బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో భారత సంతతికి చెందిన ముగ్గురికి కీలక పదవులు దక్కాయి. బ్రిటన్ హోంశాఖ కార్యదర్శిగా ప్రీతి పటేల్ కీలక పదవిని దక్కించుకోగా, టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, రిచ్‌మాండ్ ఎంపీ రిషి సునాక్(39) ట్రెజరీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. జూనియర్ మంత్రి అలోక్ శర్మ(51) ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖలతో కేబినెట్ మంత్రి హోదాకు పదోన్నతి లభించింది. బోరిస్ నేతృత్వంలోని కొత్త కేబినెట్‌లో మెరిసిన కొత్త ముఖాల్లో ముగ్గురు భారతీయులు ప్రముఖంగా వుండటం ఒక విశేషం కాగా, టాప్ టీంలో ముగ్గురు మంత్రులు చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం.
బోరిస్ కేబినెట్‌లో కీలక స్థానాన్ని దక్కించుకున్న ప్రీతి పటేల్ గుజరాత్‌కు చెందినవారు. 2010లో ఎసెక్స్‌లోని వీథమ్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ నుంచి ప్రీతి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ బృందంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
హాంప్‌షైర్‌లో జన్మించిన రిషి సునాక్ 2015 నుంచి రిచ్‌మాండ్ (యార్క్‌షైర్) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత-బ్రిటన్ మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేశారన్న ఖ్యాతిని సొంతం చేసుకున్నారు.
ఆగ్రాలో జన్మించిన శర్మ ...థెరిసా మే ప్రభుత్వంలో ఉపాధి మంత్రిగా ఉన్నారు. 2010 నుండి రీడింగ్ వెస్ట్ నియోజకవర్గంనుంచి ఎంపీగా ఉన్నారు. కన్జర్వేటివ్ నాయకత్వ ఎన్నికల్లో జాన్సన్‌కు మద్దతు ఇచ్చిన వారిలో ఆయన ఒకరు.
కాగా మాజీ ప్రధాని థెరిసామే రాజీనామా అనంతరం బోరిస్ జాన్సన్ బుధవారం అధికారికంగా బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పునరుద్ధరిస్తామనీ, ప్రజలకు పార్లమెంటు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని కొత్త ప్రధాని హామీ ఇచ్చారు. అంతేకాదు బ్రెక్సిట్ బ్రిటిష్ ప్రజల ప్రాథమిక నిర్ణయం. అందుకే ఎలాంటి శషభిషలు లేకుండా బ్రెగ్జిట్‌కు కట్టుబడి వున్నామని, అక్టోబర్ 31 న ఈయూ నుంచి బయటకు వస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment