ప్రీతీ పటేల్, రిషి సునక్, అలోక్ శర్మ
లండన్: బ్రిటన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. బ్రెగ్జిట్‌పై వివాదం కారణంగా ఆ దేశ ప్రధాని బాధ్యతల నుంచి థెరెసా మే దిగిపోవడంతో కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నిక కావడం తెలిసిందే. రాణి ఎలిజబెత్ బుధవారం సాయంత్రమే జాన్సన్‌ను కొత్త ప్రధానిగా నియమించారు. ఆ వెంటనే మంత్రివర్గంలో జాన్సన్ మార్పులు చేశారు. మొత్తం ముగ్గురు భారత సంతతికి చెందిన ఎంపీలకు జాన్సన్ తన టీమ్‌లో స్థానం కల్పించారు. ప్రీతీ పటేల్, రిషి సునక్, అలోక్ శర్మ అనే భారత సంతతి ఎంపీలు కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
వీరిలో రిషి సునక్, ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడైన ఎన్.ఆర్.నారాయణ మూర్తికి స్వయానా అల్లుడు. వీరంతా గతంలో జాన్సన్ వెన్నంటే ఉండి ప్రచారాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు. వీరు ముగ్గురూ గురువారం కొత్త కేబినెట్ తొలి సమావేశానికి హాజరయ్యారు. అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడమే తమ లక్ష్యమని జాన్సన్ స్పష్టం చేశారు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఎలాంటి ఒప్పందమూ లేకుండానైనా సరే, అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రారంభిస్తామన్న హామీతో జాన్సన్‌కు ప్రధాని పదవి లభించింది. మొత్తం 31 మంది సభ్యులతో మంత్రివర్గాన్ని ప్రకటించారు. వారంతా బ్రెగ్జిట్ ప్రక్రియలో తనకు సహకరిస్తారని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హోంమంత్రిగా ప్రీతీ పటేల్
బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో కీలక పదవి దక్కిన భారత సంతతి వ్యక్తి ప్రీతీ పటేలేనని చెప్పుకోవాలి. గుజరాత్‌కు చెందిన తల్లిదండ్రులకు బ్రిటన్‌లోనే జన్మించిన ప్రీతీ పటేల్ (47) హోం మంత్రిగా నియమితులయ్యారు. బ్రెగ్జిట్‌పై థెరెసా మే విధానాలను ప్రీతి తూర్పారపట్టేవారు. బ్రిటన్‌లో భారతీయ కుటుంబాలు నిర్వహించే కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉంటారు. భారత ప్రధాని మోదీకి ప్రీతి బ్రిటన్‌లో కీలకమద్దతుదారు. బ్రిటన్ ప్రధాని ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. ఇక అలోక్ శర్మకు ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ శాఖ బా«ధ్యతలిచ్చారు. 2010 నుంచి అలోక్‌శర్మ ఎంపీగా ఉన్నారు. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. రీడింగ్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అలోక్ శర్మ జన్మించారు. అలోక్‌కు అయిదేళ్లప్పుడే ఆ కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది.
ఆర్థిక శాఖ సహాయ మంత్రి రిషి
రిషి సునక్ (39) ట్రెజరీ విభాగానికి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. రిషి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా రిచ్‌మాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిషి తండ్రి భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. రిషి సునక్ బ్రిటన్‌లోనే పుట్టారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ వైద్య రంగానికి చెందినవారు. కాలిఫోర్నియాలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతుండగా ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తితో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
భారత్‌తో జాన్సన్‌కీ అనుబంధం
ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కూడా భారత్‌తో ఒకప్పుడు అందమైన అనుబంధమే ఉంది. ఆయన మొదటి భార్య మరీనా వీలర్ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తండ్రి చార్లెస్ వీలర్ బీబీసీ ఢిల్లీ కరస్పాండెంట్‌గా పనిచేశారు. ఆయన రెండో భార్య దీప్ సింగ్ ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న సరొగోధకు చెందినవారు. దేశ విభజన తర్వాత వారి కుటుంబం భారత్‌కు వచ్చి స్థిరపడింది. దీప్ సింగ్ మొదటి భర్త ప్రముఖ బాక్సర్ సర్ శోభాసింగ్ కుమారుల్లో ఒకరైన దల్జీత్. దల్జీత్ ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ సోదరుడు. బోరిస్ జాన్సన్, మరీనా దంపతులు భారత్‌కు చాలా సార్లు వచ్చారు. దల్జీత్‌సింగ్ కుటుంబంతో కూడా జాన్సన్ సంబంధాలు కొనసాగించారు. 2017 ఎన్నికల సమయంలో బ్రిస్టల్‌లో గురుద్వారాలో మాట్లాడుతూ భారత్‌కు వెళ్లినప్పుడల్లా తమ బంధువులకి స్కాచ్ విస్కీ తీసుకువెళుతుండేవాడినని చెప్పి వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు.
Comments
Please login to add a commentAdd a comment