అంతర్జాతీయంగా పెరుగుతున్న వాణిజ్య అడ్డంకులు
గత దశాబ్దకాలంలో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అడ్డంకులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓ వైపు బ్రెగ్జిట్ చర్చలు, మరోవైపు అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, దాని ప్రతీకారంగా ఇతర దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బకొడుతున్నాయి. బ్రెగ్జిట్ చర్చలతో వ్యాపార మార్కెట్‌లో అస్థిరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ అస్థిరత ఇంకా కొనసాగుతూ ఉండగానే... అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై టారిఫ్‌లు విధించింది. ఈ టారిఫ్‌లను తీవ్రంగా నిరసిస్తూ.. ఇతర దేశాలు కూడా అమెరికాపై ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం సన్నగిల్లుతోందని ప్రపంచ నేతలు అంటున్నారు. తాజాగా కెనడాలో జరిగిన జీ7 సమావేశంలో కూడా అంతర్జాతీయ ప్రతినిధులు ఇదే విషయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాల అధినేతలందరూ తమ తమ ఆందోళనను వెల్లబుచ్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుల జాబితా కూడా మారిపోయిందని తెలిసింది.
అసలు 2017లో టాప్ ఎగుమతిదారులుగా ఉన్న దేశాలేమిటో ఓ సారి చూద్దాం..
ఏడాదికి 2.26 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులతో 2017లో చైనా ఆధిపత్య స్థానంలో ఉంది. ఆ అనంతరం జర్మనీ భారీ మొత్తంలో ఆటోమొబైల్స్‌ను ఎగుమతి చేసి.. ప్రతేడాది 1.45 ట్రిలియన్ డాలర్లను ఆర్జించింది. అంటే ఒక్కో వ్యక్తికి 18వేల డాలర్లు వచ్చాయన్న మాట. అయితే అమెరికా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎగుమతిదారిగా ఉన్నప్పటికీ, తలసరి ఆదాయం పరంగా చూసుకుంటే మాత్రం మొత్తం ఎగుమతుల్లో జర్మనీ కంటే తక్కువ స్థాయిల్లోనే ఉన్నట్టు వెల్లడైంది. 2017లో అమెరికా 1.55 ట్రిలియన్ డాలర్ల ఎగుమతలు చేపట్టింది. అంటే ఒక్కో వ్యక్తికి 4,800 డాలర్లు మాత్రమే ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment