లండన్: బ్రిటన్‌లో భారత సంతతి కేబినెట్ మంత్రి, బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు ప్రీతి పటేల్ (45) పదవికి రాజీనామా చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పాటు పలువురు నేతలతో రహస్యంగా భేటీ కావడంతో పాటు ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలపకపోవడంతో అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్న ప్రీతిపై వేటు పడింది. ఇజ్రాయెల్ నేతలతో భేటీ విషయం వివాదాస్పదంగా మారడంతో ఆఫ్రికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని రావాలని ప్రధాని థెరిసా మే ప్రీతిని ఆదేశించారు. దీంతో బుధవారం ప్రధాని కార్యాలయానికి చేరుకున్న ఆమె థెరిసాకు రాజీనామా సమర్పించారు. రాజీనామా లేఖలో తొలుత క్షమాపణలు తెలిపిన ప్రీతి.. తాను బలంగా ప్రతిపాదించే నిజాయితీ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యానని అంగీకరించారు. ఇజ్రాయెల్ నేతలతో కేవలం ఉత్సుకతతోనే భేటీ అయినట్లు చెప్పారు. సాధారణంగా విదేశీ పర్యటనలు జరిపే బ్రిటిష్ మంత్రులు ఆ వివరాలను తమ విదేశాంగ శాఖకు తప్పనిసరిగా తెలపాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment