లండన్: బ్రిటన్ పార్లమెంట్ లోకి పసిపిల్లలను తీసుకురావద్దని ఆంక్షలు విధించడం అక్కడ తీవ్రమైన నిరసనకు దారితీసింది. పార్లమెంట్ లోకి చిన్నారులను తీసుకురావద్దంటూ ఓమహిళా ఎంపీకి ఈ మెయిల్స్ పంపారు. ఈ క్రమంలో వివాదం రాజుకుంది. అయితే వీటిపై స్పందించిన ఓ ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ నియమాళికి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, పనిచేసే తల్లులకు పిల్లల సంరక్షణ చూసుకునేలా వేసులుబాటు కల్పించాలంటూ చర్చ చేపట్టారు.
వివాదం రాజుకుంది ఇలా..
వెస్ట్‌మినిస్టర్ హాల్లో మంగళవారం తన మూడు నెలల కొడుకుతో కలిసి ఎంపీ స్టెల్లా క్రీసీ పార్లమెంట్ చర్చలో పాల్గొన్నారు. చర్చకు హాజరైన తర్వాత బిడ్డను పార్లమెంట్ కు తీసుకురావడం నిబంధనలకు విరుద్ధమని ఎంపీకి పార్లమెంటు దిగువ సభ ప్రతినిధి చెప్పారు. మంగళవారం కాన్ఫరెన్స్‌లో బైనౌపే లేటర్ కన్స్యూమర్ క్రెడిట్ స్కీమ్ల గురించి చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్నఆమె పసికందును స్లింగ్లో ఛాతీకి కట్టుకుని హాజరయ్యారు. క్రీసీ చర్యలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
గతంలో పార్లమెంట్‌కు ఇలా పిల్లలను తీసుకురావడం సమస్య కాలేదని నిలదీసిన క్రీసీ... దీనిపై కామన్స్ అధికారుల నుంచి ఆమె వివరణ కోరింది. ఇదివరకు తన పిల్లలిద్దరినీ ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే హౌస్ ఆఫ్ కామన్స్లోకి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు.
ట్విట్టర్‌లో షేర్ చేయడంతో నిరసన
తనకు ఎదురైన అనుభవం గురించి క్రీసీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. నేను ఛాంబర్లో మాట్లాడేటప్పుడు నా 3 నెలల... నిద్రపోతున్న బిడ్డను తీసుకుపోకూడదని (ఇప్పటికీ పార్లమెంట్ లో మాస్క్లు ధరించాలనే నియమం లేదని విమర్శించారు ) నాకు నోటిసులు పంపారు’’ అని ఆమె ట్విట్టర్లో తనకు పంపిన లెటర్ ను షేర్ చేశారు. తనకు పార్లమెంట్ ప్రసూతి కవరేజ్ లేదని... అది కలిగి ఉండటానికి ఉపాధి హక్కులు లేవని ఎంపీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వివరించారు.
పెద్ద ఎత్తున నిరసనలు...
క్రీసీ లెటర్ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున నిరసనకు దారితీసింది. ఈ విషయంపై అన్ని రంగాల్లోని మహిళలు నిరసనగళం వినిపించారు. తమ ఉద్యోగాలను సులభతరం చేయడానికి పార్లమెంట్ నిబంధనలను మార్చాలని పలువురు మహిళా చట్టసభ సభ్యులు కోరారు. ఎంపీలకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదని నిలదీశారు.
పనిచేసే ప్రాంతానికి శిశువును తీసుకెళ్లాడనికి చాలా చోట్ల అనుమతించడం లేదని పలువురు మహిళలు వాపోయారు. తమ బిడ్డను వేరే వాళ్లకి అప్పగించి చూసుకోమని చెప్పడానికి ఆర్థిక స్థోమత లేదని ఆవేదన వెలిబుచ్చారు.
సోషల్ మీడియా ఆగ్రహం అనంతరం...
ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీసింది. నెటిజన్ల ఆగ్రహం అనంతరం... తాము ఈ విషయాన్ని సమీక్షిస్తున్నట్లు హౌస్ ఆఫ్ కామన్స్ ప్రతినిధి చెప్పారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఎంపీలందరూ పార్లమెంటులో తమ విధులను నిర్వహించగలగడం చాలా ముఖ్యం. సభ్యులు ఎప్పుడైనా ఛాంబర్లో లేదా వెస్ట్మిన్స్టర్ హాల్లో ఉన్నప్పుడు తమ అవసరాల గురించి స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు, క్లర్క్లు, డోర్కీపర్లతో సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఈ విషయం గురించి స్టెల్లా క్రీసీతో మాట్లాడుతున్నట్లు వివరించారు.
ఇదేం కొత్త కాదు...
శిశువులను పార్లమెంటుకు తీసుకురావడం ఇదేం కొత్త కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజాప్రతినిధులు తమ పిల్లలను చట్టసభలకు తీసుకువెళ్లారు. అన్నెలీస్ డాడ్స్ తన బిడ్డను 2016లో యూరోపియన్ పార్లమెంట్కు తీసుకెళ్లడం నుంచి న్యూజిలాండ్ పీఎం జసిండా ఆర్డెర్న్ 2018లో మూడు నెలల కుమార్తెను యూఎన్ జీఏకి తీసుకురావడం ద్వారా చరిత్ర సృష్టించడం వరకు... చాలా మంది మహిళా చట్టసభ సభ్యులు గతంలో ఇలా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment