్లో అతడు హతమయ్యాడు. బుధవారం పార్లమెంటులో సమావేశాలు జరుగుతుండగానే ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ఏం జరిగింది..? పార్లమెంటు సమీపంలోని వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జిపై ముష్కరుడు కారుతో బీభత్సం సృష్టించాడు. బూడిద రంగు హ్యుందాయ్ ఐ40 కారులో పేవ్మెంట్ పైనున్న పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఇందులో ఓ మహిళ సహా ఇద్దరు చనిపోయారు. 20 మంది దాకా గాయపడ్డారు. బ్రిడ్జిపై విధ్వంసం సృష్టించిన ఉగ్రవాది.. అదే కారులో వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్(పార్లమెంట్ భవనం) వైపు వెళ్లాడు. అక్కడ కారు ఇనుప రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోయింది. పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్, ప్రఖ్యాత బిగ్‌బెన్ గడియారం ఈ భవనంలోనే ఉన్నాయి. పార్లమెంట్ ప్రధాన ద్వారం గుండా భవనం లోపలికి చొరబడేందుకు యత్నించిన ముష్కరుడు అక్కడి ఒక పోలీసు అధికారిని కత్తితో పొడిచాడు. మరో అధికారిని పొడవబోతుండగా సివిల్ దుస్తుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దుండగుడిపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పుల మోత నడుమ.. ప్రధాని థెరిసా మేను కారులో అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఆమె క్షేమంగా ఉన్నారని, తన కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారని ప్రధాని కార్యాలయం తెలిపింది. భద్రతా సిబ్బంది ఘటనా స్థలిని చుట్టుముట్టారు. ఎమర్జెన్సీ హెలికాప్టర్ పార్లమెంటు ఆవరణలో దిగింది. ఎంపీలను, సిబ్బందిని పార్లమెంటులోనే ఉంచారు. సమీప భవనాల్లోని ఉద్యోగులనూ బయటికి రానివ్వలేదు. కాల్పులతో హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశాలను నిలిపేశారు. మరోవైపు లండన్ పోలీసు గుప్పిట్లోకి వెళ్లింది. పోలీసు హెలికాప్టర్లు నగరంలో చక్కర్లు కొట్టాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. లండన్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ప్రధానితో మాట్లాడారు. ఉగ్రపోరులో అన్ని రకాలుగా సాయం అందిస్తామన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ ఖండన.. లండన్ దాడిని భారత్ ఖండించింది. ప్రజాస్వామ్యాల్లో, నాగరిక సమాజాల్లో ఉగ్రవాదానికి తావు లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్వీట్ చేశారు. బ్రిడ్జిపై దాడిలో భారతీయులెవరైనా గాయపడి ఉంటే తమ సహాయక బృందాన్ని, info. london @ hcilondon. in; 02086295950లను సంప్రదించాలని భారత హైకమిషన్ సూచించింది. ముగ్గురు ఫ్రాన్స్ విద్యార్థులకు గాయాలు పారిస్: ఈ దాడిలో ఫ్రాన్స్‌కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థులకు గాయాలయ్యాయని ఆ దేశ విదేశాంగ మంత్రి రుమైన్ నాదల్ చెప్పారు. వారంతా లండన్‌కు స్కూల్ ట్రిప్‌లో భాగంగా వెళ్లిన వారని తెలిపారు. విద్యార్థులంతా బ్రిడ్జిపై ఉన్నప్పుడు ఈ ముగ్గురిని కారు ఢీకొందని స్థానిక పత్రిక వెల్లడించింది. అరుపులు.. కేకలు పార్లమెంటు ఘటనకు సమీపంలోని ప్రెస్ అసోసియేషన్ సంస్థ పొలిటికల్ ఎడిటర్ ఆండ్రూ ఉడ్‌కాక్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. తన ఆఫీసు కిటికీ గుండా చూసిన వివరాలను ఆయన వెల్లడించారు. ‘అరుపులు, కేకలు వినిపించడంతో అటువైపు చూశాను. 40 నుంచి 50 మంది బ్రిడ్జ్ స్ట్రీట్ నుంచి పార్లమెంట్ స్క్వేర్‌వైపు ఏదో తరుముకొస్తున్నట్లు పరిగెతుడూ వచ్చారు. భద్రతా సిబ్బంది కాపలా కాస్తున్న క్యారేట్ గేట్స్ వద్దకు రాగానే ఆ గుంపులోంచి ఒక వ్యక్తి ఆవరణలోకి ఉరికాడు. అతని చేతిలో వంటగదిలో వాడే పొడవాటి కత్తి ఉన్నట్లు కనిపించింది’అని ఆయన వివరించారు. నోటితో శ్వాస అందించిన మంత్రి ముష్కరుడి కత్తిపోట్లకు బలైన పోలీసు అధికారి ప్రాణాలు కాపాడేందుకు బ్రిటన్ విదేశాంగ సహాయ మంత్రి తోబియాస్ ఎల్వుడ్.. క్షతగాత్రుడి నోటిలో నోరు ఉంచి శ్వాస అందించారు. రక్తస్రావం కాకుండా గాయాలను అదిమిపెట్టారు. అయినా ఫలితం లేకపో యిందని, ఆ అధికారి చనిపోయాడని తోబియాస్ తెలిపారు. ఇండోనే సియాలోని బాలిలో జరిగిన ఉగ్రదాడిలో తోబియాస్ సోదరుడు చనిపోవడం గమనార్హం. -
పార్లమెంటు ఎదుటే కాల్పులు.. హై అలర్ట్
లండన్: బ్రిటన్‌లో మరోసారి గన్ పేలింది. ఓ సాయుధుడు పార్లమెంట్ ఎదుటే తుపాకీతో రెచ్చిపోయాడు. ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందారు. 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో లండన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పైగా ఈ సంఘటన జరిగినప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటం మరింత ఆందోళన కలిగించింది. ఆ సమయంలో ప్రధాని థెరిసా మే హౌస్ ఆఫ్ కామన్స్‌లోనే ఉన్నారని, ఆమె క్షేమంగా ఉన్నట్లు ఓ అధికారి వెల్లడించారు. పార్లమెంట్లో దాదాపు 200 మంది ఉన్నారు. కాల్పులు జరిపిన దుండగుడిని బలగాలు మట్టుబెట్టినట్లుగా ఓ మంత్రి ధృవీకరించారు. దుండుగుడిని అడ్డుకునేందుకు యత్నించిన ఓ పోలీసు కత్తిపోట్లకు గురయ్యాడు. కాల్పుల ఘటనతో లండన్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. తాత్కాలికంగా పార్లమెంట్‌ను మూసివేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన దుండగుడు స్థానికుడా.. లేక ఉగ్రవాదా అన్న విషయం తేలాల్సి ఉంది. -
బ్రెగ్జిట్ ప్రక్రియ మరింత ఆలస్యం
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ను తప్పుకునే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. బ్రెగ్జిట్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని భావిస్తున్న బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రి థెరిస్సా మేకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ హైకోర్టు నుంచి కాస్త ప్రతికూల తీర్పు వెలువడింది. బ్రిగ్జిట్ విషయంలో ప్రధాన మంత్రి ఏకపక్షంగా వ్యవహరించే వీలు లేదని, ఈ విషయంలో పార్లమెంటే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లార్డ్ థామస్ గురువారం తీర్పు చెప్పారు. బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌కు మాత్రమే సార్వభౌమాధికారం ఉందని ఆయన స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి తప్పుకోవాలంటూ ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ రెఫరెండమ్‌ను బ్రిటన్ ప్రజలు మెజారిటీ ఓట్లతో ఆమోదించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో యూరోపియన్ నాయకులతో చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా కూటమి నుంచి తప్పుకునే ప్రక్రియను ముగించాలని ప్రధాని థెరిస్సా భావించారు. అయితే హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.