మాల్యాను భారత్‌కు అప్పగించండి | Vijay Mallya can be extradited to India | Sakshi
Sakshi News home page

మాల్యాను భారత్‌కు అప్పగించండి

Published Tue, Dec 11 2018 4:22 AM | Last Updated on Tue, Dec 11 2018 4:42 AM

Vijay Mallya can be extradited to India - Sakshi

విజయ్‌ మాల్యా

లండన్‌: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాల్ని ఎగవేసి విదేశాలకు పరారైన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను స్వదేశం తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆయన్ని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ కోర్టు మంగళవారం అంగీకరించింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఈ పరిణామం ఎన్డీయే ప్రభుత్వానికి గొప్ప విజయమని భావిస్తున్నారు. మాల్యాకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టిన ఆనవాళ్లు కనిపించడం లేదని ఈ తీర్పును వెలువరించిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు చీఫ్‌ జడ్జి ఎమ్మా అర్బుత్‌నాట్‌ తెలిపారు.

భారత్‌ సమర్పించిన ఆధారాల్ని పరిశీలించిన మీదట కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాల్యాను భారత్‌కు అప్పగించినంత మాత్రాన ఆయన మానవ హక్కులకు భంగం వాటిల్లదని పేర్కొన్నారు. మాల్యా తన కంపెనీ ఆర్థిక పరిస్థితిని తప్పుగా చూపి బ్యాంకులను మోసిగించారని ఆరోపించారు. విలాసాలకు అలవాటుపడిన ఈ వ్యాపారవేత్త తప్పుడు ధ్రువపత్రాలతో రుణాలు పొందారని పేర్కొన్నారు. ఈ తీర్పు ఆధారంగా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ సాజిద్‌ జావిద్‌.. మాల్యా అప్పగింతకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేయనున్నారు.

ఈ కేసును సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌కు అప్పగించడాన్ని మాల్యా లాయర్ల బృందం యూకే హైకోర్టు అనుమతితో 14 రోజుల్లోగా సవాలు చేయొచ్చు. ఒకవేళ మాల్యా లాయర్ల బృందం కోర్టు తీర్పును సవాలుచేయకుంటే జావిద్‌ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి 28 రోజుల్లోగా ఆయన్ని భారత్‌కు అప్పగిస్తారు. మరోవైపు, మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్‌ కోర్టు ఆదేశాల్ని కేంద్ర ప్రభుత్వం, సీబీఐ స్వాగతించాయి. యూపీఏ హయాంలో లబ్ధిపొందిన మాల్యాకు శిక్ష విధించడానికి ఎన్డీయే భారత్‌కు తీసుకొస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించారు.

ఆ ఆఫర్‌ బూటకం కాదు: మాల్యా
అంతకుముందు, మాల్యా కోర్టు ప్రాంగణంలో విలేకర్లతో మాట్లాడుతూ...బ్యాంకులకు అసలు మొత్తాన్ని చెల్లిస్తానని గతంలో చేసిన ప్రకటన బూటకం కాదని అన్నారు. బ్యాంకుల డబ్బును దొంగిలించానని తనపై వస్తున్న కథనాల్ని తోసిపుచ్చారు. ‘రుణాల్ని తిరిగి చెల్లిస్తానని కర్ణాటక హైకోర్టుకు తెలిపాను. ఈ ఆఫర్‌కు అప్పగింత కేసు విచారణకు సంబంధం లేదు. చెల్లించాల్సిన రుణాల కన్నా నా ఆస్తుల విలువే ఎక్కువ’ అని తెలిపారు. హైకోర్టు నుంచి అనుమతి వచ్చాక తొలుత కింగ్‌ఫిషర్‌ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తానని వెల్లడించారు.

జైలు సిద్ధం..
భారత్‌కు తీసుకొచ్చిన తరువాత మాల్యాను ఉంచబోయే ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఓ గదిని అధికారులు సిద్ధం చేశారు. జైలు ప్రాంగణంలో రెండంతస్తుల భవనంలో పటిష్ట భద్రత, నిరంతర నిఘా ఉండే చెరసాలలో ఆయన్ని ఉంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ జైలులో అంతర్జాతీయ స్థాయిలో భద్రతా ప్రమాణాలు అమలుచేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ముంబై దాడులకు పాల్పడి సజీవంగా చిక్కిన ఏకైక ఉగ్రవాది కసబ్‌ను కూడా ఈ జైలులోనే నిర్బంధించారు.

ప్లేబాయ్‌ మాయలో బ్యాంకులు!
సీబీఐ, ఈడీలు మోపిన నేరాభియోగాలపై విచారణ ఎదుర్కొనేందుకు మాల్యాను భారత్‌కు అప్పగించాల్సిందేనని జడ్జి ఎమ్మా అర్బుత్‌నాట్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న బెయిల్‌ షరుతులే ఇకపైనా వర్తిస్తాయని తెలిపారు. భారత్‌కు తీసుకొచ్చిన తరువాత మాల్యాను ఉంచబోయే ముంబై జైలులోని పరిస్థితులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మధుమేహం, హృద్రోగ సమస్యలు తలెత్తితే మాల్యాకు వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారని, జైలులో ఆయనకు ఎలాంటి ముప్పులేదని తెలిపారు. మాల్యాకు బ్యాంకులు అంత భారీ మొత్తంలో రుణాలు మంజూరుచేసిన విధానాన్ని తప్పుపట్టారు.

‘మాల్యాకు రుణాలు మంజూరు చేసిన విషయంలో వ్యవస్థాగతంగా కొన్ని లోపాలతో పాటు ఆర్థికపర దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. భారత్‌ సమర్పించిన ఆధారాలతో ఏదీ స్పష్టంగా తెలియట్లేదు. లేదంటే, విలాస పురుషుడు, ప్రముఖుడు, ఎప్పుడూ చుట్టూ బాడీగార్డులను ఉంచుకునే, ఆభరణాలు ధరించే ఆ ప్లేబాయ్‌ మాయలో బ్యాంకులు పడిపోయి ఉంటాయి. బ్యాంకులు తమ నిబంధనల్ని సైతం పక్కన పెట్టేలా ఆయన ఏదో మంత్రం వేసి ఉంటారు’ అని ఆమె వ్యాఖ్యానించారు. రూ.9 వేల కోట్ల మేర మోసం, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాల్యా గతేడాది ఏప్రిల్‌లో అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యారు. మాల్యాను భారత్‌ ఇది వరకే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

మాల్యా కేసు పూర్వాపరాలు
2005 మే 9: ‘కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌’ పేరిట వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించిన విజయ్‌మాల్యా
2013: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం తమవద్ద తీసుకున్న రూ.6,494 కోట్లు తిరిగి చెల్లించాలని మాల్యాను కోరిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం
2016 మార్చి3: భారత్‌ నుంచి పారిపోయి ఆశ్రయం కోసం లండన్‌ చేరిన మాల్యా
2017 ఫిబ్రవరి: మాల్యాను అప్పగించాలని బ్రిటన్‌ను కోరిన భారత్‌
2017, ఏప్రిల్‌ 18: మాల్యాను అరెస్టుచేసి సెంట్రల్‌ లండన్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన స్కాట్లాండ్‌ పోలీసులు. వెనువెంటనే దాదాపు రూ.6కోట్ల విలువైన షూరిటీ పత్రాలు సమర్పించి బెయిలుపై బయటికొచ్చిన మాల్యా.
2017, డిసెంబర్‌ 4: భారత్‌కు మాల్యా అప్పగింత కేసు విచారణ మొదలు.
2017, డిసెంబర్‌ 14: భారత్‌ తరఫు నుంచి, మాల్యా తరఫు నుంచి వారి వాదనలను బలపరిచే పూర్తిస్థాయి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు.  
2018 ఏప్రిల్‌ 27: మాల్యాపై అభియోగాలను రుజువుచేస్తూ కోర్టుకు భారత్‌ సమర్పించిన నివేదికలను సాక్ష్యాలుగా స్వీకరించేందుకు అంగీకరించిన కోర్టు.
2018 జూలై 31: భారత్‌కు అప్పగిస్తే ముంబైలోని ఆర్ధర్‌ రోడ్‌ జైలులో మాల్యాను నిర్భంధించే గది వీడియోను కోరిన కోర్టు.
2018 సెప్టెంబర్‌ 12: భారత్‌ వీడి లండన్‌కు వచ్చే ముందు ఆర్థికమంత్రి జైట్లీని కలిసే వచ్చానని ప్రకటించిన మాల్యా. అబద్ధమని కొట్టిపారేసిన జైట్లీ
డిసెంబర్‌ 10: మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్స్‌ కోర్టు మహిళా జడ్జి ఎమ్మా అర్బుత్‌నాట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement