ఎంపీ క్రిస్టోఫర్ చోప్.. ఇన్‌సెట్‌లో గినా మార్టిన్
మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ఉద్యమాలు జరిగాయి.(జరుగుతున్నాయి కూడా). ఈ క్రమంలో యూకేలో ఓ యువతి నిర్వహించిన ఉద్యమం పార్లమెంట్(హౌజ్ ఆఫ్ కామన్స్)ను కదిలించింది. అయితే కఠిన చట్టం దిశగా అడుగులు వేసిన క్రమంలో ఓ ఎంపీ వేసిన అడ్డుపుల్ల ప్రజల్లో ఆగ్రహజ్వాలలను రగిల్చింది. సున్నితమైన అంశం, పైగా అధికారపక్ష ఎంపీ కావటం ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
లండన్: గినా మార్టిన్(26) గతేడాది జూలైలో లండన్ హైడ్ పార్క్‌లో జరిగిన ఓ ఫెస్టివల్‌కు తన సోదరితో కలిసి హాజరయ్యింది. ఆ సమయంలో ఆమెను వెంబడించిన కొందరు యువకులు వేధింపులకు దిగారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె స్కర్ట్ కింద నుంచి ఫోన్‌తో ఫోటోలు తీశాడు. అది గమనించి ఆమె వారితో వాగ్వాదానికి దిగింది. ఫోన్ లాక్కుని పరిగెత్తటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటం, వారిని పోలీసులు ప్రశ్నించటం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ వ్యవహారంలో ఆమెకు సరైన న్యాయం జరగలేదు. దీంతో స్టాప్‌స్కర్టింగ్ పేరిట ఆమె సోషల్ మీడియాలో ఉద్యమాన్ని మొదలుపెట్టింది.
కఠిన చట్టం... మహిళల అనుమతి లేకుండా వారిని అభ్యంతకరంగా ఫోటోలు తీయటం నేరమనే ఉద్దేశంతో ఈ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. దీనికి సామాన్యులు, సెలబ్రిటీలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో మద్ధతు ప్రకటించారు. దీంతో చివరకు ఈ వ్యవహారం హౌజ్ ఆఫ్ కామన్స్‌కు చేరింది. అందరి మద్ధతుతో కఠిన చట్టం రూపకల్పన చేయాలని నిర్ణయించారు. లిబరల్ డెమొక్రట్ ఎంపీ వెరా హోప్‌హౌజ్ ప్రతిపాదిత బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అనుమతులు లేకుండా మహిళల ఫోటోలను తీయటం నిషేధం. అలా కాదని తీస్తే వేధింపుల కిందకే వస్తుంది. నేరం కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తారు.
అధికార ఎంపీ అడ్డుపుల్ల... అయితే బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా కన్సర్వేటివ్ ఎంపీ సర్ క్రిస్టోఫర్ చోప్(71) బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి సభలో కలకలం రేపారు. ఆ వెంటనే సభలో ‘సిగ్గు చేటు’ అంటూ ఎంపీలంతా నినాదాలు చేశారు. బిల్లును తాను ఎందుకు వ్యతిరేకిస్తున్న అన్న అంశంపై మాత్రం చోప్ స్పష్టత ఇవ్వలేదు. తోటి ఎంపీలు ఆయన నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేయగా, సొంత పార్టీ ఎంపీ తీరుపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా చోప్ మౌనంగా ఉండటంతో విమర్శలు తారా స్థాయికి చేరాయి. ఉద్యమకారిణి గినా మార్టిన్ కూడా చోప్ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఈ లైంగిక వేధింపుల వ్యతిరేక చట్టం కార్యరూపం దాల్చటం మాత్రం ఖాయమని అధికార పార్టీ ఎంపీలు చెబుతున్నారు.
ఆయనంతే... క్రిస్టోఫర్ చోప్(71)కు వివాదాలు కొత్తేం కాదు. మానవ హక్కులకు సంబంధించిన చట్టం, సమాన వేతన చట్టం, స్వలింగ వివాహ చట్టం.. తదితరాలను వ్యతిరేకించి వార్తల్లో కెక్కారు. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలను నిషేధించాలని, కనీస వేతన చట్టాలను రద్దు చేయాలని, మరణ శిక్షను పునరుద్ధరించాలని, నిర్భంద సైనిక శిక్షణ అమలు చేయాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేసి దుమారం రేపారు. ఇవన్నీ ఒక్క ఎత్తయితే 2013లో హౌజ్ ఆఫ్ కామన్స్ సిబ్బందిని ‘పనివాళ్లుగా’ అభివర్ణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. చోప్ క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయినప్పటికీ ఆ పెద్దాయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
Comments
Please login to add a commentAdd a comment