మైకేల్ ఫాల్లొన్ కుడి వైపు.. జులియా ఎడమ వైపు
లండన్ : ప్రపంచ వ్యాప్తంగా లైంగిక వేధింపుల పర్వాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సెలబ్రిటీలు మీడియా ముందుకు వస్తుండటంతో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో యునైటెడ్ కింగ్‌డమ్(బ్రిటీష్) రక్షణ కార్యదర్శి మైకేల్ ఫాల్లొన్ పేరు కూడా వినిపించటంతో... ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు. అయితే గతంలో తాను మహిళలను వేధించిన మాట వాస్తవమేనని ఆయన తప్పు అంగీకరించటం విశేషం.
బుధవారం ఆయన తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి థెరిసా మే కు పంపించారు. ప్రస్తుత ఆరోపణలను ఖండించిన ఆయన.. గతంలో మాత్రం తాను కొన్ని తప్పులు చేశానంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే కార్యదర్శి పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎంపీగా మాత్రం ఆయన కొనసాగనున్నట్లు ప్రకటించారు. కాగా, ఇలా లైంగిక ఆరోపణలు ఎదుర్కుని ఉన్నత పదవికి రాజీనామా చేసిన మొదటి పార్లమెంటేరియన్‌గా మైకేల్ ఫాల్లొన్ నిలిచారు.
ఆయన రాజీనామా నిర్ణయాన్ని ప్రధాని థెరిసా మే ప్రశంసించారు. విచారణలో నిజాలు బయటపడతాయని ప్రధాని పేర్కొన్నారు. కాగా, 2002 లో జులియా హర్ట్‌లే-బ్రూవర్ అనే మహిళా జర్నలిస్ట్ తొడల మీద చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఫాల్లొన్‌పై వినిపించాయి. ఈ ఘటనపై గత వారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫాల్లొన్ క్షమాపణలు తెలియజేశారు. అయితే ఈ మధ్య ఆయనపై మళ్లీ లైంగిక ఆరోపణలు వినిపించటం మొదలైంది. ఈ క్రమంలో వాటిని ఖండించిన ఆయన గతంలో మాత్రం మహిళలతో అసభ్యంగా ప్రవర్తించానని ఆయన చెప్పారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై క్షమాపణలు చెప్పటంపై జులియా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతని రాజీనామాను ఓ మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. రాజీనామా వెనుక అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె, మరిన్ని ఘటనలు బయటపడే అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఆయన ఖాతాలో ఇలాంటి ఘటనలు బోలెడు ఉన్నాయని స్నేహితులే చెబుతుండటం గమనించదగ్గ విషయం.
Here is Sir Michael Fallon's resignation letter pic.twitter.com/RyRvAYT23f
— Press Association (@PA) 1 November 2017
Comments
Please login to add a commentAdd a comment