అన్నీ పాతనోట్లు.. రూ.4.4 కోట్లు!
♦ ఎన్‌ఆర్‌ఐ కోటాలో మార్పిడికి ఓ ముఠా కుట్ర
♦ రూ.4.4 కోట్లు కూడగట్టిన ఎనిమిది మంది
♦ అరెస్టు చేసిన వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు మార్చుకునేందుకు సాధారణ గడువు ముగిసినా కొందరు నల్లబాబుల్లో ‘మార్పిడి’ఆశలు చావలేదు. ప్రవాస భారతీయుల(ఎన్‌ఆర్‌ఐ) కోటాలో భారీ మొత్తంలో పాత నోట్ల మార్పిడికి ఎనిమిది మంది సభ్యుల ముఠా కుట్ర పన్నింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి, రూ.500, రూ.1,000 డినామినేషన్‌లో ఉన్న రూ.4.4 కోట్ల పాత నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు.
అప్పటికే ఐటీ నోటీసులు రావడంతో..
సీతాఫల్‌మండిలోని రవీందర్‌నగర్‌లో నివసించే పి.కళ్యాణ్ ప్రసాద్ రియల్టర్. ఇతని వద్ద నల్లధనం భారీగా ఉంది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత రూ.60 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు అందుకున్నాడు. దీంతో తన వద్ద మిగిలిన రూ.1.2 కోట్లను బ్యాంకులో జమ చేయలేదు. సాధారణ మార్పిడి గడువు ముగియడంతో వాటిని మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. దీనిపై బిల్డర్, చార్డెడ్ అకౌంటెంట్ అయిన స్నేహితులు కె.హరినాథ్‌బాబు, వి.రాజేంద్రనాథ్‌ను సంప్రదించాడు.
తక్కువ మొత్తం మార్చరనేసరికి..
వీరికి సమీప బంధువైన రాజు తనకు ఆర్‌బీఐలో పరిచయాలున్నాయని, ఎంత మొత్తమైనా మారుస్తానని నమ్మబలికాడు. ఎన్‌ఆర్‌ఐలకు పాత నోట్ల మార్పిడీకి జూన్ 30 వరకు గడువు ఉందని, మార్పిడి చేయిస్తానని నమ్మించాడు. చిన్న మొత్తాల మార్పిడి సాధ్యం కాదని, రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తనకు పరిచయం ఉన్న ఆర్‌బీఐ అధికారులు 65 శాతం కమీషన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేస్తారని చెప్పాడు.
పరిచయస్తులు, స్నేహితులతో కలసి..
కళ్యాణ్‌ప్రసాద్ వద్ద రూ.1.2 కోట్లే ఉండటంతో పరిచయస్తులు, స్నేహితులను సంప్రదించాడు. పాత నోట్లుంటే మార్చేసుకుందామని చెప్పాడు. దీంతో మరో ఐదుగురు ముందుకు వచ్చారు. పంజగుట్టవా సి మహ్మద్ ఫారూఖ్(సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారి) రూ.39.9 లక్షలు, ఆసిఫ్‌నగర్‌వాసి మీర్జా ముజఫర్ (బియ్యం వ్యాపారి) రూ.52.38 లక్షలు, బంజారాహిల్స్‌కు చెందిన గౌతమ్ అగర్వాల్(ముత్యాల వ్యాపారి) రూ.1.46 కోట్లు, చింతల్‌కు చెందిన వై.సూర్యప్రసాద్(విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి) రూ.50 వేలు, ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ ముస్తాఫా సిద్ధిఖీ(విద్యార్థి) రూ.5 లక్షలు తీసుకువచ్చారు. హరినాథ్ రూ.50 లక్షలు, రాజేంద్రనాథ్ రూ.42.23 లక్షలు సమీకరించారు. గౌతమ్, ఫారూఖ్ తమ స్నేహితులైన రిషబ్, అష్మీ, హసన్ వద్ద ఉన్న నోట్లూ తీసుకొచ్చారు.
రాజు కోసం ఎదురుచూస్తుండగా..
ఈ ఎనిమిది మంది మొత్తం రూ.4.41 కోట్ల విలువైన పాత నోట్లతో శ్రీనగర్‌కాలనీలోని గౌతమ్ ఇంటికి చేరుకుని రాజు కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి తమ బృందాలతో దాడి చేసి ఎనిమిది మందినీ అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న రాజు కోసం గాలిస్తున్నారు. అతడు చిక్కిన తర్వాత విచారణలో ఆర్‌బీఐ అధికారుల పాత్ర వెలుగులోకి వస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ లింబారెడ్డి వెల్లడించారు.