బ్రిటన్ పార్లమెంటులో సభ్యుల ప్రశ్నలకు బదులిస్తున్న బోరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్‌లో రాజకీయ అనిశ్చితి తీవ్రతరమైంది. మంగళవారం భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్‌లతో మొదలైన రాజీనామాల పర్వం బుధవారం మరింత ఊపందుకుంది. సునక్, జావిద్ మాదిరిగానే తమకూ ప్రధాని బోరిస్ జాన్సన్ (58) నాయకత్వంపై నమ్మకం పోయిందంటూ బుధవారం ఏకంగా 12 మంది మంత్రులు తప్పుకున్నారు! ముందుగా జాన్ గ్లెన్, విక్టోరియా అట్కిన్స్, జో చర్చిల్, స్టూవర్ట్ ఆండ్రూ, విల్ క్విన్స్ (విద్యా శాఖ), రాబిన్ వాకర్ (స్కూళ్లు) రాజీనామా చేశారు.
ఆ తర్వాత మరో ఐదుగురు మంత్రులు కేమీ బదెనోచ్ జూలియా లొపెజ్, లీ రౌలీ, నీల్ ఓబ్రియాన్, అలెక్స్ బర్హార్ట్ సంయుక్తంగా రాజీనామా లేఖ సంధించారు. వెనువెంటనే ఉపాధి కల్పన మంత్రి మిమ్స్ డేవిస్ కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వీరితో పాటు పలువురు మంత్రుల సహాయకులు, రాయబారులు కూడా భారీగా రాజీనామా బాట పడుతున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ లారా ట్రాట్ తదితరులు ప్రభుత్వపరమైన పదవుల నుంచి తప్పుకున్నారు. మొత్తమ్మీద ఒక్క బుధవారమే 34 రాజీనామాలు చోటుచేసుకున్నాయి! ఈ పరిణామాలు జాన్సన్‌కు ఊపిరాడనివ్వడం లేదు.
ఆయన రాజీనామాకు కూడా సొంత పార్టీ ఎంపీల నుంచే ఒత్తిడి పెరుగుతోంది. జాన్సన్ తక్షణం తప్పుకోవాల్సిందేనని ఆయనకు గట్టి సమర్థకులుగా పేరున్న మంత్రులు ప్రీతీ పటేల్, మైఖేల్ గోవ్ కూడా డిమాండ్ చేశారు. సునక్, జావిద్ కూడా జాన్సన్ నాయకత్వంపైనే పదునైన విమర్శలు చేయడం తెలిసిందే. ప్రధానిని తప్పించేందుకు వీలుగా 1922 కమిటీ నిబంధనలను మార్చాలని డిమాండ్ చేస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల సంఖ్య చూస్తుండగానే పెరిగిపోతోంది. 1922 కమిటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ తదితరులు కూడా తప్పుకోవాలని జాన్సన్‌కు నేరుగానే సూచిస్తున్నారు. తన తప్పిదాలకు ఇతరులను నిందించడం ప్రధానికి అలవాటుగా మారిందంటూ దుయ్యబడుతున్నారు. జాన్సన్‌ను తక్షణం పదవి నుంచి తొలగించండంటూ మంత్రులకు జావిద్ బుధవారం పిలుపునిచ్చారు.
కానీ జాన్సన్ మాత్రం ఎవరేం చెప్పినా తనంత తానుగా తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘2019 ఎన్నికల్లో ప్రజలు నాకు భారీ మెజారిటీ కట్టబెట్టింది ఇలా అర్ధాంతరంగా తప్పుకునేందుకు కాదు. సమస్యలను అధిగమించి పరిస్థితిని చక్కదిద్దుతా. అందుకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమే’’ అని ప్రకటించారు. సునక్ స్థానంలో ఇరాక్ మూలాలున్న నదీమ్ జవాహీ, సాజిద్ స్థానంలో స్టీవ్ బార్‌క్లేలను నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. జాన్సన్‌కు అండగా నిలబడాలని కేబినెట్ సహచరులకు జవాహీ పిలుపునిచ్చారు. కానీ జాన్సన్‌కు పదవీగండం తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో జరగబోయే హౌస్ ఆఫ్ కామర్స్ సమావేశాల్లో విపక్షాలతో పాటు సొంత పార్టీలోని వ్యతిరేకుల నుంచి జాన్సన్‌కు ఇబ్బందికరమైన ప్రశ్నలు తప్పవని చెబుతున్నారు.
FIVE ministers resign in one fell swoop: Kemi Badenoch, Neil O'Brien, Alex Burghart, Lee Rowley and Julia Lopez pic.twitter.com/WAYannhrvR
— Dominic Penna (@DominicPenna) July 6, 2022
ఇది కూడా చదవండి: క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ కుదింపు.. కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment