యూకే మంత్రి ప్రీతి పటేల్‌కు ప్రవాసీ భారతీయ సమ్మాన్
లండన్: ఇండియా యూకేల మధ్య సంబంధాల బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తున్న బ్రిటన్ సీనియర్ మంత్రి ప్రీతి పటేల్‌కు ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం అందుకున్నారు. బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న ప్రీతి పటేల్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరిలోనే ప్రకటించారు. విదేశాల్లో అత్యున్నత పదవుల్లో కొనసాగుతూ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే ప్రవాస భారతీయులకు అందజేసే అత్యున్నత పురస్కారం ఇది.
అవార్డును అందుకున్న సందర్భంగా ప్రీతి పటేల్ మాట్లాడుతూ... ‘నా జీవితంలో లభించిన అరుదైన గౌరవం ఇది. భారతీయ మూలాలున్నవారు అందుకునే అత్యున్నత పురస్కారానికి నేను ఎంపికైనందుకు గర్వంగా ఉంది. ఇంతటి గొప్ప పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భారత్–యూకేల మధ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగాను ఈ పురస్కారాన్ని ప్రకటించారు. అయితే అవార్డును అందుకోవడం నా బాధ్యతను మరింతగా పెంచింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే బలమైన సంబంధాలున్నాయి. వాటిని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాన’ని చెప్పారు.