
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార బృందంలో మరో భారత సంతతి వ్యక్తికి చోటు లభించింది. అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శిగా ఎస్.పాల్ కపూర్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా సెనేట్ పరిశీలించి ధ్రువీకరిస్తే ప్రస్తుత సహాయ కార్యదర్శి అయిన డొనాల్డ్ లూ స్థానంలో పాల్‌కపూర్ బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత భారత్ సహా దక్షిణాసియా ప్రాంతంలో అమెరికా దౌత్య సంబంధాల్లో కపూర్ కీలక పాత్ర పోషించనున్నారు.
కపూర్ ప్రస్తుతం నేవల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2020 నుంచి 2021 వరకు స్టేట్ డిపార్ట్‌మెంట్ పాలసీ ప్లానింగ్ సిబ్బందిగా పనిచేశారు. దక్షిణ, మధ్య ఆసియా, ఇండో–పసిఫిక్ , అమెరికా–ఇండియా సంబంధాలకు సంబంధించిన సమస్యలపై పనిచేశారు. అంతకుముందు కపూర్ క్లేర్‌మోంట్ మెకెనా కళాశాలలో బోధించారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆయన ‘జిహాద్ యాజ్ గ్రాండ్ స్ట్రాటజీ: ఇస్లామిక్ మిలిటెన్సీ’, ‘నేషనల్ సెక్యూరిటీ అండ్ ది పాకిస్తానీ స్టేట్’, ‘దక్షిణాసియాలో సంఘర్షణ’తదితర పుస్తకాలు రచించారు. ‘ఇండియా, పాకిస్తాన్ అండ్ ది బాంబ్: డిబేటింగ్ న్యూక్లియర్ స్టెబిలిటీ ఇన్ సౌత్ ఏషియా’అనే పుస్తకానికి సహ రచయితగా వ్యవహరించారు. ‘ది ఛాలెంజెస్ ఆఫ్ న్యూక్లియర్ సెక్యూరిటీ: యూఎస్ అండ్ ఇండియన్ పర్సె్పక్టివ్స్’కు సహ సంపాదకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment