britan government
-
రిషి సునాక్ బ్యాగ్ ధరెంతో తెలుసా..
సెలబ్రిటీలు వాడే ప్రతి వస్తువు సామాన్యులకు ఎప్పుడూ ప్రత్యేకమే. వారు ధరించే షూ, వేసుకునే దుస్తులు, వాడే కారు, పెట్టుకునే వాచీలు, ఉపయోగించే బ్యాగులు.. ఇలా అన్ని స్పెషల్‌గా కనిపిస్తాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ రైల్వేస్టేషన్లో యూకే ప్రధాని రిషిసునాక్ వాడిన బ్యాగ్ గురించి నెట్టింట వైరల్‌గా మారింది.రాబోయే బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా రిషి సునక్ ప్రచారంలో పాల్గొనేందుకు ఇటీవల రైలులో ప్రయాణించారు. లండన్ నుంచి బయలుదేరిన ఆయన రాత్రంతా రైలు స్లీపర్‌క్లాస్‌లో ప్రయాణించి కార్న్‌వాల్‌కు చేరుకున్నారు. అందులో ఏముంది ప్రత్యేకత అనుకుంటున్నారా. రిషి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే అందరి కళ్లు ఆయనతోపాటు తాను వాడుతున్న బ్యాగ్‌పై పడింది. దేశంలోని అత్యంత పేద ప్రాంతాల్లో ఒకటైన 'ఆర్ఎస్'ను సూచించే మోనోగ్రామ్ ఉన్న బ్యాక్‌ప్యాక్‌ను ధరిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాంతో వీక్షకులు తాను వినియోగించిన బ్యాక్‌ప్యాక్ ధరెంతో తెలుసుకునే పనిపడ్డారు. దీని విలువ సుమారు రూ.79వేలు ఉంటుందని తెలిసింది.ఇదీ చదవండి: అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్‌లో ఫస్ట్ బర్త్డేది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ రిపోర్ట్ ప్రకారం..రిషి సునక్, తన భార్య అక్షతామూర్తి నికర విలువ 651 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు(సుమారు రూ.6900 కోట్లు). బ్రిటిష్ రాజు కింగ్ చార్లెస్ 3 కంటే వీరే సంపన్నులు. ఈ జంట సంపద కేవలం ఒక సంవత్సరంలోనే 120 మిలియన్ పౌండ్లకు పైగా పెరిగింది.Paddington Station, London: Rishi Sunak boarding the sleeper train to Cornwall, sporting a £750 luxury monogrammed Tumi Arrive Bradley backpack pic.twitter.com/ojWi76ovcu— Jane Fleming (@fleming77) May 29, 2024 -
British Parliament Dissolve: బ్రిటన్ పార్లమెంట్ రద్దు..
బ్రిటన్ పార్లమెంట్ రద్దైంది. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా పార్లమెంట్‌ను గురువారం రద్దు చేశారు. ఇక, పార్లమెంట్ రద్దుతో ఐదు వారాల ఎన్నికల ప్రచారం నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. దీంతో, నేటి నుంచి ఎన్నికల ప్రచారం షురూ కానుంది.కాగా, జూలై నాలుగో తేదీన ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 23న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’ వద్ద సునాక్ ఎన్నికల తేదీపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సునాక్ మాట్లాడుతూ..‘ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలను సాధించాం. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చింది’ అంటూ కామెంట్స్ చేశారు. #BreakingNews #Updates #ukpolitics#British Parliament is formally dissolved ahead of July 4 general #election which polls indicate #Labour is expected to win over ruling #Conservative party pic.twitter.com/Lubf43M6r4— Tanveer Roomi (@TanveerRoomi) May 30, 2024ఇక బ్రిటన్ పార్లమెంట్లో మొత్తం 650 మంది సభ్యులు ఉన్నారు. కాగా, గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి దాదాపు 129 మంది ఎంపీలు పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. -
బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా...
-
మరో డజను మంత్రులు...
లండన్: బ్రిటన్‌లో రాజకీయ అనిశ్చితి తీవ్రతరమైంది. మంగళవారం భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్‌లతో మొదలైన రాజీనామాల పర్వం బుధవారం మరింత ఊపందుకుంది. సునక్, జావిద్ మాదిరిగానే తమకూ ప్రధాని బోరిస్ జాన్సన్ (58) నాయకత్వంపై నమ్మకం పోయిందంటూ బుధవారం ఏకంగా 12 మంది మంత్రులు తప్పుకున్నారు! ముందుగా జాన్ గ్లెన్, విక్టోరియా అట్కిన్స్, జో చర్చిల్, స్టూవర్ట్ ఆండ్రూ, విల్ క్విన్స్ (విద్యా శాఖ), రాబిన్ వాకర్ (స్కూళ్లు) రాజీనామా చేశారు. ఆ తర్వాత మరో ఐదుగురు మంత్రులు కేమీ బదెనోచ్ జూలియా లొపెజ్, లీ రౌలీ, నీల్ ఓబ్రియాన్, అలెక్స్ బర్హార్ట్ సంయుక్తంగా రాజీనామా లేఖ సంధించారు. వెనువెంటనే ఉపాధి కల్పన మంత్రి మిమ్స్ డేవిస్ కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వీరితో పాటు పలువురు మంత్రుల సహాయకులు, రాయబారులు కూడా భారీగా రాజీనామా బాట పడుతున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ లారా ట్రాట్ తదితరులు ప్రభుత్వపరమైన పదవుల నుంచి తప్పుకున్నారు. మొత్తమ్మీద ఒక్క బుధవారమే 34 రాజీనామాలు చోటుచేసుకున్నాయి! ఈ పరిణామాలు జాన్సన్‌కు ఊపిరాడనివ్వడం లేదు. ఆయన రాజీనామాకు కూడా సొంత పార్టీ ఎంపీల నుంచే ఒత్తిడి పెరుగుతోంది. జాన్సన్ తక్షణం తప్పుకోవాల్సిందేనని ఆయనకు గట్టి సమర్థకులుగా పేరున్న మంత్రులు ప్రీతీ పటేల్, మైఖేల్ గోవ్ కూడా డిమాండ్ చేశారు. సునక్, జావిద్ కూడా జాన్సన్ నాయకత్వంపైనే పదునైన విమర్శలు చేయడం తెలిసిందే. ప్రధానిని తప్పించేందుకు వీలుగా 1922 కమిటీ నిబంధనలను మార్చాలని డిమాండ్ చేస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల సంఖ్య చూస్తుండగానే పెరిగిపోతోంది. 1922 కమిటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ తదితరులు కూడా తప్పుకోవాలని జాన్సన్‌కు నేరుగానే సూచిస్తున్నారు. తన తప్పిదాలకు ఇతరులను నిందించడం ప్రధానికి అలవాటుగా మారిందంటూ దుయ్యబడుతున్నారు. జాన్సన్‌ను తక్షణం పదవి నుంచి తొలగించండంటూ మంత్రులకు జావిద్ బుధవారం పిలుపునిచ్చారు. కానీ జాన్సన్ మాత్రం ఎవరేం చెప్పినా తనంత తానుగా తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘2019 ఎన్నికల్లో ప్రజలు నాకు భారీ మెజారిటీ కట్టబెట్టింది ఇలా అర్ధాంతరంగా తప్పుకునేందుకు కాదు. సమస్యలను అధిగమించి పరిస్థితిని చక్కదిద్దుతా. అందుకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమే’’ అని ప్రకటించారు. సునక్ స్థానంలో ఇరాక్ మూలాలున్న నదీమ్ జవాహీ, సాజిద్ స్థానంలో స్టీవ్ బార్‌క్లేలను నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. జాన్సన్‌కు అండగా నిలబడాలని కేబినెట్ సహచరులకు జవాహీ పిలుపునిచ్చారు. కానీ జాన్సన్‌కు పదవీగండం తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో జరగబోయే హౌస్ ఆఫ్ కామర్స్ సమావేశాల్లో విపక్షాలతో పాటు సొంత పార్టీలోని వ్యతిరేకుల నుంచి జాన్సన్‌కు ఇబ్బందికరమైన ప్రశ్నలు తప్పవని చెబుతున్నారు. FIVE ministers resign in one fell swoop: Kemi Badenoch, Neil O'Brien, Alex Burghart, Lee Rowley and Julia Lopez pic.twitter.com/WAYannhrvR — Dominic Penna (@DominicPenna) July 6, 2022 ఇది కూడా చదవండి: క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ కుదింపు.. కారణం అదేనా? -
ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక
లండన్: ఒక పిజ్జా కొంటే రెండో పిజ్జా ఫ్రీ, ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ వంటి ఆఫర్లను మనం చూసే ఉంటాం. అయితే బ్రిటన్‌లో ఇలాంటి ఆఫర్లకు అడ్డుకట్ట పడబోతోంది. అంతేకాదు ప్రతి ఆహారం వల్ల ఎంత కేలరీల శక్తి వస్తుందో ఆయా వివరాలను కూడా రెస్టారెంట్లు మెనూలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి ఆలోచనలు బ్రిటిష్ ప్రభుత్వానికి కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఆలోచనలు చేశారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా కూర్చొని తినేవారి సంఖ్య పెరగడం, దాంతో ఊబకాయం కూడా పెరగడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులేస్తోంది. ఐసీయూకు వచ్చే వారిలో 8 శాతం మంది ఊబకాయంతో ఉన్నవారేనని సమాచారం. యువకుల్లో మూడింటి రెండొంతుల మంది అధిక బరువుతో బాధ పడుతున్నారని, 28 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని ప్రభుత్వం అంటోంది. బరువు తగ్గడం కష్టమే అయినా చిన్న చిన్న మార్పులతో ఫిట్‌గా ఉండొచ్చని ప్రధాని జాన్సన్ అన్నారు. -
మాల్యా అప్పగింతలో మరింత జాప్యం
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు బ్రిటన్ అప్పగించే ప్రక్రియకు మరింత సమయం పట్టేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన అప్పగింతకు ముందు కొన్ని చట్టపరమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ఎంతకాలం పడుతుందన్నది చెప్పలేమని బ్రిటన్ హై కమిషన్ ప్రతినిధి చెప్పారు. ‘అప్పగింతను వ్యతిరేకిస్తూ విజయ్ మాల్యా పెట్టుకున్న అప్పీళ్లన్నీ తిరస్కరణకు గురయ్యాయి. అయినప్పటికీ ఆయనను అప్పగించేందుకు ముందుగా పరిష్కరించుకోవాల్సిన చట్టపరమైన అంశం ఒకటి ఉంది‘ అని వివరించారు. అది పూర్తయ్యే దాకా బ్రిటన్ చట్టం ప్రకారం అప్పగింత కుదరదని, ఇంతకు మించి వివరాలు వెల్లడించడానికి లేదని ప్రతినిధి చెప్పారు. దివాలా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ మాల్యా దేశీ బ్యాంకులకు దాదాపు రూ. 9,000 కోట్లు ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2016 నుంచి ఆయన బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు. -
బిటిష్ గ్రాండ్‌ప్రి జరిగేనా!
లండన్: జూలైలో వరుసగా రెండు వారాల్లో రెండు రేసులను నిర్వహించాలని ఆశించిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) నిర్వాహకులకు నిరాశ ఎదురైంది. ఎఫ్1 రేసుల్లో పాల్గొనేందుకు వచ్చే అన్ని జట్లకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రేసు నిర్వాహకులు బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే దీనికి బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించలేదు. జూన్ 8 నుంచి బ్రిటన్‌లో అడుగుపెట్టే వారు తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని... ఈ నిబంధనలు ఎవరికీ మినహాయింపు కాదని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు వారాల తర్వాతే ఈ నిబంధనపై సమీక్షిస్తారు. -
డాక్టర్ల కోసం యూకే ప్రత్యేక వీసా
లండన్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హులైన వైద్యులు, నర్సుల కోసం ప్రత్యేకంగా ఒక వీసాను ప్రారంభించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిధులతో నిర్వహించే నేషనల్ హెల్త్ సర్వీసెస్(ఎన్హెచ్ఎస్)లో నిపుణుల కొరతతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ‘ఎన్హెచ్ఎస్ వీసా’ హామీని ఇటీవలి ప్రధాని జాన్సన్ తెరపైకి తెచ్చారు. అర్హులైన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య నిపుణులు త్వరితగతిన బ్రిటన్‌కు వచ్చేందుకు ఈ వీసా దోహదపడుతుందని భావిస్తున్నారు. -
సుస్థిరతకు బ్రిటన్ పట్టం
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు రావాలన్న ‘బ్రెగ్జిట్’ నినాదం రాజుకుని రాజకీయ రూపం సంతరించుకున్నప్పటినుంచీ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ చివరకు దృఢమైన నిర్ణయం తీసుకుంది. బ్రెగ్జిట్‌ను గట్టిగా సమర్థిస్తున్న కన్సర్వేటివ్ పార్టీకి గురువారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీ కట్టబెట్టి రాజకీయ అస్థిరత్వానికి తెరదించింది. అయిదేళ్లలో మూడో దఫా జరిగిన ఈ ఎన్నికల్లో సైతం హంగ్ పార్లమెంట్ తప్పదని, కన్సర్వేటివ్‌లకు బొటాబొటీ మెజారిటీ వస్తుందని, అది విపక్షాలతో కలిసి జాతీయ సంకీర్ణ ప్రభుత్వంతో సరిపెట్టుకోక తప్పదని అంచనా వేసిన రాజకీయ పండితులను శుక్రవారం వెలువడిన ఫలితాలు వెక్కిరించాయి. పార్లమెంటు లోని 650 స్థానాల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ 365 స్థానాలు సాధించగా, దాని ప్రధాన ప్రత్యర్థి లేబర్ పార్టీ కేవలం 203 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేశం ఈయూలోనే ఉండాలని బలంగా వాదించిన లిబరల్ డెమొక్రాట్లకు కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. స్కాటిష్ నేషనల్ పార్టీకి 48 లభించాయి. ఎగ్జిట్ పోల్స్ కన్సర్వేటివ్‌లు భారీ మెజారిటీ సాధించే అవకాశం ఉన్నదని ముందే జోస్యం చెప్పాయి. అదే నిజమైంది. పద్నాలుగేళ్ల తర్వాత కన్సర్వేటివ్ పార్టీకి పార్లమెంటులో ఇంత స్పష్టమైన మెజారిటీ లభించడం ఇదే మొదటిసారి. అలాగే ఆ పార్టీకి 1987లో లభించిన స్థానాలకన్నా ఈసారి అత్యధిక స్థానాలు వచ్చాయి. అటు లేబర్ పార్టీది ఘోరమైన పరాజయం. తాజా ఎన్నికలతో కలుపుకొని చూస్తే అది వరసగా నాలుగు సాధా రణ ఎన్నికల్లో ఓటమిపాలైట్టు లెక్క. పైగా 80 ఏళ్లలో ఎప్పుడూ ఇంత కింది స్థాయికి అది పడిపోయిన దాఖలా లేదు. అయిదేళ్లలో మూడు పార్లమెంటు ఎన్నికలను చవిచూసిన బ్రిటన్ ప్రజానీకం ఈ అస్థిరతకూ, దానివల్ల కలుగుతున్న దుష్ఫలితాలకూ విసుగెత్తి కన్సర్వేటివ్‌లకు తిరుగులేని ఆధిక్యతను అందించారు. అయితే ఈ ఫలితాల్లో మరో ప్రమాదం పొంచివుంది. స్కాట్లాండ్ స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న స్కాటిష్ నేషనల్ పార్టీ ఆ గడ్డపై భారీగా సీట్లు సాధించింది. కనుక తమ డిమాండ్‌పై మరోసారి రెఫరెండం నిర్వహించాలని ఆ పార్టీ పట్టుబడుతుంది. అదే జరిగితే బ్రిటన్‌కు రాజ్యాంగ సంకటం ఎదురవుతుంది. 2014లో తొలిసారి జరిగిన రెఫరెండంలో 55 శాతంమంది ఐక్యతకే ఓటే యడంతో ఆ డిమాండ్ వీగిపోయింది. అయితే అప్పట్లో బ్రెగ్జిట్ గొడవ లేదు. ఈయూతో కలసి వుండాలన్న తమ ఆకాంక్షకు విరుద్ధంగా ఇప్పుడు జరగబోతోంది గనుక ఈసారి రెఫరెండం నిర్వహిస్తే వారు బ్రిటన్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించినా ఆశ్చర్యం లేదు. 312 ఏళ్లక్రితం రెండు రాచ కుటుంబాల మధ్య ఏర్పడ్డ వివాహబంధంతో ఆ ప్రాంతం బ్రిటన్‌లో విలీనమైంది. ప్రపంచమంతా మితవాద ధోరణివైపు మొగ్గు చూపుతున్న వర్తమానంలో బ్రిటన్ అందుకు విరుద్ధమైన తీర్పునిస్తుందని కొందరు విశ్లేషకులు ఆశించిందంతా దురాశే కావొచ్చు. కానీ అందుకు కారణాలున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రానికి ఆవలనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు రూపంలో పోలికలున్న బోరిస్ జాన్సన్ ఆయన గుణాలనే పుణికిపుచ్చుకున్నారు. తరచుగా మహిళ లను కించపరిచే వ్యాఖ్యానాలు చేయడం, ఇస్లాంను పెనుభూతంగా చూడటం, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం వంటì దురలవాట్లు జాన్సన్‌కు కూడా ఉన్నాయి. పైగా ఈయూతో ఒప్పందం కుదిరితే సరేసరి... లేదా ఏ ఒప్పందమూ లేకుండా బయటికొచ్చేయడానికి కూడా సిద్ధమని ఆయన చేసిన ప్రకటనలు ప్రకంపనలు సృష్టించాయి. మొన్న మే నెలలో మరో 27 సభ్య దేశాలతోపాటు బ్రిటన్లోకూడా జరిగిన ఈయూ పార్లమెంటు ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ అంతకుముందున్న 19 స్థానాల్లో 15 కోల్పోయి, నాలుగుకు పరిమితమైంది. లేబర్ పార్టీ అంతకుముందున్న 20 స్థానాల్లో సగం మాత్రమే గెల్చుకోగలిగింది. ఈయూతోనే ఉండాలన్న లిబరల్ డెమొక్రాట్లు అంతకుముందున్న ఒక స్థానం నుంచి ఏకంగా 15కు చేరుకున్నారు. బ్రెగ్జిట్‌కు పట్టుబడుతున్న తీవ్ర మితవాద రాజకీయ పక్షం బ్రెగ్జిట్ పార్టీ 29 స్థానాలు గెల్చుకుంది. ఇప్పుడు బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలకూ, ఆర్నెల్లక్రితం జరిగిన ఈయూ ఎన్నికల ఫలితాలకూ పొంతనే లేదు. ఆ ఎన్నికల్లో దెబ్బతిన్న కన్సర్వే టివ్‌లు చాలా త్వరగా కోలుకుని బలోపేతం కాగా, లేబర్ పార్టీకి అవే ఫలితాలు పునరావృతమ య్యాయి. ఈయూ ఎన్నికల్లో పుంజుకున్నట్టు కనబడిన తీవ్ర మితవాద పక్షం బ్రెగ్జిట్ పార్టీ ఈ ఎన్ని కల్లో సున్నా చుట్టింది. ఒక్క సీటూ గెల్చుకోలేక డీలాపడింది. బోరిస్ జాన్సన్ రూపంలో బలమైన మితవాది రంగంలో ఉండగా నైజల్ ఫరాజ్ నేతృత్వంలోని బ్రెగ్జిట్ పార్టీ దండగని ఓటర్లు అనుకుని ఉండొచ్చు. భారీగా మెజారిటీ సాధించిన బోరిస్ జాన్సన్‌కు ఇప్పుడు చేతినిండా పని. ఆయన పరిపూర్తి చేయాల్సిన కర్తవ్యాలు సాధారణమైనవి కాదు. సాధ్యమైనంత తక్కువ నష్టంతో ఈయూ నుంచి బయటకు రావడం, ఆ సంస్థ సభ్య దేశాలతో విడివిడిగా మెరుగైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం రెండూ సంక్లిష్టమైనవి. బ్రెగ్జిట్‌ను వచ్చే జనవరి 31కల్లా పూర్తి చేస్తానని ఎన్నికల ప్రచార పర్వంలో ఆయన పదే పదే చెప్పారు. అదంత సులభం కాదు. అందులో ఎన్ని చిక్కు ముడులున్నాయంటే...బ్రిటన్ ఏ ఒప్పందమూ లేకుండా నిష్క్రమించక తప్పని పరిస్థితులు కూడా ఏర్పడొచ్చు. ఈ క్రమంలో ఎదురయ్యే ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడానికి కొన్ని ‘పొదుపు’ చర్యలు కూడా ఆయన తీసుకోవాల్సివుంటుంది. ఇందుకోసం జాతీయ ఆరోగ్య సర్వీసు (ఎన్హెచ్ఎస్) సహా పలు పథకాలకు కోత, ప్రైవేటీకరణ వంటివి తప్పకపోవచ్చు. ఎన్‌హెచ్‌ఎస్‌ని ప్రైవేటీకరిస్తే ప్రజారోగ్యానికి ముప్పు కలుగుతుందని లేబర్ పార్టీ చేసిన ప్రచారాన్ని ఖాతరు చేయని జనం సుస్థిర ప్రభుత్వంతో తమకు మేలే తప్ప కీడు జరగదని విశ్వసించారు. దాన్ని జాన్సన్ ఎలా నిలబెట్టుకోగలరో చూడాలి. -
బ్రిటన్ హోం మంత్రిగా ప్రీతీ పటేల్
లండన్: బ్రిటన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. బ్రెగ్జిట్‌పై వివాదం కారణంగా ఆ దేశ ప్రధాని బాధ్యతల నుంచి థెరెసా మే దిగిపోవడంతో కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నిక కావడం తెలిసిందే. రాణి ఎలిజబెత్ బుధవారం సాయంత్రమే జాన్సన్‌ను కొత్త ప్రధానిగా నియమించారు. ఆ వెంటనే మంత్రివర్గంలో జాన్సన్ మార్పులు చేశారు. మొత్తం ముగ్గురు భారత సంతతికి చెందిన ఎంపీలకు జాన్సన్ తన టీమ్‌లో స్థానం కల్పించారు. ప్రీతీ పటేల్, రిషి సునక్, అలోక్ శర్మ అనే భారత సంతతి ఎంపీలు కొత్త కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. వీరిలో రిషి సునక్, ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడైన ఎన్.ఆర్.నారాయణ మూర్తికి స్వయానా అల్లుడు. వీరంతా గతంలో జాన్సన్ వెన్నంటే ఉండి ప్రచారాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు. వీరు ముగ్గురూ గురువారం కొత్త కేబినెట్ తొలి సమావేశానికి హాజరయ్యారు. అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడమే తమ లక్ష్యమని జాన్సన్ స్పష్టం చేశారు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఎలాంటి ఒప్పందమూ లేకుండానైనా సరే, అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రారంభిస్తామన్న హామీతో జాన్సన్‌కు ప్రధాని పదవి లభించింది. మొత్తం 31 మంది సభ్యులతో మంత్రివర్గాన్ని ప్రకటించారు. వారంతా బ్రెగ్జిట్ ప్రక్రియలో తనకు సహకరిస్తారని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. హోంమంత్రిగా ప్రీతీ పటేల్ బోరిస్ జాన్సన్ కేబినెట్లో కీలక పదవి దక్కిన భారత సంతతి వ్యక్తి ప్రీతీ పటేలేనని చెప్పుకోవాలి. గుజరాత్‌కు చెందిన తల్లిదండ్రులకు బ్రిటన్‌లోనే జన్మించిన ప్రీతీ పటేల్ (47) హోం మంత్రిగా నియమితులయ్యారు. బ్రెగ్జిట్‌పై థెరెసా మే విధానాలను ప్రీతి తూర్పారపట్టేవారు. బ్రిటన్‌లో భారతీయ కుటుంబాలు నిర్వహించే కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉంటారు. భారత ప్రధాని మోదీకి ప్రీతి బ్రిటన్‌లో కీలకమద్దతుదారు. బ్రిటన్ ప్రధాని ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. ఇక అలోక్ శర్మకు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ శాఖ బా«ధ్యతలిచ్చారు. 2010 నుంచి అలోక్శర్మ ఎంపీగా ఉన్నారు. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. రీడింగ్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అలోక్ శర్మ జన్మించారు. అలోక్‌కు అయిదేళ్లప్పుడే ఆ కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి రిషి రిషి సునక్ (39) ట్రెజరీ విభాగానికి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. రిషి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా రిచ్మాండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిషి తండ్రి భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. రిషి సునక్ బ్రిటన్‌లోనే పుట్టారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ వైద్య రంగానికి చెందినవారు. కాలిఫోర్నియాలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతుండగా ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తితో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారత్‌తో జాన్సన్కీ అనుబంధం ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కూడా భారత్‌తో ఒకప్పుడు అందమైన అనుబంధమే ఉంది. ఆయన మొదటి భార్య మరీనా వీలర్ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తండ్రి చార్లెస్ వీలర్ బీబీసీ ఢిల్లీ కరస్పాండెంట్‌గా పనిచేశారు. ఆయన రెండో భార్య దీప్ సింగ్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సరొగోధకు చెందినవారు. దేశ విభజన తర్వాత వారి కుటుంబం భారత్‌కు వచ్చి స్థిరపడింది. దీప్ సింగ్ మొదటి భర్త ప్రముఖ బాక్సర్ సర్ శోభాసింగ్ కుమారుల్లో ఒకరైన దల్జీత్. దల్జీత్ ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ సోదరుడు. బోరిస్ జాన్సన్, మరీనా దంపతులు భారత్‌కు చాలా సార్లు వచ్చారు. దల్జీత్‌సింగ్ కుటుంబంతో కూడా జాన్సన్ సంబంధాలు కొనసాగించారు. 2017 ఎన్నికల సమయంలో బ్రిస్టల్‌లో గురుద్వారాలో మాట్లాడుతూ భారత్‌కు వెళ్లినప్పుడల్లా తమ బంధువులకి స్కాచ్ విస్కీ తీసుకువెళుతుండేవాడినని చెప్పి వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. -
లండన్‌లో కార్లపై కాలుష్య పన్ను
లండన్: కాలుష్యానికి కారణమవున్న కార్లకు అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త పన్నును అమల్లోకి తెచ్చింది. లండన్ నగరంలో తిరిగే పాత కార్లు, అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలకు 10 పౌండ్ల (రూ. 858) జరినామా విధించాలని లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ నిర్ణయించారు. 2006కు ముందు రిజిస్టరైన డీజి ల్, పెట్రోల్ వాహనాలకు ఈ కాలుష్య పన్ను వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో పేద డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారని పన్నును వ్యతిరేకిస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరప్‌లో అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటైన లండన్‌లో తక్షణం నివారణ చర్యలు చేపట్టాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది. -
అబ్బాయిలూ స్కర్టులో రావచ్చు..
లండన్: స్కర్టు వేసుకుని స్కూళ్లకు వెళ్లాలనుకునే అబ్బాయిలు నిరభ్యంతరంగా స్కర్టు వేసుకోవచ్చు. రోజూ ప్యాంటు, షర్టులో స్కూలుకు వెళ్లాలనుకునే అమ్మాయిలకు స్కూళ్లో ఎవరూ అడ్డుచెప్పరు. ఇలా తమకు నచ్చిన యునిఫామ్‌లో విద్యనభ్యసించేలా బ్రిటన్ ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ముందుగా 80 ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమలుచేస్తున్నారు. లింగవివక్షకు గురయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రభుత్వం ఈ వెలుసుబాటు ఇచ్చింది. ఇలా కొత్త నిబంధనలను అమలుచేస్తున్న పాఠశాలగా బర్మింగ్‌హామ్‌లోని అలెన్స్ క్రాఫ్ట్ స్కూలు రికార్డులకెక్కింది. అయితే, కొత్త నిబంధనలను కొన్ని క్రైస్తవ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.