
పార్లమెంటు ఎదుటే కాల్పులు.. హై అలర్ట్
లండన్: బ్రిటన్‌లో మరోసారి గన్ పేలింది. ఓ సాయుధుడు పార్లమెంట్ ఎదుటే తుపాకీతో రెచ్చిపోయాడు. ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందారు. 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో లండన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పైగా ఈ సంఘటన జరిగినప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటం మరింత ఆందోళన కలిగించింది. ఆ సమయంలో ప్రధాని థెరిసా మే హౌస్ ఆఫ్ కామన్స్‌లోనే ఉన్నారని, ఆమె క్షేమంగా ఉన్నట్లు ఓ అధికారి వెల్లడించారు. పార్లమెంట్‌లో దాదాపు 200 మంది ఉన్నారు.
కాల్పులు జరిపిన దుండగుడిని బలగాలు మట్టుబెట్టినట్లుగా ఓ మంత్రి ధృవీకరించారు. దుండుగుడిని అడ్డుకునేందుకు యత్నించిన ఓ పోలీసు కత్తిపోట్లకు గురయ్యాడు. కాల్పుల ఘటనతో లండన్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. తాత్కాలికంగా పార్లమెంట్‌ను మూసివేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన దుండగుడు స్థానికుడా.. లేక ఉగ్రవాదా అన్న విషయం తేలాల్సి ఉంది.