సుస్థిరతకు బ్రిటన్‌ పట్టం | Sakshi Editorial Article On UK Election | Sakshi
Sakshi News home page

సుస్థిరతకు బ్రిటన్‌ పట్టం

Published Sat, Dec 14 2019 12:01 AM | Last Updated on Sat, Dec 14 2019 12:01 AM

Sakshi Editorial Article On UK Election - Sakshi

యూరప్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బ్రిటన్‌ బయటకు రావాలన్న ‘బ్రెగ్జిట్‌’ నినాదం రాజుకుని రాజకీయ రూపం సంతరించుకున్నప్పటినుంచీ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్‌ చివరకు దృఢమైన నిర్ణయం తీసుకుంది. బ్రెగ్జిట్‌ను గట్టిగా సమర్థిస్తున్న కన్సర్వేటివ్‌ పార్టీకి గురువారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీ కట్టబెట్టి రాజకీయ అస్థిరత్వానికి తెరదించింది. అయిదేళ్లలో మూడో దఫా జరిగిన ఈ ఎన్నికల్లో సైతం హంగ్‌ పార్లమెంట్‌ తప్పదని, కన్సర్వేటివ్‌లకు బొటాబొటీ మెజారిటీ వస్తుందని, అది విపక్షాలతో కలిసి జాతీయ సంకీర్ణ ప్రభుత్వంతో సరిపెట్టుకోక తప్పదని అంచనా వేసిన రాజకీయ పండితులను శుక్రవారం వెలువడిన ఫలితాలు వెక్కిరించాయి. పార్లమెంటు లోని 650 స్థానాల్లో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నాయకత్వంలోని కన్సర్వేటివ్‌ పార్టీ 365 స్థానాలు సాధించగా, దాని ప్రధాన ప్రత్యర్థి లేబర్‌ పార్టీ కేవలం 203 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేశం ఈయూలోనే ఉండాలని బలంగా వాదించిన లిబరల్‌ డెమొక్రాట్లకు కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. స్కాటిష్‌ నేషనల్‌ పార్టీకి 48 లభించాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ కన్సర్వేటివ్‌లు భారీ మెజారిటీ సాధించే అవకాశం ఉన్నదని ముందే జోస్యం చెప్పాయి. అదే నిజమైంది. పద్నాలుగేళ్ల తర్వాత కన్సర్వేటివ్‌ పార్టీకి పార్లమెంటులో ఇంత స్పష్టమైన మెజారిటీ లభించడం ఇదే మొదటిసారి.

అలాగే ఆ పార్టీకి 1987లో లభించిన స్థానాలకన్నా ఈసారి అత్యధిక స్థానాలు వచ్చాయి. అటు లేబర్‌ పార్టీది ఘోరమైన పరాజయం. తాజా ఎన్నికలతో కలుపుకొని చూస్తే అది వరసగా నాలుగు సాధా రణ ఎన్నికల్లో ఓటమిపాలైట్టు లెక్క. పైగా 80 ఏళ్లలో ఎప్పుడూ ఇంత కింది స్థాయికి అది పడిపోయిన దాఖలా లేదు. అయిదేళ్లలో మూడు పార్లమెంటు ఎన్నికలను చవిచూసిన బ్రిటన్‌ ప్రజానీకం ఈ అస్థిరతకూ, దానివల్ల కలుగుతున్న దుష్ఫలితాలకూ విసుగెత్తి కన్సర్వేటివ్‌లకు తిరుగులేని ఆధిక్యతను అందించారు. అయితే ఈ ఫలితాల్లో మరో ప్రమాదం పొంచివుంది. స్కాట్లాండ్‌ స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ ఆ గడ్డపై భారీగా సీట్లు సాధించింది. కనుక తమ డిమాండ్‌పై మరోసారి రెఫరెండం నిర్వహించాలని ఆ పార్టీ పట్టుబడుతుంది. అదే జరిగితే బ్రిటన్‌కు రాజ్యాంగ సంకటం ఎదురవుతుంది. 2014లో తొలిసారి జరిగిన రెఫరెండంలో 55 శాతంమంది ఐక్యతకే ఓటే యడంతో ఆ డిమాండ్‌ వీగిపోయింది. అయితే అప్పట్లో బ్రెగ్జిట్‌ గొడవ లేదు.  ఈయూతో కలసి వుండాలన్న తమ ఆకాంక్షకు విరుద్ధంగా ఇప్పుడు జరగబోతోంది గనుక ఈసారి రెఫరెండం నిర్వహిస్తే వారు బ్రిటన్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించినా ఆశ్చర్యం లేదు. 312 ఏళ్లక్రితం రెండు రాచ కుటుంబాల మధ్య ఏర్పడ్డ వివాహబంధంతో ఆ ప్రాంతం బ్రిటన్‌లో విలీనమైంది. 

ప్రపంచమంతా మితవాద ధోరణివైపు మొగ్గు చూపుతున్న వర్తమానంలో బ్రిటన్‌ అందుకు విరుద్ధమైన తీర్పునిస్తుందని కొందరు విశ్లేషకులు ఆశించిందంతా దురాశే కావొచ్చు. కానీ అందుకు కారణాలున్నాయి. అట్లాంటిక్‌ మహాసముద్రానికి ఆవలనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు రూపంలో పోలికలున్న బోరిస్‌ జాన్సన్‌ ఆయన గుణాలనే పుణికిపుచ్చుకున్నారు. తరచుగా మహిళ లను కించపరిచే వ్యాఖ్యానాలు చేయడం, ఇస్లాంను పెనుభూతంగా చూడటం, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం వంటì  దురలవాట్లు జాన్సన్‌కు కూడా ఉన్నాయి. పైగా ఈయూతో ఒప్పందం కుదిరితే సరేసరి... లేదా ఏ ఒప్పందమూ లేకుండా బయటికొచ్చేయడానికి కూడా సిద్ధమని ఆయన చేసిన ప్రకటనలు ప్రకంపనలు సృష్టించాయి. మొన్న మే నెలలో మరో 27 సభ్య దేశాలతోపాటు బ్రిటన్‌లోకూడా జరిగిన ఈయూ పార్లమెంటు ఎన్నికల్లో కన్సర్వేటివ్‌ పార్టీ అంతకుముందున్న 19 స్థానాల్లో 15 కోల్పోయి, నాలుగుకు పరిమితమైంది. లేబర్‌ పార్టీ అంతకుముందున్న 20 స్థానాల్లో సగం మాత్రమే గెల్చుకోగలిగింది.

ఈయూతోనే ఉండాలన్న లిబరల్‌ డెమొక్రాట్లు అంతకుముందున్న ఒక స్థానం నుంచి ఏకంగా 15కు చేరుకున్నారు. బ్రెగ్జిట్‌కు పట్టుబడుతున్న తీవ్ర మితవాద రాజకీయ పక్షం బ్రెగ్జిట్‌ పార్టీ 29 స్థానాలు గెల్చుకుంది. ఇప్పుడు బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల ఫలితాలకూ, ఆర్నెల్లక్రితం జరిగిన ఈయూ ఎన్నికల ఫలితాలకూ పొంతనే లేదు. ఆ ఎన్నికల్లో దెబ్బతిన్న కన్సర్వే టివ్‌లు చాలా త్వరగా కోలుకుని బలోపేతం కాగా, లేబర్‌ పార్టీకి అవే ఫలితాలు పునరావృతమ య్యాయి. ఈయూ ఎన్నికల్లో పుంజుకున్నట్టు కనబడిన తీవ్ర మితవాద పక్షం బ్రెగ్జిట్‌ పార్టీ ఈ ఎన్ని కల్లో సున్నా చుట్టింది. ఒక్క సీటూ గెల్చుకోలేక డీలాపడింది. బోరిస్‌ జాన్సన్‌ రూపంలో బలమైన మితవాది రంగంలో ఉండగా నైజల్‌ ఫరాజ్‌ నేతృత్వంలోని బ్రెగ్జిట్‌ పార్టీ దండగని ఓటర్లు అనుకుని ఉండొచ్చు.

భారీగా మెజారిటీ సాధించిన బోరిస్‌ జాన్సన్‌కు ఇప్పుడు చేతినిండా పని. ఆయన పరిపూర్తి చేయాల్సిన కర్తవ్యాలు సాధారణమైనవి కాదు. సాధ్యమైనంత తక్కువ నష్టంతో ఈయూ నుంచి బయటకు రావడం, ఆ సంస్థ సభ్య దేశాలతో విడివిడిగా మెరుగైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం రెండూ సంక్లిష్టమైనవి. బ్రెగ్జిట్‌ను వచ్చే జనవరి 31కల్లా పూర్తి చేస్తానని ఎన్నికల ప్రచార పర్వంలో ఆయన పదే పదే చెప్పారు. అదంత సులభం కాదు. అందులో ఎన్ని చిక్కు ముడులున్నాయంటే...బ్రిటన్‌ ఏ ఒప్పందమూ లేకుండా నిష్క్రమించక తప్పని పరిస్థితులు కూడా ఏర్పడొచ్చు. ఈ క్రమంలో ఎదురయ్యే ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడానికి కొన్ని ‘పొదుపు’ చర్యలు కూడా ఆయన తీసుకోవాల్సివుంటుంది. ఇందుకోసం జాతీయ ఆరోగ్య సర్వీసు (ఎన్‌హెచ్‌ఎస్‌) సహా పలు పథకాలకు కోత, ప్రైవేటీకరణ వంటివి తప్పకపోవచ్చు. ఎన్‌హెచ్‌ఎస్‌ని ప్రైవేటీకరిస్తే ప్రజారోగ్యానికి ముప్పు కలుగుతుందని లేబర్‌ పార్టీ చేసిన ప్రచారాన్ని ఖాతరు చేయని జనం సుస్థిర ప్రభుత్వంతో తమకు మేలే తప్ప కీడు జరగదని విశ్వసించారు. దాన్ని జాన్సన్‌ ఎలా నిలబెట్టుకోగలరో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement