గర్జించిన స్కాటిష్ స్వేచ్ఛా సింహం
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
లండన్: గ్రేట్ బ్రిటన్‌లో అంతర్భాగంగా దాదాపు మూడు శతాబ్దాలుగా దాస్య శృంఖలాలను అనుభవిస్తున్న స్కాట్‌లాండ్ స్వేచ్ఛా సింహం ఒక్కసారిగా జూలు విదిల్చి గర్జించింది. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తాను చాటింది. స్కాట్‌లాండ్ ప్రాంతంలోని 59 సీట్లకుగాను 56 సీట్లకు స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీకి పట్టం కట్టడం ద్వారా తమలో ఇంకా స్వాతంత్య్ర వాంఛ చావలేదని అక్కడి ప్రజలు చాటి చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు రెండో స్వాతంత్య్ర రిఫరెండంకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
2014, సెప్టెంబర్ 14న ప్రవేశపెట్టిన ‘స్కాట్‌లాండ్ స్వాతంత్య్ర రిఫరెండమ్’ 55-45 ఓట్ల శాతంతో వీగిపోయిన విషయం తెల్సిందే. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన స్కాట్‌లాండ్ నేషనలిస్ట్ పార్టీకి అప్పుడు బ్రిటన్ పార్లమెంట్‌లో కేవలం ఆరు సీట్లు మాత్రమే ఉన్నాయి. 2010 ఎన్నికల్లో కేవలం 4, 91, 386 ఓట్లతో నేషనలిస్ట్ పార్టీ ఆరు సీట్లను గెలుచుకోగా, ఈ సారి ఎన్నికల్లో 1, 454,436 ఓట్లతో 56 సీట్లను గెలుచుకుంది. స్కాట్‌లాండ్‌లో వీచిన స్వేచ్ఛా వాయువులకు డేవిడ్ కామరాన్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీలోనూ, అటు ప్రతిపక్షంలోని లేబర్ పార్టీలోనూ మహా మహలు మట్టి కరిచారు.
ఈ విజయాన్ని తాను కూడా ఊహించలేదని స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు స్టరిజియాన్ వ్యాఖ్యానించారు. రెండో స్వాతంత్య్ర రిఫరెండమ్ గురించి ఆమె ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అయితే ఇక బ్రిటన్ పార్లమెంట్‌లో స్కాట్‌లాండ్ గొంతుక బిగ్గరగా వినిపిస్తుందని ఆమె చెప్పారు. రెండోసారి ప్రధాన మంత్రికానున్న కామరూన్‌కు స్కాట్‌లాండ్ సమస్యను పరిష్కరించడం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
మొదటి రిఫరెండమ్‌కే భయపడిన ఆయన ఆ ప్రాంతానికి కొన్ని ఆర్థిక హక్కులను క ల్పించడం ద్వారా అప్పుడు ఆ గండం నుంచి గట్టెక్కారు. ఇప్పుడు అదే బాటను అనుసరించి మరిన్ని ఆర్థిక రాయితీలను, హక్కులను కల్పించడం ద్వారా నెట్టుకొస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంతో కాలంగా స్వతంత్ర దేశంగా బతికిన స్కాట్‌లాండ్ 1707, మే 1వ తేదీన యునెటైడ్ కింగ్‌డమ్‌లో విలీనమైంది. అడపాదడపా అక్కడ స్వాతంత్య్రోద్యమ పోరాటాలు ఉద్భవించిన నిలబడలేక పోయాయి . 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం తలెత్తిన రోజుల్లో మళ్లీ ఆ ఉద్యమాలు ఊపందుకున్నాయి.