
బంగారం భగభగ!
♦ బ్రెగ్జిట్ దెబ్బకు దూసుకెళ్లిన పసిడి..
♦ అంతర్జాతీయ మార్కెట్లో 8% జూమ్; ఔన్స్ 1,360 డాలర్లకు...
♦ దేశీయంగానూ దూకుడు; ముంబైలో 10 గ్రాములు రూ.30,905
లండన్/ముంబై: బ్రెగ్జిట్ తీర్పు ఊహించని విధంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఈ అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంలో పెట్టుబడులకు పరుగులు తీశారు. ఫలితం... అంతర్జాతీయ మార్కెట్లో అన్నీ పతనం కాగా, పుత్తడి మాత్రం భగ్గుమంది. దేశీయంగానూ దూసుకెళ్లింది. లండన్ మార్కెట్లో శుక్రవారం ఒకానొక దశలో ఔన్స్ బంగారం ఏకంగా 8.1 శాతం ఎగబాకి 1,359 డాలర్లను తాకింది.
2008 తర్వాత ఒకే రోజులో ఇంత భారీగా పెరగటం ఇదే తొలిసారి. అంతేకాదు!! ధర కూడా 2014 మార్చి తరవాత ఈ స్థాయికి చేరటం ఇదే. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో (కామెక్స్) కూడా ఔన్స్ బంగారం ధర ఒక దశలో 95 డాలర్లకుపైగా (8 శాతం) ఎగసి 1,362 డాలర్లను తాకింది. అయితే, రాత్రి 12 గంటల సమయానికి 59 డాలర్ల పెరుగుదలతో(5 శాతం మేర) 1,322 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి సైతం కామెక్స్‌లో 5 శాతం దూసుకెళ్లి ఔన్స్‌కు 18.35 డాలర్ల గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 3.5 శాతం పెరుగుదలతో 18 డాలర్ల వద్ద కదలాడుతోంది.
దేశీయంగానూ రయ్య్.్ర..
బ్రెగ్జిట్ ప్రభావంతో దేశీ మార్కెట్లోనూ బంగారం భగ్గుమంది. శుక్రవారం ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత ఉండే మేలిమి బంగారం 10 గ్రాముల రేటు దాదాపు రూ.31 వేలకు దూసుకెళ్లింది. క్రితం ముగింపు రూ.29,680తో పోలిస్తే రూ.1,225 లాభపడి రూ.30,905కు చేరింది. ఇది 26 నెలల గరిష్టస్థాయి. 99.5 శాతం స్వచ్ఛత ఉండే పసిడి ధర కూడా ఇదే స్థాయిలో ఎగబాకి రూ.30,775 వద్ద స్థిరపడింది. వెండి ధర కేజీకి రూ.1,575 దూసుకెళ్లి రూ.42,930కి చేరింది. ‘రూపాయి భారీ పతనం, ఈక్విటీల్లో అమ్మకాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన పసిడివైపు మళ్లిస్తున్నారు. అందుకే ఈ జోరు’ అని ఆలిండియా సరాఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురేందర్ కుమార్ జైన్ చెప్పారు.
ఫ్యూచర్స్‌లో రూ.32 వేలకు...
దేశీయంగా మల్టీకమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఫ్యూచర్స్ (ఆగస్టు కాంట్రాక్టు) ధర శుక్రవారం రూ. 1,935(6.7%) దూసుకెళ్లిరూ.31, 849కి చేరింది. ప్రస్తుతం 5% లాభంతో రూ. 31,400 వద్ద ట్రేడవుతోంది. అక్టోబర్ కాంట్రాక్టు ఒకానొక దశలో రూ.32,103ను తాకడం గమనార్హం. ఇదే జోరు కొనసాగి ముగిస్తే.. స్పాట్ మార్కెట్లో పసిడి రేట్లు మరింత ఎగబాకుతాయన్నది మార్కెట్ నిపుణుల మాట.
బంగారానికి ఫుల్ డిమాండ్...: బ్రెగ్జిట్ కారణంగా ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయని.. దీంతో రిస్క్‌తో కూడిన స్టాక్స్ వంటి సాధనాల్లో భారీ అమ్మకాలు జరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో సురక్షితమైన బంగారం వైపు అంతా చూస్తుండటంతో దీనికి భారీగా డిమాండ్ పెరుగుతుందని క్రెడిట్ సూసీ గ్లోబల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ మైఖేల్ స్ట్రోబెక్ చెప్పారు.