‘హై హీల్స్, డ్రెస్ కోడ్ అవసరం లేదు’
లండన్: ఎత్తు మడాల చెప్పులు(హై హీల్స్), ప్రత్యేక డ్రెస్ మాత్రమే వేసుకొని విధులకు రావాలని ఆయా కంపెనీలు చెప్పడం చట్ట విరుద్ధం అని బ్రిటన్ ప్రభుత్వం తమ దేశ వ్యాపారసంస్థలు, కేంద్రాలకు స్పష్టం చేసింది. ఇకపై మహిళలను ఇలాంటి వాటితోనే రావాలని ఏ కంపెనీ వేధించిన దానిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నికోలా థార్ప్ అనే యువతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న ఆమె గతంలో ఓసారి ఫ్లాట్ షూ వేసుకొని వెళ్లింది.
అయితే, కంపెనీ మాత్రం ఆమెను లోపలికి అంగీకరించలేదు. దీనిపై బ్రిటన్ పార్లమెంటులో పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. ఈ నిబంధన తొలగించాలని దాదాపు 1,52,000 సంతకాలు కూడా సేకరించారు. దీనిపై చర్చించిన పార్లమెంటు చివరకు ఇది మహిళలపట్ల వివక్ష చూపడమేనని పేర్కొంది. ప్రత్యేక డ్రెస్ కోడ్, హై హీల్స్ వేసుకోవడంలాంటివి పనిచేసే కంపెనీలు ఆదేశించడం నేరం అవుతుందని స్పష్టం చేశారు. ఇకపై కంపెనీలు ఇలాంటి ఆదేశాలు చేయొద్దని హెచ్చరించారు.