Preeti Patel
-
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింత!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.13,000 కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(50)ని భారత్‌కు రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమయ్యింది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అప్పగింత ఉత్తర్వుపై యునైటెడ్ కింగ్డమ్ హోంశాఖ మంత్రి(సెక్రెటరీ) ప్రీతి పటేల్ సంతకం చేసినట్లు యూకేలోని భారత రాయబార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలకు సంబంధించి మోసం, మనీలాండరింగ్ కేసులు నీరవ్ మోదీపై నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. హోంశాఖ సెక్రెటరీ జారీ చేసిన తాజా ఉత్తర్వుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరడానికి నీరవ్ మోదీకి 14 రోజుల గడువు ఇచ్చారు. ఆధారాల పట్ల కోర్టు సంతృప్తి నీరవ్ మోదీ తన మామ మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు ఇండియాలో కేసులు నమోదయ్యాయని, అతడు ఇండియాలోని న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 25న స్పష్టం చేసింది. నీరవ్‌పై నమోదైన కేసుల విషయంలో ఇండియాలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. నీరవ్‌ను భారత్ అప్పగించే విషయంలో నిర్ణయాన్ని హోంశాఖకు వదిలేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఇండియాలో అయితే సరైన వైద్యం అందదన్న నీరవ్ వాదనను న్యాయస్థానం కొట్టిపారేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడని చెప్పేందుకు ఉన్న ఆధారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మనీ లాండరింగ్, సాక్షులను బెదిరించడం, ఆధారాలను మాయం చేయడం తదితర అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసుల్లో నీరవ్ మోదీ నిందితుడని స్పష్టంగా బయటపడుతోందని గుర్తుచేసింది. అందుకే బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తెలియజేసింది. యూకే అప్పగింత చట్టం–2003 ప్రకారం.. న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని హోంశాఖ సెక్రెటరీకి తెలియజేస్తారు. ఇండియా–యూకే మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని పర్యవేక్షించే అధికారం ఉన్న యూకే కేబినెట్ మంత్రి దీనిపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిప్రకారమే నీరవ్ మోదీ అప్పగింతకు హోంశాఖ మంత్రి ప్రీతి సుముఖత వ్యక్తం చేశారు. అప్పగింత ఎప్పుడు? నీరవ్ మోదీని వాండ్స్‌వర్త్ జైలు నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో ఉన్న 12వ నంబర్ బ్యారక్‌కు తరలించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యూకే హోంమంత్రి ఉత్తర్వులను సవాలు చేస్తూ లండన్ హైకోర్టును ఆశ్రయించేందుకు నీరవ్ మోదీకి అవకాశం కల్పించారు. ఆయన ఒకవేళ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడే మరికొంత కాలం విచారణ జరుగనుంది. యూకే సుప్రీంకోర్టులో కూడా నీరవ్‌మోదీ అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుందని సమాచారం. అయితే, లండన్ హైకోర్టు అనుమతిస్తేనే అది సాధ్యమవుతుంది. తాజా పరిణామాలపై నీరవ్ మోదీ లీగల్ టీమ్ ఇంకా స్పందించలేదు. హైకోర్టుకు వెళ్తారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. యూకేలో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే నీరవ్ మోదీ భారత్‌కు చేరుకుంటారు. అసలేమిటి కేసు? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు మరికొందరు లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ను (ఎల్ఓయూ) దుర్వినియోగం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ 2018 జనవరి 31న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసింది. ఎల్ఓయూ అంటే తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకుశాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రం. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఎల్‌ఓయూతో నీరవ్ మోదీ ముఠా వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పీఎన్బీ బ్యాంక్ శాఖల నుంచి రూ.13,000 కోట్లకుపైగా రుణాలుగా తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ కేసులో సీబీఐ 2018 మే 14న నీరవ్‌తోసహా మొత్తం 25 మంది నిందితులపై మొదటి చార్జిసీట్ కోర్టులో దాఖలు చేసింది. 2019 డిసెంబర్ 20న 30 మందిపై రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్లో ఉన్నవారంతా రెండో చార్జిషీట్లోనూ ఉన్నారు. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును నీరవ్ మోదీ ముఠా దుబాయ్, హాంకాంగ్‌లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ముత్యాల ఎగుమతి, దిగుమతుల పేరిట ఈ సొమ్మును దారిమళ్లించారు. నీరవ్ మోదీ 2018 జనవరి 1న ఇండియా నుంచి తప్పించుకున్నాడు. ట్రయల్ కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2018 జూన్‌లో ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2019 మార్చిలో యూకే పోలీసులు నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లను వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు, లండన్ హైకోర్టు కొట్టివేశాయి. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యూకేను అభ్యర్థించింది. -
యూకేలో ‘పాయింట్స్ బేస్డ్ వీసా’
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ, అత్యంత తెలివైన నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించే నూతన పాయింట్స్ ఆధారిత వీసా విధానాన్ని బ్రిటన్ బుధవారం ఆవిష్కరించింది. నిపుణులు కాని, చవక కార్మికుల వలసలను నిరోధించే దిశగా ఈ విధానాన్ని రూపొందించామని భారత సంతతికి చెందిన యూకే హోం మంత్రి ప్రీతి పటేల్ పేర్కొన్నారు. ఈ తాజా వీసా విధానం వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యాలు, వృత్తులు, వేతనాలు.. మొదలైన వాటికి పాయింట్లను కేటాయించి, అవసరమైన అర్హత పాయింట్లు సాధించిన వారికే వీసా ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందించారు. ‘ఈ రోజు చరిత్రాత్మకం. ఈ దేశ పౌరులు కోరుకుంటున్నట్లుగా, పాయింట్ల ఆధారిత వీసా విధానాన్ని ప్రారంభిస్తున్నాం’ అని ఈ సందర్భంగా ప్రీతి పటేల్ పేర్కొన్నారు. తాజా వీసా విధాన ప్రకారం యూకేకి రావాలనుకునేవారు కచ్చితంగా ఆంగ్లం మాట్లాడగలగాలి. అర్హత ఉన్న యాజమాన్యం నుంచి తమ నైపుణ్యానికి సంబంధించిన ఉద్యోగ ఆహ్వానం పొంది ఉండాలి. నైపుణ్యాల ద్వారా వారికి పాయింట్లు వస్తాయి. యూకేలో నిపుణులైన ఉద్యోగుల కొరత అధికంగా ఉన్న రంగాలకు ఉపాధి కోసం వచ్చేవారికి ప్రత్యేక పాయింట్లు ఉంటాయి. వివిధ రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యత కలిగినవారికి వెంటనే వీసా ఇచ్చే ఫాస్ట్ ట్రాక్ గ్లోబల్ టాలెంట్ స్కీమ్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని హోం శాఖ వెల్లడించింది. యూకేలోని కంపెనీలు, విద్యా సంస్థల నుంచి ఉద్యోగ ఆహ్వానం లేని ఈయూ దేశాల్లోని నిపుణులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఈ ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. -
బ్రిటన్ హోం మంత్రిగా ప్రీతీ పటేల్
లండన్: బ్రిటన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. బ్రెగ్జిట్‌పై వివాదం కారణంగా ఆ దేశ ప్రధాని బాధ్యతల నుంచి థెరెసా మే దిగిపోవడంతో కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నిక కావడం తెలిసిందే. రాణి ఎలిజబెత్ బుధవారం సాయంత్రమే జాన్సన్‌ను కొత్త ప్రధానిగా నియమించారు. ఆ వెంటనే మంత్రివర్గంలో జాన్సన్ మార్పులు చేశారు. మొత్తం ముగ్గురు భారత సంతతికి చెందిన ఎంపీలకు జాన్సన్ తన టీమ్‌లో స్థానం కల్పించారు. ప్రీతీ పటేల్, రిషి సునక్, అలోక్ శర్మ అనే భారత సంతతి ఎంపీలు కొత్త కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. వీరిలో రిషి సునక్, ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడైన ఎన్.ఆర్.నారాయణ మూర్తికి స్వయానా అల్లుడు. వీరంతా గతంలో జాన్సన్ వెన్నంటే ఉండి ప్రచారాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు. వీరు ముగ్గురూ గురువారం కొత్త కేబినెట్ తొలి సమావేశానికి హాజరయ్యారు. అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడమే తమ లక్ష్యమని జాన్సన్ స్పష్టం చేశారు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఎలాంటి ఒప్పందమూ లేకుండానైనా సరే, అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రారంభిస్తామన్న హామీతో జాన్సన్‌కు ప్రధాని పదవి లభించింది. మొత్తం 31 మంది సభ్యులతో మంత్రివర్గాన్ని ప్రకటించారు. వారంతా బ్రెగ్జిట్ ప్రక్రియలో తనకు సహకరిస్తారని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. హోంమంత్రిగా ప్రీతీ పటేల్ బోరిస్ జాన్సన్ కేబినెట్లో కీలక పదవి దక్కిన భారత సంతతి వ్యక్తి ప్రీతీ పటేలేనని చెప్పుకోవాలి. గుజరాత్‌కు చెందిన తల్లిదండ్రులకు బ్రిటన్‌లోనే జన్మించిన ప్రీతీ పటేల్ (47) హోం మంత్రిగా నియమితులయ్యారు. బ్రెగ్జిట్‌పై థెరెసా మే విధానాలను ప్రీతి తూర్పారపట్టేవారు. బ్రిటన్‌లో భారతీయ కుటుంబాలు నిర్వహించే కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉంటారు. భారత ప్రధాని మోదీకి ప్రీతి బ్రిటన్‌లో కీలకమద్దతుదారు. బ్రిటన్ ప్రధాని ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. ఇక అలోక్ శర్మకు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ శాఖ బా«ధ్యతలిచ్చారు. 2010 నుంచి అలోక్శర్మ ఎంపీగా ఉన్నారు. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. రీడింగ్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అలోక్ శర్మ జన్మించారు. అలోక్‌కు అయిదేళ్లప్పుడే ఆ కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి రిషి రిషి సునక్ (39) ట్రెజరీ విభాగానికి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. రిషి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా రిచ్మాండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిషి తండ్రి భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. రిషి సునక్ బ్రిటన్‌లోనే పుట్టారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ వైద్య రంగానికి చెందినవారు. కాలిఫోర్నియాలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతుండగా ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తితో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారత్‌తో జాన్సన్కీ అనుబంధం ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కూడా భారత్‌తో ఒకప్పుడు అందమైన అనుబంధమే ఉంది. ఆయన మొదటి భార్య మరీనా వీలర్ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తండ్రి చార్లెస్ వీలర్ బీబీసీ ఢిల్లీ కరస్పాండెంట్‌గా పనిచేశారు. ఆయన రెండో భార్య దీప్ సింగ్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సరొగోధకు చెందినవారు. దేశ విభజన తర్వాత వారి కుటుంబం భారత్‌కు వచ్చి స్థిరపడింది. దీప్ సింగ్ మొదటి భర్త ప్రముఖ బాక్సర్ సర్ శోభాసింగ్ కుమారుల్లో ఒకరైన దల్జీత్. దల్జీత్ ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ సోదరుడు. బోరిస్ జాన్సన్, మరీనా దంపతులు భారత్‌కు చాలా సార్లు వచ్చారు. దల్జీత్‌సింగ్ కుటుంబంతో కూడా జాన్సన్ సంబంధాలు కొనసాగించారు. 2017 ఎన్నికల సమయంలో బ్రిస్టల్‌లో గురుద్వారాలో మాట్లాడుతూ భారత్‌కు వెళ్లినప్పుడల్లా తమ బంధువులకి స్కాచ్ విస్కీ తీసుకువెళుతుండేవాడినని చెప్పి వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. -
బోరిస్ టాప్ టీంలో ముగ్గురు మనోళ్లే
బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కేబినెట్లో భారత సంతతికి చెందిన ముగ్గురికి కీలక పదవులు దక్కాయి. బ్రిటన్ హోంశాఖ కార్యదర్శిగా ప్రీతి పటేల్ కీలక పదవిని దక్కించుకోగా, టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, రిచ్మాండ్ ఎంపీ రిషి సునాక్(39) ట్రెజరీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. జూనియర్ మంత్రి అలోక్ శర్మ(51) ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖలతో కేబినెట్ మంత్రి హోదాకు పదోన్నతి లభించింది. బోరిస్ నేతృత్వంలోని కొత్త కేబినెట్లో మెరిసిన కొత్త ముఖాల్లో ముగ్గురు భారతీయులు ప్రముఖంగా వుండటం ఒక విశేషం కాగా, టాప్ టీంలో ముగ్గురు మంత్రులు చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. బోరిస్ కేబినెట్లో కీలక స్థానాన్ని దక్కించుకున్న ప్రీతి పటేల్ గుజరాత్‌కు చెందినవారు. 2010లో ఎసెక్స్‌లోని వీథమ్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ నుంచి ప్రీతి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ బృందంలో ఆమె కీలక పాత్ర పోషించారు. హాంప్‌షైర్‌లో జన్మించిన రిషి సునాక్ 2015 నుంచి రిచ్మాండ్ (యార్క్‌షైర్) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత-బ్రిటన్ మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేశారన్న ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. ఆగ్రాలో జన్మించిన శర్మ ...థెరిసా మే ప్రభుత్వంలో ఉపాధి మంత్రిగా ఉన్నారు. 2010 నుండి రీడింగ్ వెస్ట్ నియోజకవర్గంనుంచి ఎంపీగా ఉన్నారు. కన్జర్వేటివ్ నాయకత్వ ఎన్నికల్లో జాన్సన్‌కు మద్దతు ఇచ్చిన వారిలో ఆయన ఒకరు. కాగా మాజీ ప్రధాని థెరిసామే రాజీనామా అనంతరం బోరిస్ జాన్సన్ బుధవారం అధికారికంగా బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పునరుద్ధరిస్తామనీ, ప్రజలకు పార్లమెంటు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని కొత్త ప్రధాని హామీ ఇచ్చారు. అంతేకాదు బ్రెక్సిట్ బ్రిటిష్ ప్రజల ప్రాథమిక నిర్ణయం. అందుకే ఎలాంటి శషభిషలు లేకుండా బ్రెగ్జిట్‌కు కట్టుబడి వున్నామని, అక్టోబర్ 31 న ఈయూ నుంచి బయటకు వస్తామని ప్రకటించారు. -
బ్రిటన్ కేబినెట్ మంత్రి ప్రీతి రాజీనామా
లండన్: బ్రిటన్‌లో భారత సంతతి కేబినెట్ మంత్రి, బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు ప్రీతి పటేల్ (45) పదవికి రాజీనామా చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పాటు పలువురు నేతలతో రహస్యంగా భేటీ కావడంతో పాటు ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలపకపోవడంతో అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్న ప్రీతిపై వేటు పడింది. ఇజ్రాయెల్ నేతలతో భేటీ విషయం వివాదాస్పదంగా మారడంతో ఆఫ్రికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని రావాలని ప్రధాని థెరిసా మే ప్రీతిని ఆదేశించారు. దీంతో బుధవారం ప్రధాని కార్యాలయానికి చేరుకున్న ఆమె థెరిసాకు రాజీనామా సమర్పించారు. రాజీనామా లేఖలో తొలుత క్షమాపణలు తెలిపిన ప్రీతి.. తాను బలంగా ప్రతిపాదించే నిజాయితీ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యానని అంగీకరించారు. ఇజ్రాయెల్ నేతలతో కేవలం ఉత్సుకతతోనే భేటీ అయినట్లు చెప్పారు. సాధారణంగా విదేశీ పర్యటనలు జరిపే బ్రిటిష్ మంత్రులు ఆ వివరాలను తమ విదేశాంగ శాఖకు తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుంది. -
యూకే మంత్రి ప్రీతి పటేల్‌కు ప్రవాసీ భారతీయ సమ్మాన్
లండన్: ఇండియా యూకేల మధ్య సంబంధాల బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తున్న బ్రిటన్ సీనియర్ మంత్రి ప్రీతి పటేల్‌కు ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం అందుకున్నారు. బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న ప్రీతి పటేల్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరిలోనే ప్రకటించారు. విదేశాల్లో అత్యున్నత పదవుల్లో కొనసాగుతూ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే ప్రవాస భారతీయులకు అందజేసే అత్యున్నత పురస్కారం ఇది. అవార్డును అందుకున్న సందర్భంగా ప్రీతి పటేల్ మాట్లాడుతూ... ‘నా జీవితంలో లభించిన అరుదైన గౌరవం ఇది. భారతీయ మూలాలున్నవారు అందుకునే అత్యున్నత పురస్కారానికి నేను ఎంపికైనందుకు గర్వంగా ఉంది. ఇంతటి గొప్ప పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భారత్–యూకేల మధ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగాను ఈ పురస్కారాన్ని ప్రకటించారు. అయితే అవార్డును అందుకోవడం నా బాధ్యతను మరింతగా పెంచింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే బలమైన సంబంధాలున్నాయి. వాటిని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాన’ని చెప్పారు. -
బ్రిటన్ ట్రెజరీ మంత్రిగా ప్రీతి పటేల్
లండన్: బ్రిటన్ ట్రెజరీ మంత్రిగా భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ నియమితులయ్యారు. బుధవారంనాటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ ప్రీతి పటేల్‌ను ట్రెజరీ మంత్రిగా నియమించారు. 42 ఏళ్ల ప్రీతి ప్రస్తుతం విధమ్ నుంచి కన్సర్వేటివ్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆమె భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పెద్ద అభిమాని. 2010లో తొలిసారి పార్లమెంటుకు ఎంపికైన ప్రీతికి ఇదే మొట్టమొదటి ప్రభుత్వ పదవి. లండన్‌లో జన్మించిన ప్రీతి కన్సర్వేటివ్ పార్టీ నుంచి ఎన్నికైన మొదటి ఆసియా మహిళా ఎంపీ. ఆమె తల్లిదండ్రులు నోర్ఫోల్క్లో గ్రామీణ పోస్టాఫీసును నిర్వహిస్తున్నారు. కీలే యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందిన ఆమె పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్నారు. గత నెలలో భారత్‌లో పర్యటించిన బ్రిటన్ అత్యున్నత స్థాయి కమిటీలో ఆమె సభ్యురాలు. ఈ సందర్భంగా ఆమె మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండో-బ్రిటన్ సంబంధాలు మరింత మెరుగుపడాలని ఆమె ఆకాంక్షించారు. ఓ బ్రిటన్ పత్రికకు రాసిన వ్యాసంలో దేశాన్ని సంస్కరణల బాటలో నడపాలని భావిస్తున్న మోడీకి అంతా మంచే జరగాలని, మోడీ తమకు మంచి మిత్రుడని, ఆయనకు అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు.