రూ. 1.51 కోట్ల పాత నోట్లు స్వాధీనం
ఛేజ్ చేసి మరీ రూ. 1.51 కోట్లు స్వాధీనం
Published Fri, Mar 31 2017 5:04 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
రద్దయిన నోట్ల డిపాజిట్లకు సామాన్యులకు గడువు ముగిసినా... కోట్లకు కోట్లు పెద్ద నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ట్యాక్సీ క్యాబ్ లో తీసుకెళ్తున్న 1.51 కోట్ల రూపాయల పాత నోట్లను ఛేజ్ చేసి మరీ ముంబాయి పోలీసులు పట్టుకున్నారు. నగదును సీజ్ చేసిన పోలీసులు, నలుగురు నిందితులను ఘాట్కొపార్ లో అరెస్టు చేశారు.
ఈ పాత నోట్లను కొత్త కరెన్సీలోకి మార్చుకోవడానికి ట్యాక్సీలో తరలిస్తున్న క్రమంలో అవి పోలీసులు కంటపడ్డాయి. 10 నిమిషాల పాటు ఆ ట్యాక్సీని ఛేజ్ చేసిన పోలీసులు ఎట్టకేలకు ఘాట్కొపార్ లోని ఎల్బీసీ మార్గ్ రోడ్డులో వాటిని పట్టుకున్నారు. క్యాబ్ కు వెనుక సీట్లలో రెండు బ్యాగుల్లో ఈ కోటిన్నరకు పైగా పాత నోట్లను ఉంచినట్టు పోలీసులు చెప్పారు.
ఈ నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో, వెంటనే క్యాబ్ డ్రైవర్ రిజ్వాన్ గులామ్ ఖాజీ పాటు కారులో ఉన్న మరో ముగ్గురు అయాజ్ అక్తర్, దానిష్ రఫీ, రెహాన్ సైఖ్ లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే అరెస్ట్ అయిన వారు కేవలం మధ్యవర్తులనేని, అసలైన నిందితులను ఎలాగైనా పట్టుకుంటామని డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీసు సచిన్ పాటిల్ హెచ్చరించారు.
ఈ నిందితులందరూ దక్షిణ ముంబాయికి చెందినవారేనని పేర్కొన్నారు. గొరై ప్రాంతంలోని ఓ వ్యక్తికి వీటిని డెలివరీ చేయడానికి తీసుకెళ్తున్నట్టు తెలిసిందన్నారు. దీనిలో ఎవరైనా ఎన్ఆర్ఐల ప్రమేయముందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు తెలిపారు. కాగ, విదేశాల్లో ఉన్న భారతీయులకు రద్దయిన నోట్లను మార్చుకోవడానికి తుది గడువు రేపటితో ముగియనుంది.
Advertisement
Advertisement