
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగవేసి లండన్‌లో తలదాచుకున్న భారీ ఎగవేతదారుడు విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ ఇప్పట్లో జరిగే పనికాదని తాజా నివేదికల సారాంశం. చట్ట ప్రకారం మాల్యాను తిరిగి ఇండియాకు రప్పించడం సమీప కాలంలో కష్టమే అనే సందేహం వ్యక్తమవుతోంది. (త్వరలోనే భారత్‌కు విజయ్ మాల్యా..)
చట్ట పరమైన నిబంధనల కారణంగా భారతదేశానికి అప్పగించలేమని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ రిపోర్టు చేసింది. యూకే హైకమిషన్ ఈ విషయాన్ని ధృవీకరించిందని కూడా తెలిపింది. చట్ట సమస్యలను పరిష్కరించిన తరవాత మాత్రమే మాల్యాను పంపిస్తామని బ్రిటిష్ హై కమిషన్ పేర్కొంది. ఇది చాలా గోప్యమైన వ్యవహారమంటూ ఇంతకుమించి వివరాలను అందించేందుకు నిరాకరించారు. అలాగే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా అంచనా వేయలేమనీ, వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ప్రతినిధి తెలిపారు. ముఖ్యంగా చట్టపరమైన కారణాల వల్ల మాల్యాను అప్పగింత ఆదేశాలపై యూకే హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ సంతకం చేయకపోవడమే ఆలస్యానికి కారణమనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మాల్యా న్యాయవాది ఆనంద్ దూబే కూడా మాల్యాను వెనక్కి రప్పించే వ్యవహారం తమ దృష్టిలో లేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
కాగా పరారీలో ఉన్న మాల్యాను ముంబైకి తరలించనున్నారని, ఆయనతో పాటు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు ఉంటారంటూ పలు వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.