నేడు తేలనున్న స్కాట్లాండ్ భవిత
ఎడిన్‌బరో: ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన స్కాట్లాండ్ రెఫరెండంపై గురువారం పోలింగ్ ముగిసింది. ఫలితాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి. యూకే నుంచి విడిపోయి స్వతంత్రదేశంగా మారే విషయంలో స్కాట్లాండ్ ప్రజల వైఖరి మరికొద్ది గంటల్లో తేలనుంది. ఓటింగ్‌లో స్కాట్లాండ్ పౌరులు ఆసక్తిగా పాల్గొన్నారు. పోలింగ్‌బూత్‌లు తెరవకముందే.. వాటిముందు బారులు తీరడం కనిపించింది. కొన్ని వారాలుగా స్కాట్లాండ్‌ను హోరెత్తించిన స్వాతంత్య్ర అనుకూల, వ్యతిరేక వర్గాల ప్రచారం సద్దుమణిగింది. స్వాతంత్య్ర అనుకూల వర్గానికి అలెక్స్ సాల్మండ్ నేతృత్వం వహిస్తున్నారు.
స్వతంత్రదేశంగా మారేందుకుగల ఈ చరిత్రాత్మక అవకాశాన్ని వదులుకోరాదని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్.. బ్రిటన్ నుంచి విడిపోవద్దంటూ అభ్యర్థిస్తూనే, విడిపోతే వచ్చే ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేరంటూ హెచ్చరించారు. యూకే ఐక్యంగానే కొనసాగుతుందన్న ఆశాభావాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తం చేశారు. ఇంతకాలం బ్రిటన్‌తో కలిసుండటానికి మద్దతిచ్చిన స్కాట్లాండ్‌కు చెందిన టెన్నిస్ స్టార్ ఆండీముర్రే చివరి నిమిషంలో స్వతంత్ర వాదనకు మొగ్గు చూపుతూ ట్వీట్ చేశారు. ముర్రే ట్వీట్‌కు విశేష స్పందన లభించింది.
కలిసుండేందుకే మొగ్గు: అతి స్వల్ప మెజారిటీతో బ్రిటన్‌తో కలిసుండాలనే వాదనే విజయం సాధిస్తుందని తాజా సర్వేలో తేలింది. ‘యుగవ్’ చేసిన ప్రీ ఎలక్షన్ సర్వేలో 52% మంది యూకేలో భాగంగానే ఉండాలని, 48% మంది స్వతంత్రదేశంగా ఉండాలని స్పష్టం చేశారు.