
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు బ్రిటన్ అప్పగించే ప్రక్రియకు మరింత సమయం పట్టేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన అప్పగింతకు ముందు కొన్ని చట్టపరమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ఎంతకాలం పడుతుందన్నది చెప్పలేమని బ్రిటన్ హై కమిషన్ ప్రతినిధి చెప్పారు. ‘అప్పగింతను వ్యతిరేకిస్తూ విజయ్ మాల్యా పెట్టుకున్న అప్పీళ్లన్నీ తిరస్కరణకు గురయ్యాయి.
అయినప్పటికీ ఆయనను అప్పగించేందుకు ముందుగా పరిష్కరించుకోవాల్సిన చట్టపరమైన అంశం ఒకటి ఉంది‘ అని వివరించారు. అది పూర్తయ్యే దాకా బ్రిటన్ చట్టం ప్రకారం అప్పగింత కుదరదని, ఇంతకు మించి వివరాలు వెల్లడించడానికి లేదని ప్రతినిధి చెప్పారు. దివాలా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ మాల్యా దేశీ బ్యాంకులకు దాదాపు రూ. 9,000 కోట్లు ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2016 నుంచి ఆయన బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు.