British Indians
-
బ్రిటన్ ఎన్నికల్లో భారతీయ పరిమళం
లండన్: భారతీయమూలాలున్న వ్యక్తులు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి విదేశంలోనూ తమ సత్తా చాటారు. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో 28 మంది భారతీయసంతతి నేతలు విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ ఓడినా మాజీ ప్రధాని, భారతీయ మూలాలున్న రిషిసునాక్ తన రిచ్మండ్ నార్త్ అలెర్టాన్ నియోజకవర్గంలో గెలిచారు. ఈసారి అన్ని పార్టీల తరఫున 107 మంది బ్రిటిష్ ఇండియన్లు బరిలో దిగగా 28 మంది గెలిచారు! ఇవి రెండూ రికార్డులే. కేరళ నుంచి పంజాబ్దాకా పలు రాష్ట్రాల నుంచి వలసవచ్చిన భారతీయ సంతతి వ్యక్తులు ఎక్కువగా ఎన్నికల్లో పోటీచేశారు. విజేతల్లో ఎక్కువ మంది లేబర్ పార్టీ అభ్యర్థులు కావడం విశేషం!గెలిచిన మహిళా మంత్రులుకన్జర్వేటివ్ పార్టీ నేతలు, మాజీ హోం శాఖ మహిళా మంత్రులు సుయెల్లా బ్రేవర్‌మ్యాన్, ప్రీతిపటేల్ గెలిచారు. ఎసెక్స్ పరిధిలోని వీథెమ్ నియోజకవర్గంలో ప్రీతి, ఫేర్‌హామ్ వాటరలూవిల్లే నియోజకవర్గంలో బ్రేవర్‌మ్యాన్ విజయం సాధించారు. లీసిస్టర్లో పుట్టిపెరిగిన శివానీ రాజా కన్జర్వేటివ్ అభ్యర్థినిగా లీసిస్టర్ ఈస్ట్ స్థానంలో గెలిచారు. పంజాబ్ నుంచి వలసవచ్చిన గగన్ మోహేంద్ర కన్జర్వేటివ్ నేతగా మరోసారి హార్ట్ఫోర్డ్షైర్ నుంచి జయకేతనం ఎగరేశారు. ఈయన తాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. గోవా నుంచి వలసవచ్చిన క్లెయిర్ కాటిన్హో కన్జర్వేటివ్ నాయకురాలిగా ఈస్ట్ సర్రే నుంచి విజయం సాధించారు. 12 ఏళ్ల వయసులో కుటుంబంతో కలిసి బ్రిటన్‌కు వలసవచ్చిన కనిష్క నారాయణ్ లేబర్ పార్టీ నేతగా బరిలో దిగి వేల్స్ స్థానంలో గెలిచారు. ఈయన గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా డేవిడ్ కామెరూన్, లిజ్ ట్రస్ ప్రభుత్వాల్లో పనిచేశారు. 13 ఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్న లేబర్ పార్టీ నాయకురాలు సీమా మల్హోత్రా ఫెల్తామ్ హీస్టన్ నుంచి గెలిచారు. గోవా మూలాలున్న లేబర్ నేత వలేరీ వజ్ మరోసారి వాల్సేల్ బ్లాక్స్విచ్ నుంచి విజయం సాధించారు. పంజాబీ సిక్కు కుటుంబానికి చెందిన నాదియా ఎడిత్ విట్టోమే లేబర్ పార్టీ తరఫున నాటింగ్‌హామ్ ఈస్ట్ నుంచి గెలుపొందారు. 2019లో 23 ఏళ్లవయసులోనే ఎంపీగా గెలిచిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్ నెలకొల్పారు. సిక్కు నాయకురాలు, లేబర్ పార్టీ నేత అయిన ప్రీతి కౌర్ గిల్ మరోసారి బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ నుంచి గెలిచారు. పార్లమెంట్లో తొలి సిక్కు మహిళా ఎంపీగా నాడు చరిత్ర సృష్టించారు. బ్యాగీ శంకర్ (డర్బీ సౌత్), హర్‌ప్రీత్ ఉప్పల్ (హడర్స్‌ఫీల్డ్), సోనియా కుమార్ (డడ్లే) తదితరులూ విజయం సాధించారు. -
రిషి సునాక్ గెలుపు కోసం.. ప్రవాసుల ప్రయత్నాలు
లండన్: బ్రిటన్ నూతన ప్రధాని ఎంపిక ప్రక్రియ తుది ఘట్టానికి చేరువవుతోంది. రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరు ప్రధానికి అవుతారన్న ఉత్కంఠ నెలకొంది. రిషి సునాక్ ప్రధాని పదవిని అధిష్టించాలని యూకేలోని ప్రవాస భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు ఆయన గెలుపు కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. రిషి సునాక్ వెనకబడ్డారని సర్వేలు వెల్లడించడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రిషి సునాక్ సమర్థుడు కాబట్టే బ్రిటన్‌కు ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నామని ప్రవాస భారతీయులు అంటున్నారు. ‘భారతీయ మూలాలు కలిగివున్నారు కాబట్టే మేము ఆయన కోసం ప్రార్థించడం లేదు. జీవన వ్యయ సంక్షోభం నుంచి మమ్మల్ని బయటపడేసే సమర్థత ఆయనకు ఉందని నమ్ముతున్నాం కాబట్టే రిషి విజయం సాధించాలని కోరుకుంటున్నామ’ని బ్రిటిష్ ఇండియన్ సీకే నాయుడు తెలిపారు. ప్రధాని పదవికి ప్రస్తుతం రిషి సునాక్ ఉత్తమ అభ్యర్థి అని ప్రవాస భారతీయురాలు షీలమ్మ పేర్కొన్నారు. పాలనా వ్యవహారాలతో పాటు ప్రతి విషయంలోనూ రిషి ఎంతో హుందాగా వ్యవహరించారని, ఆయన గెలవాలని తామంతా కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనేది సెప్టెంబర్ 5న తేలుతుంది. (క్లిక్: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట) బ్రిటన్‌లో దాదాపు 15 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూకే మొత్తం జనాభాలో 2.5 శాతంగా ఉన్న ప్రవాసులు జీడీపీలో దాదాపు 6 శాతం వాటా కలిగివున్నారు. గ్రాంట్ థోర్న్టన్ వార్షిక ట్రాకర్ 2022 ప్రకారం గత సంవత్సరంతో పోల్చితే భారతీయ కంపెనీల సంఖ్య 805 నుంచి 900కి పెరిగింది. వీటి ద్వారా వచ్చే రాబడి 50.8 బిలియన్ల ఫౌండ్ల నుంచి 54.4 బిలియన్ ఫౌండ్లకు చేరుకుంది. ఇండియన్ డయాస్పోరా విజయాల్లో రిషి సునాక్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయితే తమకు మరింత మేలు జరుగుతుందని ప్రవాసులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్: రిషి సునాక్‌కు అనూహ్య మద్దతు.. అవాక్కయిన యాంకర్) -
బ్రిటన్ నుంచి విమానాల్లో పెద్ద నోట్లు
లండన్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా పడుతోంది. బ్రిటన్‌లోని భారతీయులంతా తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. వాటిని స్నేహితులు, బంధువులు, మరెవరైనా తెలిసిన వారు లేదా మధ్య వర్తుల ద్వారా తమ వద్ద ఉన్న పాత రూ.500, రూ.1000 నోట్లను విమానాల్లో పంపిస్తున్నారు. ప్రస్తుతం డిపాజిట్ చేసేందుకు, ఆర్బీఐలో మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఉన్న ఈ నోట్లు డిసెంబర్ తర్వాత నేరుగా ఆర్బీఐకి వెళితే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ లోని భారతీయులు తమ వద్ద ఉన్న పాత డబ్బుకు కంగారు పడుతున్నారు. ప్రస్తుతం దీన్ని విదేశాల్లో మార్పిడి చేసుకునే అవకాశం కూడా లేదు. బ్రిటన్‌లో 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతీయులు 2.5శాతం మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు నోట్ల మార్పిడి కోసం ఎంత కంగారు పడుతున్నారో గుజరాత్‌కు చెందిన నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ గుజరాతీ ఆర్గనైజేషన్ యూకే(ఎన్సీజీవో) అధ్యక్షుడు సీజే రాభేరు తెలిపారు. రోజుకు కొన్ని వందల్లో ఫోన్లు వస్తున్నాయని, ఏం జరుగుతుందో తనకేం అర్థం కావడం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియక కంగారు పడుతున్నవారే ఎక్కువగా ఉన్నారని, రూమర్లను నమ్ముతున్నారని అన్నారు. దాదాపు 10లక్షల మంది బ్రిటన్ భారతీయులపై పెద్ద నోట్ల ప్రభావం పడిందని తెలిపారు. -
బీబీసీలో మోడీకిచ్చే కవరేజి ఇదేనా?
భారత ప్రధాని నరేంద్రమోడీని బీబీసీ అస్సలు పట్టించుకోలేదా? ఆయన భారీ మెజారిటీ సాధించిన రోజున.. అంటే ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు దాదాపు ప్రపంచమంతా మోడీవైపే చూస్తున్నా, బీబీసీ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించిందా? సరిగ్గా ఇదే అంశంపై బ్రిటన్‌లో భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ ఘాటుగా విరుచుకుపడ్డారు. తీవ్ర స్థాయిలో తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ బీబీసీ డైరెక్టర్ జనరల్ లార్డ్ టోనీ హాల్‌కు ఆమె లేఖ రాశారు. మే 16వ తేదీన భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బీబీసీ సరిగ్గా ఇవ్వలేదని బ్రిటన్‌లో భారత జాతీయులు, ముఖ్యంగా గుజరాతీలు చాలామంది తనకు ఫిర్యాదు చేశారని ఆమె అన్నారు. అంతేకాదు.. ఈ ఫలితాలను టీవీలో ప్రజెంట్ చేసిన యాల్దా హకీమ్ అయితే.. మోడీని వివాదాస్పద వ్యక్తిగా అభివర్ణించారని కూడా ఆమె మండిపడ్డారు. కేవలం ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే మోడీని అలా అంటారని, ఈ మాట ఉపయోగించడం ద్వారా బీబీసీ నిష్పాక్షికతను వదిలేసి ఆయన రాజకీయ ప్రత్యర్థి పాత్రలోకి మారిపోయినట్లయిందని ప్రీతి పటేల్ అన్నారు.