'తప్పుకుంటే మీ దేశానికే మంచిది'
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రెక్సిట్ కు తాను మద్ధతిస్తున్నానని పేర్కొటూనే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోవాలని చెప్పారు. జూన్ 23న ఈ విషయంపై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. పైగా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగితే ఆ దేశానికే మంచిదని హితవు పలికారు. తాను బ్రిటన్ పౌరుణ్ని కానప్పటికీ, తనకు తోచింది చెప్పాను అని వివరణ ఇచ్చుకున్నారు. ట్రంప్ తల్లి స్కాట్లాండ్ మహిళ అన్న విషయం తెలిసిందే.
ప్రపంచంలోనే వలసలు ఎక్కువగా ఉండే దేశాల్లో బ్రిటన్ ఒకటి. అత్యథికంగా శరణార్థులు బ్రిటన్ రావడానికే మొగ్గు చూపుతారని, ఆ కారంణంతో ఈయూ నుంచి వారు బయటకు రావడం మంచిదన్నారు. మహిళా ఎంపీ కో జాక్స్ ను ఓ దుండగుడు దారుణంగా కాల్చి హత్య చేసిన విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగు పరుస్తానని, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తోనూ చర్చలు జరపనున్నట్లు చెప్పారు. ముస్లింలను అమెరికాలో కాలు పెట్టనివ్వను, ఇతర దేశాలు కూడా ఇదే తీరుగా వ్యవహరించాలని సూచించినప్పుడు.. కామెరూన్ ట్రంప్ వైఖరిని తప్పుబట్టారు. ట్రంప్ ఆలోచన తెలివి తక్కువ నిర్ణయంతో పాటు తప్పుడు పద్ధతి అని కామెరూన్ విరుచుకుపడ్డారు.