బ్రిటన్‌ ఎన్నికల్లో భారతీయ పరిమళం | UK general elections 2024: Record number of Indian-origin MPs elected to Parliament | Sakshi
Sakshi News home page

UK Election Result 2024: బ్రిటన్‌ ఎన్నికల్లో భారతీయ పరిమళం

Published Sat, Jul 6 2024 5:38 AM | Last Updated on Sat, Jul 6 2024 7:24 AM

UK general elections 2024: Record number of Indian-origin MPs elected to Parliament

రికార్డు స్థాయిలో 28 మంది బ్రిటిష్‌ ఇండియన్ల గెలుపు

లండన్‌: భారతీయమూలాలున్న వ్యక్తులు బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి విదేశంలోనూ తమ సత్తా చాటారు. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో 28 మంది భారతీయసంతతి నేతలు విజయం సాధించారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఓడినా మాజీ ప్రధాని, భారతీయ మూలాలున్న రిషిసునాక్‌ తన రిచ్‌మండ్‌ నార్త్‌ అలెర్టాన్‌ నియోజకవర్గంలో గెలిచారు. ఈసారి అన్ని పార్టీల తరఫున 107 మంది బ్రిటిష్‌ ఇండియన్లు బరిలో దిగగా 28 మంది గెలిచారు! ఇవి రెండూ రికార్డులే. కేరళ నుంచి పంజాబ్‌దాకా పలు రాష్ట్రాల నుంచి వలసవచ్చిన భారతీయ సంతతి వ్యక్తులు ఎక్కువగా ఎన్నికల్లో పోటీచేశారు. విజేతల్లో ఎక్కువ మంది లేబర్‌ పార్టీ అభ్యర్థులు కావడం విశేషం!

గెలిచిన మహిళా మంత్రులు
కన్జర్వేటివ్‌ పార్టీ నేతలు, మాజీ హోం శాఖ మహిళా మంత్రులు సుయెల్లా బ్రేవర్‌మ్యాన్, ప్రీతిపటేల్‌ గెలిచారు. ఎసెక్స్‌ పరిధిలోని వీథెమ్‌ నియోజకవర్గంలో ప్రీతి, ఫేర్‌హామ్‌ వాటరలూవిల్లే నియోజకవర్గంలో బ్రేవర్‌మ్యాన్‌ విజయం సాధించారు. లీసిస్టర్‌లో పుట్టిపెరిగిన శివానీ రాజా కన్జర్వేటివ్‌ అభ్యర్థినిగా లీసిస్టర్‌ ఈస్ట్‌ స్థానంలో గెలిచారు. పంజాబ్‌ నుంచి వలసవచ్చిన గగన్‌ మోహేంద్ర కన్జర్వేటివ్‌ నేతగా మరోసారి హార్ట్‌ఫోర్డ్‌షైర్‌ నుంచి జయకేతనం ఎగరేశారు. 

ఈయన తాత బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీలో పనిచేశారు. గోవా నుంచి వలసవచ్చిన క్లెయిర్‌ కాటిన్హో కన్జర్వేటివ్‌ నాయకురాలిగా ఈస్ట్‌ సర్రే నుంచి విజయం సాధించారు. 12 ఏళ్ల వయసులో కుటుంబంతో కలిసి బ్రిటన్‌కు వలసవచ్చిన కనిష్క నారాయణ్‌ లేబర్‌ పార్టీ నేతగా బరిలో దిగి వేల్స్‌ స్థానంలో గెలిచారు. ఈయన గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా డేవిడ్‌ కామెరూన్, లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వాల్లో పనిచేశారు. 13 ఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్న లేబర్‌ పార్టీ నాయకురాలు సీమా మల్హోత్రా ఫెల్తామ్‌ హీస్టన్‌ నుంచి గెలిచారు. 

గోవా మూలాలున్న లేబర్‌ నేత వలేరీ వజ్‌ మరోసారి వాల్‌సేల్‌ బ్లాక్స్‌విచ్‌ నుంచి విజయం సాధించారు. పంజాబీ సిక్కు కుటుంబానికి చెందిన నాదియా ఎడిత్‌ విట్టోమే లేబర్‌ పార్టీ తరఫున నాటింగ్‌హామ్‌ ఈస్ట్‌ నుంచి గెలుపొందారు. 2019లో 23 ఏళ్లవయసులోనే ఎంపీగా గెలిచిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్‌ నెలకొల్పారు. సిక్కు నాయకురాలు, లేబర్‌ పార్టీ నేత అయిన ప్రీతి కౌర్‌ గిల్‌ మరోసారి బర్మింగ్‌హామ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ నుంచి గెలిచారు. పార్లమెంట్‌లో తొలి సిక్కు మహిళా ఎంపీగా నాడు చరిత్ర సృష్టించారు. బ్యాగీ శంకర్‌ (డర్బీ సౌత్‌), హర్‌ప్రీత్‌ ఉప్పల్‌ (హడర్స్‌ఫీల్డ్‌), సోనియా కుమార్‌ (డడ్లే) తదితరులూ విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement