బ్రిటన్ నుంచి విమానాల్లో పెద్ద నోట్లు
లండన్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా పడుతోంది. బ్రిటన్‌లోని భారతీయులంతా తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. వాటిని స్నేహితులు, బంధువులు, మరెవరైనా తెలిసిన వారు లేదా మధ్య వర్తుల ద్వారా తమ వద్ద ఉన్న పాత రూ.500, రూ.1000 నోట్లను విమానాల్లో పంపిస్తున్నారు. ప్రస్తుతం డిపాజిట్ చేసేందుకు, ఆర్బీఐలో మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఉన్న ఈ నోట్లు డిసెంబర్ తర్వాత నేరుగా ఆర్బీఐకి వెళితే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ లోని భారతీయులు తమ వద్ద ఉన్న పాత డబ్బుకు కంగారు పడుతున్నారు.
ప్రస్తుతం దీన్ని విదేశాల్లో మార్పిడి చేసుకునే అవకాశం కూడా లేదు. బ్రిటన్‌లో 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతీయులు 2.5శాతం మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు నోట్ల మార్పిడి కోసం ఎంత కంగారు పడుతున్నారో గుజరాత్‌కు చెందిన నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ గుజరాతీ ఆర్గనైజేషన్ యూకే(ఎన్సీజీవో) అధ్యక్షుడు సీజే రాభేరు తెలిపారు. రోజుకు కొన్ని వందల్లో ఫోన్లు వస్తున్నాయని, ఏం జరుగుతుందో తనకేం అర్థం కావడం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియక కంగారు పడుతున్నవారే ఎక్కువగా ఉన్నారని, రూమర్లను నమ్ముతున్నారని అన్నారు. దాదాపు 10లక్షల మంది బ్రిటన్ భారతీయులపై పెద్ద నోట్ల ప్రభావం పడిందని తెలిపారు.