
బ్రెగ‍్జిట్ ప్రక్రియ మరింత ఆలస్యం
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్‌ను తప్పుకునే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.
లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్‌ను తప్పుకునే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. బ్రెగ్జిట్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని భావిస్తున్న బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రి థెరిస్సా మేకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ హైకోర్టు నుంచి కాస్త ప్రతికూల తీర్పు వెలువడింది. బ్రిగ్జిట్ విషయంలో ప్రధాన మంత్రి ఏకపక్షంగా వ్యవహరించే వీలు లేదని, ఈ విషయంలో పార్లమెంటే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లార్డ్ థామస్ గురువారం తీర్పు చెప్పారు. బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌కు మాత్రమే సార్వభౌమాధికారం ఉందని ఆయన స్పష్టం చేశారు.
యూరోపియన్ యూనియన్ నుంచి తప్పుకోవాలంటూ ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ రెఫరెండమ్‌ను బ్రిటన్ ప్రజలు మెజారిటీ ఓట్లతో ఆమోదించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో యూరోపియన్ నాయకులతో చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా కూటమి నుంచి తప్పుకునే ప్రక్రియను ముగించాలని ప్రధాని థెరిస్సా భావించారు. అయితే హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.