పాత నోట్ల డిపాజిట్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
పాత నోట్ల డిపాజిట్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Published Tue, Jul 4 2017 12:00 PM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM
రద్దయిన పెద్ద నోట్లను ఇప్పటివరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోని వారికి సుప్రీంకోర్టు పెద్ద ఊరట కల్పించింది. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వు బ్యాంకును సుప్రీంకోర్టు ఆదేశించింది. సహేతుక కారణాలు చూపించే వారికి ఈ వెసులుబాటు కల్పించాలని సుప్రీం తన ఆదేశాల్లో సూచించింది. తగ్గిన కారణాలు చూపించే ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. నిజాయితీపరులు నష్టపోకుండా చూడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. డీమానిటైజేషన్‌పై దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక సూచనలిచ్చింది.. అంతేకాక రద్దయిన నోట్లను డిపాజిట్ చేయని వారికోసం ప్రత్యేక కౌంటర్లు ఏమైనా ఏర్పాటుచేశారా అని కూడా ప్రభుత్వాన్ని, ఆర్బీఐను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే దీనిపై పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో అందిస్తామని కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్‌కు చెప్పింది. దీంతో తర్వాత విచారణను సుప్రీం జూలై 18న చేపట్టనున్నట్టు పేర్కొంది.
నవంబర్ 8న అర్థరాత్రి పెద్ద నోట్లను హఠాత్తుగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రప్రభుత్వం, ఈ నోట్ల డిపాజిట్లకు గడువులు కూడా విధించింది. అయితే ప్రభుత్వం కల్పించిన ఈ గడువులు చాలా తక్కువగా ఉన్నాయని, తక్కువ వ్యవధిలోనే దేశంలో కల్లా అత్యధిక మొత్తం కరెన్సీని డిపాజిట్ చేయడం కుదరలేదని వాదనలు వినిపించాయి. చాలామంది ఇంకా పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా తమ వద్దే ఉంచుకున్నారని కూడా తెలిసింది. మరోవైపు పెద్ద నోట్లను కలిగి ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నేడు జారీచేసిన ఆదేశాలు ప్రజలకు ఊరటగా మారనున్నాయి.
Advertisement