scotland referendum
-
గర్జించిన స్కాటిష్ స్వేచ్ఛా సింహం
(సాక్షి వెబ్ ప్రత్యేకం) లండన్: గ్రేట్ బ్రిటన్‌లో అంతర్భాగంగా దాదాపు మూడు శతాబ్దాలుగా దాస్య శృంఖలాలను అనుభవిస్తున్న స్కాట్లాండ్ స్వేచ్ఛా సింహం ఒక్కసారిగా జూలు విదిల్చి గర్జించింది. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తాను చాటింది. స్కాట్లాండ్ ప్రాంతంలోని 59 సీట్లకుగాను 56 సీట్లకు స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీకి పట్టం కట్టడం ద్వారా తమలో ఇంకా స్వాతంత్య్ర వాంఛ చావలేదని అక్కడి ప్రజలు చాటి చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు రెండో స్వాతంత్య్ర రిఫరెండంకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014, సెప్టెంబర్ 14న ప్రవేశపెట్టిన ‘స్కాట్లాండ్ స్వాతంత్య్ర రిఫరెండమ్’ 55-45 ఓట్ల శాతంతో వీగిపోయిన విషయం తెల్సిందే. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన స్కాట్లాండ్ నేషనలిస్ట్ పార్టీకి అప్పుడు బ్రిటన్ పార్లమెంట్లో కేవలం ఆరు సీట్లు మాత్రమే ఉన్నాయి. 2010 ఎన్నికల్లో కేవలం 4, 91, 386 ఓట్లతో నేషనలిస్ట్ పార్టీ ఆరు సీట్లను గెలుచుకోగా, ఈ సారి ఎన్నికల్లో 1, 454,436 ఓట్లతో 56 సీట్లను గెలుచుకుంది. స్కాట్లాండ్లో వీచిన స్వేచ్ఛా వాయువులకు డేవిడ్ కామరాన్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీలోనూ, అటు ప్రతిపక్షంలోని లేబర్ పార్టీలోనూ మహా మహలు మట్టి కరిచారు. ఈ విజయాన్ని తాను కూడా ఊహించలేదని స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు స్టరిజియాన్ వ్యాఖ్యానించారు. రెండో స్వాతంత్య్ర రిఫరెండమ్ గురించి ఆమె ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అయితే ఇక బ్రిటన్ పార్లమెంట్లో స్కాట్లాండ్ గొంతుక బిగ్గరగా వినిపిస్తుందని ఆమె చెప్పారు. రెండోసారి ప్రధాన మంత్రికానున్న కామరూన్‌కు స్కాట్లాండ్ సమస్యను పరిష్కరించడం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మొదటి రిఫరెండమ్కే భయపడిన ఆయన ఆ ప్రాంతానికి కొన్ని ఆర్థిక హక్కులను క ల్పించడం ద్వారా అప్పుడు ఆ గండం నుంచి గట్టెక్కారు. ఇప్పుడు అదే బాటను అనుసరించి మరిన్ని ఆర్థిక రాయితీలను, హక్కులను కల్పించడం ద్వారా నెట్టుకొస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంతో కాలంగా స్వతంత్ర దేశంగా బతికిన స్కాట్లాండ్ 1707, మే 1వ తేదీన యునెటైడ్ కింగ్డమ్లో విలీనమైంది. అడపాదడపా అక్కడ స్వాతంత్య్రోద్యమ పోరాటాలు ఉద్భవించిన నిలబడలేక పోయాయి . 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం తలెత్తిన రోజుల్లో మళ్లీ ఆ ఉద్యమాలు ఊపందుకున్నాయి. -
బ్రిటన్ సమైక్యతకు ఢోకా లేనట్లే!
గ్లాస్గో : స్కాట్లాండ్ స్వతంత్ర దేశం అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ విభజనకు వ్యతిరేకంగా స్కాట్లాండ్ ప్రజలు తీర్పు ఇచ్చే దిశగా ఓటింగ్ ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి దాకా వెలువడిన ఫలితాల్లో దేశ విభజన వద్దంటూ 54.33 శాతం మంది ఓటేశారు. 45.67 శాతం మంది ప్రత్యేకం దేశం కావాలని కోరుతూ ఓటేశారు. మొత్తం 32 కౌంటీలు ఉండగా 25 కౌంటీల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. 25 కౌంటీల్లో కేవలం 4 కౌంటీల్లో మాత్రమే విభజనకు అనుకూలంగా మెజార్టీ ఓటర్లు తీర్పు ఇచ్చారు. 21 కౌంటీల్లో విభజనకు వ్యతిరేకంగా.. సమైక్యానికి మద్దతుగా ఓటేశారు. ఈ ఫలితాలను బట్టి బ్రిటన్ భవితవ్యానికి ఢోకా ఉండకపోవచ్చని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
నేడు తేలనున్న స్కాట్లాండ్ భవిత
ఎడిన్‌బరో: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన స్కాట్లాండ్ రెఫరెండంపై గురువారం పోలింగ్ ముగిసింది. ఫలితాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి. యూకే నుంచి విడిపోయి స్వతంత్రదేశంగా మారే విషయంలో స్కాట్లాండ్ ప్రజల వైఖరి మరికొద్ది గంటల్లో తేలనుంది. ఓటింగ్‌లో స్కాట్లాండ్ పౌరులు ఆసక్తిగా పాల్గొన్నారు. పోలింగ్‌బూత్‌లు తెరవకముందే.. వాటిముందు బారులు తీరడం కనిపించింది. కొన్ని వారాలుగా స్కాట్లాండ్ను హోరెత్తించిన స్వాతంత్య్ర అనుకూల, వ్యతిరేక వర్గాల ప్రచారం సద్దుమణిగింది. స్వాతంత్య్ర అనుకూల వర్గానికి అలెక్స్ సాల్మండ్ నేతృత్వం వహిస్తున్నారు. స్వతంత్రదేశంగా మారేందుకుగల ఈ చరిత్రాత్మక అవకాశాన్ని వదులుకోరాదని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్.. బ్రిటన్ నుంచి విడిపోవద్దంటూ అభ్యర్థిస్తూనే, విడిపోతే వచ్చే ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేరంటూ హెచ్చరించారు. యూకే ఐక్యంగానే కొనసాగుతుందన్న ఆశాభావాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తం చేశారు. ఇంతకాలం బ్రిటన్‌తో కలిసుండటానికి మద్దతిచ్చిన స్కాట్లాండ్కు చెందిన టెన్నిస్ స్టార్ ఆండీముర్రే చివరి నిమిషంలో స్వతంత్ర వాదనకు మొగ్గు చూపుతూ ట్వీట్ చేశారు. ముర్రే ట్వీట్‌కు విశేష స్పందన లభించింది. కలిసుండేందుకే మొగ్గు: అతి స్వల్ప మెజారిటీతో బ్రిటన్‌తో కలిసుండాలనే వాదనే విజయం సాధిస్తుందని తాజా సర్వేలో తేలింది. ‘యుగవ్’ చేసిన ప్రీ ఎలక్షన్ సర్వేలో 52% మంది యూకేలో భాగంగానే ఉండాలని, 48% మంది స్వతంత్రదేశంగా ఉండాలని స్పష్టం చేశారు. -
విడిపోవాలి.. లేదు కలిసుండాలి!
విభజించు పాలించు విధానాన్ని అవలంభించిన ఆంగ్లేయులు ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తమతో సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించిన స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భావించాలన్న ఆకాంక్షను వెల్లడించడంతో విలవిల్లాడుతున్నారు. విడిపోవద్దంటూ స్కాట్లాండ్ వాసులను వేడుకుంటున్నారు. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు స్కాట్లాండ్ ప్రజలు సిద్దమయ్యారు. ఫలితం ఎలావున్నా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విభజనపై స్కాట్లాండ్ లోని ప్రవాస భారతీయులు రెండుగా విడిపోయారు. కొంతమంది సమైక్యానికే మద్దతు పలుకుతుంటే, మరికొందరు విడపోవడమే మేలంటున్నారు. స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలన్న ఆకాంక్షను భారత సంతతి విద్యార్థిని జవిత నారంగ్ వ్యక్తం చేసింది. స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి కావలసిన అన్ని అర్హతలు స్కాట్లాండ్ కు ఉన్నాయని ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న జవిత అభిప్రాయపడింది. జవిత అభిప్రాయంతో అబర్డీన్ ఇండియన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు మొహువా బెనర్జీ విభేదించారు. బ్రిటన్ లో భాగంగా స్కాట్లాండ్ కొనసాగాలని తాను కోరుకుంటున్నానని మూడు దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న ఆమె పేర్కొన్నారు. ఏ దేశమైనా విడిపోతే బలహీనపడుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మొహువా వాదనతో గ్లాస్కో బెంగాలీ సాంస్కృతిక సంఘం అధ్యక్షురాలు షీలా బెనర్జీ ఏకీభవించారు. గ్లాస్కో ప్రాంతంలో ఉన్న బెంగాలీల్లో 99 శాతం మంది విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. బ్రిటన్ నుంచి స్కాట్లాండ్ విడిపోరాదని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని బ్రిటన్ కు చెందిన సోషల్ వర్కర్ రిచా గ్రోవర్ కోరారు. బ్రిటన్‌తో 307 ఏళ్ల అనుబంధాన్ని కొనసాగించడమా? లేక స్వతంత్ర దేశంగా తొలి అడుగులు వేయడమా? అనేది స్కాట్లాండ్ ప్రజలు మరికొద్ది గంటల్లో నిర్ణయించనున్నారు.