విజయ్ మాల్యా (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా (64) కు భారీ షాక్ తగిలింది. మాల్యాను భారత్ కు అప్పగించేందుకు 2018 లో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసుకున్న పిటిషన్ ను లండన్ కోర్టు సోమవారం కొట్టివేసింది. లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఇద్దరు సభ్యుల ధర్మాసనం లార్డ్ జస్టిస్ స్టీఫెన్ ఇర్విన్, జస్టిస్ ఎలిజబెత్ లాంగ్ మాల్యా అభ్యర్థనను తిరస్కరించింది.
భారతీయ బ్యాంకుల కన్సార్షియంకు సుమారు 9,000 కోట్ల రూపాయలకు పైగా ఎగవేసిన, మాల్యా 2016 మార్చిలో లండన్ పారిపోయాడు. మనీలాండరింగ్ ఆరోపణల కింద కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ చార్జ్ షీట్లను దాఖలు చేశాయి. మాల్యాకు చెందిన ఆస్తులను ఇప్పటికే ఎటాచ్ చేశాయి. మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన భారత ప్రభుత్వం. విచారణనిమిత్తం అతణ్ని ఇండియాకు తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వ వాదనను సమర్థించిన బ్రిటన్ పోలీసుల సహకారంతో 2017 ఏప్రిల్‌లో మాల్యాను లండన్‌లో భారత అధికారులు అరెస్టు చేశారు. తర్వాత బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలోనే 2018 డిసెంబర్‌లోనే విజయ్ మాల్యాను అప్పగించాలని యుకె కోర్టు ఆదేశించింది. (విజయ్ మాల్యాకు భారీ ఊరట)
కాగా తాను రుణాలను ఎగవేయలేదని పదే పదే వాదించే మాల్యా వంద శాతం అప్పులు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు. తాజాగా (మార్చి, 31) కరోనా సంక్షోభంలో నైనా తన కోరిక మన్నించాలని, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment