UK General Election
-
British Parliament Election 2024: ఆ డ్రెస్సేంటి?
లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీ నేత రిషి సునాక్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లండన్‌లోని తన అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ గుమ్మం ఎదుట మీడియాతో మాట్లాడారు. ప్రధానిగా చివరి మాటలు చెప్పేసి వెళ్లిపోయారు. ఆయన భార్య అక్షతా మూర్తి వ్యవహారమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమెను విమర్శిస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. జోకులు సైతం విసురుతున్నారు. ఆమె ధరించిన డ్రెస్సు ధరపై కూడా చర్చ జరుగుతోంది. రిషి సునాక్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్షతా మూర్తి ఆయన వెనుకే గొడుగు పట్టుకొని నిల్చున్నారు. నీలం, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన నిలువు, అడ్డం చారల డ్రెస్సును ధరించారు. ఈ డ్రెస్సు చాలామందికి నచ్చలేదు. ఆ సందర్భానికి అలాంటి వ్రస్తాలు నప్పలేదని అంటున్నారు. చూడడానికి ఎబ్బెట్టుగా ఉందని చెబుతున్నారు. డెస్సుపై క్యూఆర్ కోడ్ మాదిరిగా ఆ చారలేంటి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అక్షతా మూర్తి డెస్సు ఖరీదు 395 పౌండ్లు(రూ.42,000). రిషి సునాక్ వెనుక ఆమె అలా గొడుగు పట్టుకొని నిల్చోవడం అస్సలు బాగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అక్షతా మూర్తి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, భారత రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి దంపతుల కుమార్తె అనే సంగతి తెలిసిందే. -
UK Election Results 2024: భారత్‌పై ప్రభావం ఎంత?
న్యూఢిల్లీ/లండన్: బ్రిటన్‌లో రిషి సునాక్ సారథ్యంలోని కన్జర్వేటివ్‌లు ఓటమి చవిచూసి లేబర్ పార్టీ గద్దెనెక్కడంతో ఈ అధికార మారి్పడి ప్రభావం భారత్‌పై ఎలా ఉండనుందన్న చర్చ జోరందుకుంది. దానికి భారత వ్యతిరేక, పాక్ అనుకూల పారీ్టగా పేరుండటమే ఇందుకు కారణం. 1997లో బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 భారత పర్యటనకు వచ్చారు. పాలక లేబర్ పార్టీ సలహా మేరకు ముందుగా పాకిస్తాన్లో ఆగడమే గాక, ‘ఇరు దేశాలూ కశీ్మర్‌పై విభేదాలను పరిష్కరించుకో’వాలని పాక్ గడ్డ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ బ్రిటన్ విదేశాంగ మంత్రి రాబిన్ కుక్ నోటి దురుసు ప్రదర్శించడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. దీనిపై భారత్ భగ్గుమనడమే గాక, బ్రిటన్ను థర్డ్ రేట్ దేశంగా నాటి ప్రధాని ఐకే గుజ్రాల్ ఛీత్కరించుకునేదాకా వెళ్లింది. ఉద్రిక్తతల నడుమ రాణి భారత పర్యటన మొక్కుబడిగా ముగిసింది. 2019లో లేబర్ పార్టీ నేత జెరెమీ కోర్బిన్ కశీ్మర్ సమస్యకు ఐరాస ఆధ్వర్యంలో రిఫరెండం నిర్వహించాలంటూ బ్రిటన్ పార్లమెంట్లో తీర్మానమే ప్రవేశపెట్టారు! దాంతో బ్రిటన్‌లో ప్రబల శక్తిగా ఉన్న భారతీయులు ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో లేబర్ పారీ్టకి వ్యతిరేకంగా ఓటేశారు. పార్టీ ఘోర ఓటమికి ఇది కూడా ముఖ్య కారణంగా నిలిచింది. పైగా ఆ పార్టీ నేతల్లో ఖలిస్తానీ సానుభూతిపరుల సంఖ్య ఎక్కువ. సారథిగా స్టార్మర్ రాకతో చాలా సానుకూల మార్పు వచి్చందంటున్నారు. ఎన్నికల్లో బ్రిటిష్ ఇండియన్ల మద్దతు కోసం ఆయన పలు చర్యలు చేపట్టారు. స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. పారీ్టలోని ఖలిస్తానీ అనుకూల నేతల ప్రాధాన్యాన్ని బాగా తగ్గించారు. ‘‘భారత్‌తో సన్నిహిత సంబంధాలే మా ప్రాథమ్యం. హిందూఫోబియాకు బ్రిటన్‌లో ఏ మాత్రమూ స్థానం లేదు. వాణిజ్యంలోనే గాక పర్యావరణ, భద్రత వంటి పలు రంగాల్లో భారత్‌తో మరింత సన్నిహితంగా కలిసి పని చేస్తాం’’ అని ప్రధానిగా తొలి ప్రసంగంలో స్టార్మర్ ప్రకటించారు. -
బ్రిటన్ ఎన్నికల్లో భారతీయ పరిమళం
లండన్: భారతీయమూలాలున్న వ్యక్తులు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి విదేశంలోనూ తమ సత్తా చాటారు. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో 28 మంది భారతీయసంతతి నేతలు విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ ఓడినా మాజీ ప్రధాని, భారతీయ మూలాలున్న రిషిసునాక్ తన రిచ్మండ్ నార్త్ అలెర్టాన్ నియోజకవర్గంలో గెలిచారు. ఈసారి అన్ని పార్టీల తరఫున 107 మంది బ్రిటిష్ ఇండియన్లు బరిలో దిగగా 28 మంది గెలిచారు! ఇవి రెండూ రికార్డులే. కేరళ నుంచి పంజాబ్దాకా పలు రాష్ట్రాల నుంచి వలసవచ్చిన భారతీయ సంతతి వ్యక్తులు ఎక్కువగా ఎన్నికల్లో పోటీచేశారు. విజేతల్లో ఎక్కువ మంది లేబర్ పార్టీ అభ్యర్థులు కావడం విశేషం!గెలిచిన మహిళా మంత్రులుకన్జర్వేటివ్ పార్టీ నేతలు, మాజీ హోం శాఖ మహిళా మంత్రులు సుయెల్లా బ్రేవర్‌మ్యాన్, ప్రీతిపటేల్ గెలిచారు. ఎసెక్స్ పరిధిలోని వీథెమ్ నియోజకవర్గంలో ప్రీతి, ఫేర్‌హామ్ వాటరలూవిల్లే నియోజకవర్గంలో బ్రేవర్‌మ్యాన్ విజయం సాధించారు. లీసిస్టర్లో పుట్టిపెరిగిన శివానీ రాజా కన్జర్వేటివ్ అభ్యర్థినిగా లీసిస్టర్ ఈస్ట్ స్థానంలో గెలిచారు. పంజాబ్ నుంచి వలసవచ్చిన గగన్ మోహేంద్ర కన్జర్వేటివ్ నేతగా మరోసారి హార్ట్ఫోర్డ్షైర్ నుంచి జయకేతనం ఎగరేశారు. ఈయన తాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. గోవా నుంచి వలసవచ్చిన క్లెయిర్ కాటిన్హో కన్జర్వేటివ్ నాయకురాలిగా ఈస్ట్ సర్రే నుంచి విజయం సాధించారు. 12 ఏళ్ల వయసులో కుటుంబంతో కలిసి బ్రిటన్‌కు వలసవచ్చిన కనిష్క నారాయణ్ లేబర్ పార్టీ నేతగా బరిలో దిగి వేల్స్ స్థానంలో గెలిచారు. ఈయన గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా డేవిడ్ కామెరూన్, లిజ్ ట్రస్ ప్రభుత్వాల్లో పనిచేశారు. 13 ఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్న లేబర్ పార్టీ నాయకురాలు సీమా మల్హోత్రా ఫెల్తామ్ హీస్టన్ నుంచి గెలిచారు. గోవా మూలాలున్న లేబర్ నేత వలేరీ వజ్ మరోసారి వాల్సేల్ బ్లాక్స్విచ్ నుంచి విజయం సాధించారు. పంజాబీ సిక్కు కుటుంబానికి చెందిన నాదియా ఎడిత్ విట్టోమే లేబర్ పార్టీ తరఫున నాటింగ్‌హామ్ ఈస్ట్ నుంచి గెలుపొందారు. 2019లో 23 ఏళ్లవయసులోనే ఎంపీగా గెలిచిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్ నెలకొల్పారు. సిక్కు నాయకురాలు, లేబర్ పార్టీ నేత అయిన ప్రీతి కౌర్ గిల్ మరోసారి బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ నుంచి గెలిచారు. పార్లమెంట్లో తొలి సిక్కు మహిళా ఎంపీగా నాడు చరిత్ర సృష్టించారు. బ్యాగీ శంకర్ (డర్బీ సౌత్), హర్‌ప్రీత్ ఉప్పల్ (హడర్స్‌ఫీల్డ్), సోనియా కుమార్ (డడ్లే) తదితరులూ విజయం సాధించారు. -
తుపానులా వచ్చాడు... స్టార్మర్ ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం
నిరుపేద కుటుంబం. తండ్రి పనిముట్ల తయారీ కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానంలో రెండోవాడు. కుటుంబాన్ని నిరంతరం అప్పుల బాధ వెంటాడేది. దాంతో ఫోన్ బిల్లును తప్పించుకునేందుకు దాన్ని నెలల తరబడి వాడకుండా పక్కన పెట్టే పరిస్థితి! ‘‘కార్మికునిగా ఫ్యాక్టరీలో తన తండ్రి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దాంతో విపరీతమైన ఆత్మన్యూనతకు లోనై జనానికి దూరంగా మెలగడం అలవాటు చేసుకున్నారు’’ అంటూ ఆవేదనగా గుర్తు చేసుకుంటారు స్టార్మర్. అందుకే స్థాయిలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం తనకు చిన్నప్పటి నుంచే అలవాటైందని చెబుతారు. లేబర్ పార్టీ తొలి నాయకుడైన కియర్ హార్డీ అంటే తల్లిదండ్రులకు ఎంతో అభిమానం. ఆ పేరునే స్టార్మర్‌కు పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడదే పార్టీకి ఘనవిజయం సాధించి పెట్టడమే గాక ప్రధాని పీఠమెక్కడం విశేషం. విపక్షంలో ఉండగా లేబర్ పార్టీ పగ్గాలు చేపట్టి గెలుపు బాటన నడిపిన ఐదో నేతగా కూడా నిలిచారు... తమ కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే. అప్పుడు కూడా డబ్బుల కటకట బాగా వేధించేది. దాంతో డబ్బుల కోసం స్టార్మర్ ఓసారి బీచ్‌లో మిత్రులతో కలిసి చట్ట విరుద్ధంగా ఐస్‌క్రీం అమ్ముతూ పట్టుబడ్డారు! లీడ్స్‌లో న్యాయశాస్త్రం చదివాక ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. 1987లో బారిస్టర్ పూర్తి చేశారు. మానవ హక్కుల చట్టంలో స్పెషలైజేషన్ చేశారు. కరీబియన్, ఆఫ్రికాల్లో ఉద్యోగం చేశారు. పని రాక్షసునిగా పేరుపడ్డారు. 2008లో ఇంగ్లండ్, వేల్స్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. రాజకీయ ప్రవేశం... స్కూలు దశ నుంచే స్టార్మర్ రాజకీయాల పట్ల మొగ్గు చూపేవారు. తొలుత వామపక్ష రాజకీయ పట్ల ఆకర్షితులయ్యారు. 2015లో 52వ ఏట పూర్తిస్థాయిలో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉత్తర లండన్‌లోని హాల్‌బోర్న్ అండ్ సెయింట్ పాంక్రాస్ నియోజకవర్గం నుంచి 2015లో ఎంపీగా గెలుపొందారు. తాజా మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా సరిగ్గా అదే రోజున తొలిసారిగా ఎంపీగా ఎన్నికవడం విశేషం! నాటి లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్‌కు నమ్మకస్తునిగా పేరుబడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయంతో కార్బిన్ తప్పుకున్నారు. దాంతో 2020 ఏప్రిల్‌లో స్టార్మర్ లేబర్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విలువల విషయంలో రాజీ పడేందుకు ససేమిరా అంటారాయన. తమ కంచుకోటైన హారి్టల్పూల్ స్థానంలో మూడేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికలో లేబర్ పార్టీ తొలిసారి ఓటమి చవిచూసింది. ఆ పరాభవానికి బాధ్యత వహిస్తూ పార్టీ సారథ్యం నుంచి తప్పుకోవడానికి స్టార్మర్ సిద్ధపడ్డారు. సీనియర్ నాయకుల విజ్ఞప్తి మేరకు కొనసాగారు. 2019 ఓటమితో చతికిలపడి ఉన్న పార్టీలో జవజీవాలు నింపడమే గాక ఐదేళ్లకే ఘనవిజయం సాధించి పెట్టారు. ఇది తేలిగ్గా ఏమీ జరగలేదు. పార్టీకి పునర్వైభవం... లేబర్ పార్టీకి పునరై్వభవం తేవడానికి స్టార్మర్ చాలా కష్టపడ్డారు. హారి్టల్పూల్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు. వర్సిటీల ట్యూషన్ ఫీజుల రద్దు, ఇంధన, నీటి కంపెనీల జాతీయీకరణ వంటి గత వాగ్దానాల నుంచి వెనక్కు తగ్గారు. ఇది నమ్మకద్రోహమని, పార్టీ వాగ్దానాలను తుంగలో తొక్కారని సీనియర్లే ఆరోపించినా వెనక్కు తగ్గలేదు. కొన్నేళ్లుగా బ్రిటన్‌లో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. ధరలు విపరీతంగా పెరిగి, ప్రజల ఆదాయం తగ్గి జీవన ప్రమాణాలు పడిపోయాయి. వీటితో పాటు ప్రధాన సమస్యయిన ఆరోగ్య రంగంపైనా స్టార్మర్ దృష్టి సారించారు. బ్రిటన్‌లో వైద్య సేవలుందించే ప్రభుత్వ విభాగం ఎన్హెచ్ఎస్లో వెయిటింగ్ జాబితాను తగ్గిస్తామని, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేస్తామని, పన్ను చెల్లింపుల్లో లొసుగులను నిర్మూలించి ఎన్హెచ్ఎస్కు నిధులు సమకూర్చుతామని హామీలిచ్చారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రత కమాండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా సొంతిల్లు లేనివారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టాలను సంస్కరించి 15 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రైవేట్ స్కూళ్లకు పన్ను మినహాయింపులు ఎత్తేసి ఆ సొమ్ముతో 6,500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇవన్నీ జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేణుగానంలో నిపుణుడు స్టార్మర్‌కు సంగీతంలో లోతైన ప్రవేశముంది. చాలాకాలం పాటు శాస్త్రీయ శిక్షణ తీసుకున్నారు. ఫ్లూట్, పియానో, వయోలిన్ అద్భుతంగా వాయిస్తారు. కాలేజీ రోజుల్లో ఆయన వేణుగానాన్ని అలా వింటూ ఉండిపోయేవాళ్లమని నాటి మిత్రులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. కాలేజీ రోజుల్లో స్టార్మర్ ఎంతో చురుకైన ఫుట్‌బాల్ ఆటగాడు కూడా. 2007లో విక్టోరియా అలెగ్జాండర్‌ను పెళ్లాడారు. ఆమె నేషనల్ హెల్త్ సరీ్వస్ (ఎన్హెచ్ఎస్)లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్. వారికి ఒక కొడుకు, కూతురున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
UK Election Result 2024: ఇక స్టార్మర్ శకం
లండన్: అంతా ఊహించిందే జరిగింది. గురువారం జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు గాను ఏకంగా 412 సీట్లు కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఏకంగా 252 స్థానాలు కోల్పోయింది! ఇది ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయం. లేబర్ పార్టీకి 33.7 శాతం రాగా కన్జర్వేటివ్‌లకు 23.7 శాతమే లభించాయి. శుక్రవారం మధ్యాహా్ననికల్లా ఫలితాలు వెలువడటం, సునాక్ రాజీనామా చేయడం, లేబర్ పార్టీని విజయపథంలో నడిపిన కియర్ స్టార్మర్ దేశ 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. దాంతో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెర పడింది. భారత మూలాలున్న తొలి ప్రధాని సునాక్ పాలన కూడా 20 నెలలకే ముగిసింది. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ స్థానం నుంచి ఆయన ఘనవిజయం సాధించినా మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు గ్రాంట్ షేప్స్, పెన్నీ మోర్డంట్, జాకబ్ రీస్ మాగ్ వంటి పలువురు కన్జర్వేటివ్ హేమాహేమీలు ఓటమి చవిచూశారు. దాంతో ఫలితాల అనంతరం మాట్లాడుతూ 44 ఏళ్ల సునాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘లేబర్ పార్టీకి, స్టార్మర్‌కు అభినందనలు. ఘోర ఓటమి చవిచూసిన నా కేబినెట్ సహచరులకు సానుభూతి. నాయకునిగా వారిని గెలిపించుకోలేకపోయినందుకు క్షమాపణలు. ప్రజల అంచనాలు అందుకోలేకపోయినందుకు వారికి కూడా క్షమాపణలు’’ అన్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సునాక్ ప్రకటించారు. అయితే ప్రధానిగా తన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేశానన్నారు. ప్రధానిగా కుటుంబంతో కలిసి అధికార నివాసంలో జరుపుకున్న దీపావళి వేడుకలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘మా తాతల కాలంలో చేతిలో పెద్దగా ఏమీ లేకుండా ఇంగ్లండ్ వచి్చన కుటుంబం మాది. అలాంటిది రెండే తరాల్లో నేను ప్రధాని కాగలిగాను. నా పిల్లలు డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై దీపావళి ప్రమిదలు వెలిగించగలిగారు. అదీ దేశ గొప్పదనం’’ అంటూ కొనియాడారు. ‘‘నా వారసునిగా అత్యంత సవాళ్లమయమైన బాధ్యతను స్వీకరిస్తున్న నూతన ప్రధానికి 10, డౌనింగ్ స్ట్రీట్‌కు హార్దిక స్వాగతం. నూతన బాధ్యతల్లో ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ఆయన విజయమే మనందరి విజయం. ప్రచారంలో విమర్శలు గుప్పించుకున్నా స్టార్మర్ చాలా మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగానో అభిమానిస్తాను’’ అన్నారు. అనంతరం రాజు చార్లెస్–3కు సునాక్ రాజీనామా సమర్పించారు. తర్వాత భార్య అక్షత, పిల్లలతో కలిసి అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.దేశాన్ని పునర్నిర్మిస్తాం : స్టార్మర్ ప్రజలు మార్పు కోసం నిర్ణాయక రీతిలో ఓటేశారని 61 ఏళ్ల స్టార్మర్ అన్నారు. శుక్రవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన తొలి ప్రసంగం చేశారు. ‘‘ప్రజల త్యాగాలకు, ప్రతిగా వారికందుతున్న సేవలకు మధ్య అంతరం ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తు పట్ల వారిలో మిగిలేది నిరాశా నిస్పృహలే. ముందు వారిలో విశ్వాసాన్ని పాదుగొల్పాలి. ఇది మాటలతో కాదు. చేతల్లోనే చూపాలి. మనముందు భారీ లక్ష్యాలున్నాయి. కనుక నేటినుంచే పని మొదలవుతుంది’’ అన్నారు. ‘‘సేవే ఏకైక లక్ష్యంగా లేబర్ పార్టీని పునర్ వ్యవస్థీకరించాం. దేశమే ముందు, ఆ తర్వాతే పార్టీ అంటూ సమూలంగా మెరుగుపరిచి ప్రజల ముందుంచాం. అలాగే దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసి చూపిస్తాం. ‘సేవల ప్రభుత్వం’గా పని చేస్తాం. లేబర్ పార్టీకి ఓటేయని వారికి కూడా అంతే చిత్తశుద్ధితో సేవ చేస్తాం. ప్రజలందరి నమ్మకాన్నీ నిలబెట్టుకుంటాం. బ్రిటన్ను పూర్తిస్థాయిలో పునర్నరి్మస్తాం’’ అని ప్రకటించారు. సునాక్‌పై ప్రశంసల జల్లు ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారంటూ స్టార్మర్ ప్రశంసలు కురిపించడం విశేషం! 20 నెలల పాలనలో దేశ ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధితో ఎంతగానో కృషి చేశారంటూ కొనియాడారు. ‘‘ఆసియా మూలాలున్న తొలి బ్రిటిష్ ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారు. ఆ ఘనతలను ఏ మాత్రం తక్కువ చేసి చూడలేం. ప్రధానిగా ఆయన పనితీరుకు జోహార్లు’’ అన్నారు. ఫలితాలు వెలువడగానే స్టార్మర్ బకింగ్‌హాం రాజ ప్రాసాదానికి వెళ్లి రాజు చార్లెస్–3తో భేటీ అయ్యారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా స్టార్మర్ను రాజు లాంఛనంగా ఆహ్వానించారు. కేబినెట్లోకి లీసా నందిస్టార్మర్ మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న 44 ఏళ్ల లీసా నందికి చోటు దక్కింది. ఆమెను సాంస్కృతిక, క్రీడా, సమాచార ప్రసార మంత్రిగా నియమించారు. విగాన్ నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లీసా తండ్రి దీపక్ విద్యావేత్త. 1950ల్లో బ్రిటన్ వెళ్లారు. అక్కడి అమ్మాయిని పెళ్లాడారు. జాతుల సయోధ్యకు బ్రిటన్‌లో గుర్తింపు పొందారు. లీసా 2020లో లేబర్ పార్టీ నాయకత్వం కోసం స్టార్మర్తో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. -
యూకే ఎన్నికలు: సతీసమేతంగా ఓటేసిన సునాక్
బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7గం. పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం క్యూ కట్టారు. మరోవైపు భార్య అక్షతా మూర్తితో కలిసి ఓటేసిన ఆ దేశ ప్రధాని రిషి సునాక్.. ఆపై ఎక్స్ ద్వారా ఓటర్ల కోసం సందేశం ఇచ్చారు.పోలింగ్ ప్రారంభమైందని, లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక తరం మొత్తం పన్నుల మోతతో ఇబ్బంది ఎదుర్కుంటుందని, కాబట్టి కన్జర్వేటివ్పార్టీకి ఓటేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారాయన.The polls are open. Vote Conservative to stop the Labour supermajority which would mean higher taxes for a generation. pic.twitter.com/NPH7lSeDFc— Rishi Sunak (@RishiSunak) July 4, 2024మరోవైపు దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ కోరుతున్నారు. దేశవ్యాప్తంగా 40 వేల పోలింగ్ బూత్‌లలో 4.6 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం 7గం. నుంచి రాత్రి 10గం. దాకా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాతే ఎగ్జిట్‌పోల్స్ వెలువడతాయి. మరో గంట వ్యవధి తర్వాత ఫలితాల లెక్కింపు మొదలవుతుంది. పూర్తి ఫలితాలు రేపు ఉదయం 6గం.30 కల్లా..(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11గం.కల్లా) వెలువడే ఛాన్స్ ఉంది.పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగాల్సి ఉంది. యునైటెడ్ కింగ్ డమ్‌లో మొత్తం 392 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. కన్జర్వేటివ్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. గత 14 ఏళ్లలో అధికారంలో కొనసాగిన కన్జర్వేటివ్ పార్టీ.. ఐదుగురు ప్రధానుల్ని మార్చింది. భారత సంతతికి చెందిన 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది.మరోవైపు.. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పార్టీకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు ఒపీనియన్ పోల్స్ సైతం లేబర్ పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఇక.. 10 లక్షల మందికి పైగా భారతీయ మూలాలు ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి ఏకంగా 107 మంది బ్రిటీష్ ఇండియన్లు బరిలో దిగుతుండటం విశేషం. 2019లో ఆ సంఖ్య 63 కాగా, అందులో 15 మంది గెలిచారు. -
గర్జించిన స్కాటిష్ స్వేచ్ఛా సింహం
(సాక్షి వెబ్ ప్రత్యేకం) లండన్: గ్రేట్ బ్రిటన్‌లో అంతర్భాగంగా దాదాపు మూడు శతాబ్దాలుగా దాస్య శృంఖలాలను అనుభవిస్తున్న స్కాట్లాండ్ స్వేచ్ఛా సింహం ఒక్కసారిగా జూలు విదిల్చి గర్జించింది. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తాను చాటింది. స్కాట్లాండ్ ప్రాంతంలోని 59 సీట్లకుగాను 56 సీట్లకు స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీకి పట్టం కట్టడం ద్వారా తమలో ఇంకా స్వాతంత్య్ర వాంఛ చావలేదని అక్కడి ప్రజలు చాటి చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు రెండో స్వాతంత్య్ర రిఫరెండంకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014, సెప్టెంబర్ 14న ప్రవేశపెట్టిన ‘స్కాట్లాండ్ స్వాతంత్య్ర రిఫరెండమ్’ 55-45 ఓట్ల శాతంతో వీగిపోయిన విషయం తెల్సిందే. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన స్కాట్లాండ్ నేషనలిస్ట్ పార్టీకి అప్పుడు బ్రిటన్ పార్లమెంట్లో కేవలం ఆరు సీట్లు మాత్రమే ఉన్నాయి. 2010 ఎన్నికల్లో కేవలం 4, 91, 386 ఓట్లతో నేషనలిస్ట్ పార్టీ ఆరు సీట్లను గెలుచుకోగా, ఈ సారి ఎన్నికల్లో 1, 454,436 ఓట్లతో 56 సీట్లను గెలుచుకుంది. స్కాట్లాండ్లో వీచిన స్వేచ్ఛా వాయువులకు డేవిడ్ కామరాన్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీలోనూ, అటు ప్రతిపక్షంలోని లేబర్ పార్టీలోనూ మహా మహలు మట్టి కరిచారు. ఈ విజయాన్ని తాను కూడా ఊహించలేదని స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు స్టరిజియాన్ వ్యాఖ్యానించారు. రెండో స్వాతంత్య్ర రిఫరెండమ్ గురించి ఆమె ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అయితే ఇక బ్రిటన్ పార్లమెంట్లో స్కాట్లాండ్ గొంతుక బిగ్గరగా వినిపిస్తుందని ఆమె చెప్పారు. రెండోసారి ప్రధాన మంత్రికానున్న కామరూన్‌కు స్కాట్లాండ్ సమస్యను పరిష్కరించడం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మొదటి రిఫరెండమ్కే భయపడిన ఆయన ఆ ప్రాంతానికి కొన్ని ఆర్థిక హక్కులను క ల్పించడం ద్వారా అప్పుడు ఆ గండం నుంచి గట్టెక్కారు. ఇప్పుడు అదే బాటను అనుసరించి మరిన్ని ఆర్థిక రాయితీలను, హక్కులను కల్పించడం ద్వారా నెట్టుకొస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంతో కాలంగా స్వతంత్ర దేశంగా బతికిన స్కాట్లాండ్ 1707, మే 1వ తేదీన యునెటైడ్ కింగ్డమ్లో విలీనమైంది. అడపాదడపా అక్కడ స్వాతంత్య్రోద్యమ పోరాటాలు ఉద్భవించిన నిలబడలేక పోయాయి . 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం తలెత్తిన రోజుల్లో మళ్లీ ఆ ఉద్యమాలు ఊపందుకున్నాయి.