british high commission
-
ట్రాఫికింగ్‌పై ‘ధ్రువా’స్త్రం
సాక్షి, హైదరాబాద్: మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్) ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్య. రాష్ట్రంలో దీన్ని నిరోధించేందుకు తెలంగాణ పోలీసులు నడుం బిగించారు. కలకలం రేపుతున్న ట్రాఫికింగ్‌ను కట్టడి చేయడానికి మరో వినూత్న ప్రయోగం చేశారు. పిల్లలు, మహిళలకు ప్రమాదకరంగా మారిన మానవ అక్రమ రవాణా నిరోధకానికి దేశంలోనే తొలి వెబ్సైట్ ధ్రువహెచ్‌టీ (http://dhruvaht.orf/) (డీహెచ్‌ఆర్‌యూవీఏహెచ్‌టీ.ఓఆర్జీ)ను ఇటీవల ప్రారంభించారు. విమెన్‌సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ హైకమిషన్, తరుణి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మనుషుల అక్రమ రవాణా కేసులు తరచుగా వెలుగుచూస్తున్నాయి. మహిళలు, బాలికలను ఎత్తుకెళ్లి వ్యభిచార గృహాలకు విక్రయించడం, పిల్లల చేత బలవంతంగా పనిచేయించడం, భిక్షాటన, వారి అవయవాల మార్కెటింగ్ తదితర మాఫియా ముఠాల ఆట కట్టించడం ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం. అలాగే దీనిపై ఆన్లైన్లో పోలీసులకు, సాధారణ పౌరులకు సైతం శిక్షణ ఇస్తారు. ఈ వెబ్సైట్లో ఏముంటుంది? ‘ధ్రువ’వెబ్సైట్ ట్రాఫికింగ్‌కు సంబంధించిన సమస్త సమాచారంతో భాండాగారంలా పనిచేస్తుంది. ఈ వెబ్సైట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నప్పటికీ.. త్వరలోనే పూర్తి స్థాయిలో సేవలు అందించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉంచారు. ► హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా ఉంటుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది. ఈ సమస్య దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది? ట్రాఫికింగ్‌ను ఎలా కనిపెట్టవచ్చు? ఎలా బయటపడవచ్చో వివరిస్తుంది. ► బాధితులు ఎవరిని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలో తెలియజేసే ఈ–మెయిల్, ఫోన్, వాట్సాప్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ► భారత న్యాయవ్యవస్థలో ట్రాఫికింగ్ బాధితులకు అనుకూలంగా ఉండే చట్టాలు, తీర్పులు, వారి హక్కులు, పరిహారం తదితర వివరాలుంటాయి. ► ఈ–లెర్నింగ్ అనే ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా సాధారణ పౌరులు, పోలీసులకు శిక్షణ ఇస్తారు. ఆన్లైన్ కోర్సులు నిర్వహించి అప్పటికప్పుడు సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తారు. ► రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాకు సంబంధించి వివిధ భాషల్లో ప్రచురితమైన వ్యాసాలు ఉంటాయి. మనవద్ద సైతం.. అంతర్జాతీయ ట్రాఫికింగ్ ముఠాలు బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ తదితర దేశాల నుంచి పలువురు మహిళలను దొడ్డిదారిలో దేశం దాటించి దేశంలోని పలు నగరాలతోపాటు హైదరాబాద్‌లోనూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల పలుమార్లు రాచకొండ పోలీసులు ఈ తరహా కేసులను పట్టుకున్నారు. 2019లోనూ నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన పిల్లలు పట్టుబడ్డారు. కిడ్నాపింగ్, బెగ్గింగ్ మాఫియా, ఆర్గాన్ మాఫియాల ఆటకట్టించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 31 మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ విమెన్‌సేఫ్టీ వింగ్ పర్యవేక్షణలో పనిచేస్తాయి. టెక్నాలజీతో అరికడతాం మానవ అక్రమ రవాణా కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నాం. వీటిని ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు బృందాలను కూడా ఏర్పాటు చేశాం. ఆయా బృందాలకు టెక్నాలజీని జోడించి హీనమైన నేరాలకు పాల్పడేవారి ఆట కట్టిస్తాం. – మహేందర్‌రెడ్డి, డీజీపీ సంపూర్ణ సహకారం ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా చాలా ఘోరమైన నేరం. వీటిని అరికట్టేందుకు నడుం బిగించిన తెలంగాణ పోలీసులకు సాంకేతికంగా, సమాచారపరంగా మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. – ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ నిబంధనావళి.. శిక్షణ ట్రాఫికింగ్ కేసుల్లో వేగంగా ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక నిబంధనావళి రూపొందించాం. దీనిపై ప్రత్యేకంగా నియమించిన బృందాలకు శిక్షణ ఇచ్చాం. సిబ్బందికి సాంకేతిక మెళకువల కోసం నిరంతర శిక్షణ కూడా ఇస్తున్నాం. – స్వాతి లక్రా,ఏడీజీ, విమెన్‌సేఫ్టీ వింగ్ -
హర్ ఎక్సెలెన్సీ: ఒకరోజు బ్రిటిష్ హై కమిషనర్
ఆడపిల్ల పుట్టింది. హర్ ఎక్సెలెన్సీ!! ఆకాశం పూలను వర్షించింది. మేఘాలు పల్లకీలయ్యాయి. లెఫ్ట్ రైట్.. లెఫ్ట్ రైట్.. దేశాల గౌరవ వందనం. ఎంబసీలకు విద్యుద్దీపాలు. గర్ల్ చైల్డ్.. సంతోషాల రాయబారి. స్నేహాల హై కమిషనర్. గోరు ముద్దల్లో కలిపి పెట్టేవి కావు జీవిత లక్ష్యాలు. పిల్లల్ని వీలైనన్ని కొత్త ప్రదేశాలకు తిప్పాలి. మనమేమీ చెయ్యి పట్టుకుని ప్రపంచ దేశాలు తిప్పక్కరలేదు. ప్రపంచంలో ఇలాంటివి ఉన్నాయని చెప్పి వదిలేస్తే వాళ్లే తెలుసుకుంటారు. అప్పుడే లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. చైతన్య ఢిల్లీ విద్యార్థిని. పద్దెనిమిదేళ్లు. ఈ మధ్యే కాలేజ్ చదువు పూర్తయింది. స్కాలర్‌షిప్‌తో అమెరికన్ యూనివర్సిటీలో (పేరే ‘అమెరికన్ యూనివర్సిటీ’, వాషింగ్టన్లో ఉంది) ఇక్కడి నుంచే డిగ్రీలో చేరింది. ‘ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్; సర్టిఫికెట్ ప్రోగ్సామ్స్ ఇన్ అడ్వాన్స్డ్ లీడర్షిప్ స్టడీస్; పొలిటికల్ థాట్’ అనే ఐదారు సబ్జెక్టులు కలిసిన డిగ్రీ. చిన్నప్పుడు వాళ్ల ఇంటి దగ్గరలో బ్రిటిష్ లైబ్రరీ ఉండేది. ఒకసారి ఆమె తండ్రి ఆ లైబ్రరీకి తీసుకెళ్లాడు. ఆ ప్రపంచం నచ్చింది చైతన్యకు. అప్పట్నుంచీ ఆమె బ్రిటిష్ లైబ్రరీకి వెళ్లని రోజు దాదాపుగా లేనే లేదు. అయితే తను ఒకనాటికి బ్రిటిష్ హై కమిషనర్‌గా విధులను నిర్వహించబోతానని మాత్రం ఆమె ఊహించలేదు! ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయంలో మొన్న బుధవారం ‘ఒకరోజు హై కమిషనర్’ గా విధులు నిర్వహించింది చైతన్య. రోజూ ఉండే యాక్టింగ్ కమిషనర్ జాన్ థామ్సన్ ఆ ఒక్కరోజు చైతన్యకు డిప్యూటీగా వ్యవహరించారు. ఒక్కరోజులోనే చైతన్య చాలా పనులు చక్కబెట్టింది! (చక్కబెట్టారు అనాలేమో.. హై కమిషనర్ కదా). హై కమిషన్ కార్యాలయంలోని వివిధ విభాగాల ప్రధాన అధికారులలో చైతన్య సమావేశం అయ్యారు. సీనియర్ మహిళా పోలీసు అధికారులతో సంభాషించారు. ప్రెస్‌మీట్ పెట్టారు. యువతుల కోసం ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. తెలంగాణ, మధ్యప్రదేశ్ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ‘ఆనందబజార్’ పత్రిక ఎడిటర్‌తో ముచ్చటించారు. బ్రిటన్ ఆహార వస్తూత్పత్తుల గొలుసు విక్రయ దుకాణాల సంస్థ ‘మార్క్స్ అండ్ స్పెన్సర్’ ఇండియా టీమ్‌తో కూర్చున్నారు. క్షణం తీరిక లేకుండా చైతన్య చురుగ్గా బాధ్యతలను నిర్వర్తించడం చూసి ఆశ్చర్యపోయిన జాన్ థామ్సన్.. డ్యూటీ టైమ్ ముగిశాక చైతన్యను అభినందించారు. ఈ ‘వన్ డే హై కమిషనర్’ అవకాశం కోసం దేశవ్యాప్తంగా 215 మంది యువతులు పోటీపడ్డారు. ‘ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో లైంగిక సమానత్వానికి అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్లు, కలిసొచ్చే అవకాశాలు ఎలా ఉంటాయని మీరు భావిస్తున్నారు?’ అనే ప్రశ్నకు చైతన్య ఇచ్చిన వీడియో ప్రెజెంటేషన్ ఎక్కువ మార్కులు సాధించి, ఆమెను విజేతను చేసింది. అయినా.. ఒక రోజుకు హై కమిషనర్‌గా ఉంటే ఏమౌతుంది అనే ఆలోచన రానివ్వకండి. మహిళలకు అధికారాన్ని ఇచ్చేందుకు ప్రపంచాన్ని సిద్ధం చెయ్యడం ఇది. స్త్రీ పురుష సమానత్వ సాధన కోసం. మానవాళి మేలు కోసం. చక్కగా మాట్లాడగలగాలి ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయం వరల్డ్ ‘గర్ల్ చైల్డ్’ డే (అక్టోబర్ 11) సందర్భంగా 2017 నుంచి 18–23 సంవత్సరాల వయసు గల యువతులకు ఏటా ఒక రోజు హై కమిషనర్‌గా ఉండే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఒక నిముషం నిడివి మించని సెల్ఫ్ వీడియో ప్రెజెంటేషన్ రూపంలో ఎంట్రీలు ఆహ్వానిస్తోంది. ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్‌ని బట్టి వీడియోలో చక్కగా మాట్లాడగలగాలి. ప్రారంభ సంవత్సరంలో రుద్రాళీ పాటిల్ విజేతగా నిలిచింది. రుద్రాళీ నోయిడా ‘లా’ విద్యార్థిని. ‘బాలికల హక్కులు–సమాజంలో మార్పు తెచ్చేందుకు రెండు పరిష్కార మార్గాలు’ అనేది ఆ ఏడాది అంశం. 45 మందితో పోటీ పడి రుద్రాళీ ఆ అవకాశం దక్కించుకుంది. 2018లో ఈషా బహాల్ గెలుపొందింది. ‘స్త్రీ, పురుష సమానత్వం అంటే మీ దృష్టిలో ఏమిటి?’ అనే అంశంలో 58 మంది పోటీదారులను ఈషా నెగ్గుకొచ్చింది. ఆమెది కూడా నోయిడానే. డిగ్రీ విద్యార్థిని. 2019లో ఈ అవకాశం ఆయేషా ఖాన్‌కు లభించింది. ఆమెది గోరఖ్‌పూర్, పీజీ విద్యార్థిని. ‘లైంగిక సమానత్వం అవసరం ఏమిటి?’ అనే అంశంపై ఆయేషా దాదాపు వందమంది ప్రత్యర్థులను దాటి హై కమిషనర్ అయ్యే అవకాశం సాధించింది. -
లక్కీ.. బ్రిటీష్ హై కమిషనర్‌గా ఛాన్స్!
న్యూఢిల్లీ: భారత్‌లో బ్రిటీష్ హైకమిషనర్ పదవి గొప్ప పేరు ప్రఖ్యాతులు, బాధ్యత గలది. అంతటి హై ఫ్రొఫైల్ ఉద్యోగం 18 ఏళ్ల యువతి చైతన్య వెంకటేశ్వరన్‌ను వరించింది. అవును, భారత్‌లో బ్రిటీష్ హై కమిషనర్‌గా ఆమె గత బుధవారం ఒక రోజు సేవలందించారు. 2017 నుంచి బ్రిటీష్ హై కమిషన్ భారత్‌లో.. ‘ఒక రోజు హై కమిషనర్’ అనే పోటీని నిర్వహిస్తోంది. 18 నుంచి 23 ఏళ్ల యువతులు ఈ పోటీకి అర్హులు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, స్త్రీ సాధికారతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఒకరోజు హైకమిషన్‌గా అవకాశం రావడం పట్ల చైతన్య ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు లభించిన సువర్ణ అవకాశమని అన్నారు. మహిళా సాధికారత కోసం పాటుపడతానని చెప్పుకొచ్చారు. (చదవండి: ఆధునిక బానిసత్వంలో ‘ఆమె’) ప్రపంచ బాలికల దినోత్సవం (అక్టోబర్ 11) సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రస్తుత బ్రిటీష్ హైకమిషర్ జాన్ థాంప్సన్ తెలిపారు. చైతన్య ఉన్నత భావాలు గల అమ్మాయి అని చెప్పారు. హై కమిషనర్‌గా ఆమె చక్కని పనితీరు కనబర్చిందని మెచ్చుకున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ పోటీలు తనకెంతో ఇష్టమని చెప్పారు. భారత్, బ్రిటన్ మహిళల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటేందుకు చేస్తున్న కృషికి ఈ కార్యక్రమం నిదర్శనమని థాంప్సన్ పేర్కొన్నారు. కాగా, చైతన్య విధుల్లో ఉండగా.. థాంప్సన్ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఒకరోజు హైకమిషనర్ పోటీలకు 215 ఎంట్రీలు కాగా.. చైతన్యకు అవకాశం లభించింది. ఒకరోజు హైకమిషనర్‌గా పనిచేసిన వారిలో చైతన్య నాలుగో వ్యక్తి. (చదవండి: కరోనా ఉందని మర్చేపోయాను!) -
ఏపీలో టెస్టులు భేష్ : బ్రిటీష్ హైకమిషనర్
సాక్షి, అమరావతి : కరోనా నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్ దౌత్యాధికారులతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియాలో బ్రిటన్ తాత్కాలిక హై కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌లు పాల్గొన్నారు. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాన్ థాంప్సన్ ప్రశంసించారు. (ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు) జాన్ థాంప్సన్ ఏమన్నారంటే.. ‘కోవిడ్ లాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోని దేశాలు కలిసిపనిచేయాల్సిన అవసరం ఉంది. భారత్ – యూకేలు రెండూ కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో కలిసి పనిచేస్తున్నాయి. పరిశోధనలు, వ్యాక్సిన్ తయారీ, ఔషధాల తయారీలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. వ్యాక్సిన్ యూకేలో తయారవుతోంది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. భారీగా టెస్టులు చేయడంలో, పాజిటివ్ కేసులను గుర్తించండంలో ఆంధ్రప్రదేశ్ విశేషంగా పనిచేస్తోంది. అలాగే కరోనా మరణాల రేటు పూర్తిగా అదుపులో ఉండడం ప్రశంసనీయం. టెలీమెడిసిన్ లాంటి కొత్త విధానాలు ముందుకు తీసుకెళ్తున్నారు. వైద్య, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం మంచి చర్యలను తీసుకుంటోంది. ఏపీ మెడ్ టెక్‌జోన్‌తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. కరోనా నివారణకోసం వాడే వైద్య పరికరాల తయారీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈ విషయంలో స్టార్టప్ కంపెనీలను యూకే ప్రోత్సహిస్తుంది. కరోనా విపత్తును ఎదుర్కోనే ప్రక్రియలో కలిసి ముందుకు సాగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్ హెల్త్‌మిషన్ భాగస్వామంతో 108, 104 లాంటి అంబులెన్స్‌ల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు, టెక్నాలజీలను ఉపయోగించే అవకాశం ఉంటుంది’ అని జాన్ థాంప్సన్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక బ్రిటన్ రావాల్సిందిగా వైఎస్ జగన్‌ను బ్రిటిష్ హైకమిషనర్ ఆహ్వానించారు. (కరోనా వ్యాక్సిన్ : గరిష్ట ధర రూ. 225) ప్రజారోగ్య రంగంపై బాగా దృష్టిపెట్టాం : వైఎస్ జగన్ ‘రాష్ట్రంలో కోవిడ్ టెస్టులు పెద్ద ఎత్తున చేస్తున్నాం. సగటున రోజుకు 62వేల వరకూ పరీక్షలు చేస్తున్నాం. 90శాతం పరీక్షలు కోవిడ్ క్లస్టర్లలోనే చేస్తున్నాం. దీనివల్ల కేసులు బాగా నమోదవుతున్నాయి. కోవిడ్ సోకిన వారిని వేగంగా గుర్తించి, వారిని ఐసోలేట్ చేయడానికి, వైద్యం అదించండానికి తద్వారా మరణాల రేటు తగించడానికి ప్రయత్నిస్తున్నాం. ఏపీలో కరోనా మరణాల రేటు దేశం సగటుతో పోలిస్తే చాలా తక్కువ. మరణాల రేటు దేశంలో 2.07 శాతం, ఏపీలో 0.89 శాతంగా ఉంది. నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అన్ని రకాల పెద్ద ఆస్పత్రులు, వైద్య సేవలు అక్కడే అభివృద్ది చెందాయి. అలాంటి సదుపాయాలు ఇక్కడ లేవు. మేం అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వ ఆరోగ్య రంగంలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే. ప్రస్తుతం ప్రజారోగ్య రంగంపై బాగా దృష్టిపెట్టాం. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులను అభివృద్ధిచేస్తున్నాం. 16 కొత్త మెడికల్ కాలేజీలను, ఆస్పత్రులను తీసుకువస్తున్నాం. గ్రామ, వార్డుల వారీగా క్లినిక్స్ నిర్మిస్తున్నాం. ప్రతి పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, బోధనాసుపత్రులను బాగా అభివృద్ధిచేయబోతున్నాం. జాతీయ ప్రమాణాలతో అభివృద్ధిచేస్తున్నాం. (టెలి మెడిసిన్ సేవలపై ఆరా తీయండి: సీఎం జగన్) కోవిడ్‌కు వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మనం దాంతో కలిసి బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈలోగా మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. ఆక్స్ఫర్డ్ తయారుచేసిన వ్యాక్సిన్‌ను డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. బ్రిటన్ సహకారం మారాష్ట్రానికి చాలా అవసరం ఉంది. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాం. ఆస్పత్రులకు ఆలస్యంగా వస్తున్నందువల్లే కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. ఎంత త్వరగా వస్తే, అంతగామరణాలు తగ్గించవచ్చు. 10వేలకుపైగా రెమిడెసివర్ ఇంజక్షన్లు వాడి చాలా మందికి మెరుగైన వైద్యాన్ని అందించాం. త్వరగా ఆస్పత్రికి రావడం అన్నది చాలా ముఖ్యం’ అని వైఎస్ జగన్ తెలిపారు. -
మాల్యా అప్పగింతపై సందేహాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగవేసి లండన్‌లో తలదాచుకున్న భారీ ఎగవేతదారుడు విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ ఇప్పట్లో జరిగే పనికాదని తాజా నివేదికల సారాంశం. చట్ట ప్రకారం మాల్యాను తిరిగి ఇండియాకు రప్పించడం సమీప కాలంలో కష్టమే అనే సందేహం వ్యక్తమవుతోంది. (త్వరలోనే భారత్‌కు విజయ్ మాల్యా..) చట్ట పరమైన నిబంధనల కారణంగా భారతదేశానికి అప్పగించలేమని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ రిపోర్టు చేసింది. యూకే హైకమిషన్ ఈ విషయాన్ని ధృవీకరించిందని కూడా తెలిపింది. చట్ట సమస్యలను పరిష్కరించిన తరవాత మాత్రమే మాల్యాను పంపిస్తామని బ్రిటిష్ హై కమిషన్ పేర్కొంది. ఇది చాలా గోప్యమైన వ్యవహారమంటూ ఇంతకుమించి వివరాలను అందించేందుకు నిరాకరించారు. అలాగే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా అంచనా వేయలేమనీ, వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని ప్రతినిధి తెలిపారు. ముఖ్యంగా చట్టపరమైన కారణాల వల్ల మాల్యాను అప్పగింత ఆదేశాలపై యూకే హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ సంతకం చేయకపోవడమే ఆలస్యానికి కారణమనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మాల్యా న్యాయవాది ఆనంద్ దూబే కూడా మాల్యాను వెనక్కి రప్పించే వ్యవహారం తమ దృష్టిలో లేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాగా పరారీలో ఉన్న మాల్యాను ముంబైకి తరలించనున్నారని, ఆయనతో పాటు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు ఉంటారంటూ పలు వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. -
అధికారులు హీనంగా చూస్తున్నారు
సాక్షి, విశాఖపట్నం: అధికారులు తమను హీనంగా చూస్తున్నారని పలువురు పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తయారీ రంగంలో ఇబ్బందులు లేకుండా వ్యాపారం-పెట్టుబడులను ఏ విధంగా పెట్టాలి’ అనే అంశంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, బ్రిటీష్ హైకమిషన్(న్యూ దిల్లీ) సంయుక్తంగా బుధవారం విశాఖలో సెమినార్ నిర్వహించాయి. దీనికి హాజరైన పలువురు పారిశ్రామికవేత్తలు రెగ్యులేటరీ అప్రూవల్స్ నిపుణుల కమిటీ చైర్మన్ అజయ్‌శంకర్‌కు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే కనీస గౌరవం లభించడం లేదని, తమ సమస్యలు అధికారులు వినడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అన్ని అనుమతులు మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం కొన్నిటిని మాత్రమే ఇస్తే వ్యాపారం ఎలా ప్రారంభించగలుగుతామని ప్రశ్నించారు. తమపై భారీగా పన్నులు విధిస్తున్నారని, దానివల్ల వ్యాపారం చేయాలంటేనే వెనకాడాల్సి వస్తోందన్నారు. పారిశ్రామికవేత్తల సూచనలను విన్న అజయ్‌శంకర్ వారి అభిప్రాయాలను పరిశీలిస్తామన్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులనూ సకాలంలో మంజూరు చేస్తామన్నారు.