మాట్లాడుతున్న కలెక్టర్ ఎన్.యువరాజ్
సాక్షి, విశాఖపట్నం: అధికారులు తమను హీనంగా చూస్తున్నారని పలువురు పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తయారీ రంగంలో ఇబ్బందులు లేకుండా వ్యాపారం-పెట్టుబడులను ఏ విధంగా పెట్టాలి’ అనే అంశంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, బ్రిటీష్ హైకమిషన్(న్యూ దిల్లీ) సంయుక్తంగా బుధవారం విశాఖలో సెమినార్ నిర్వహించాయి.
దీనికి హాజరైన పలువురు పారిశ్రామికవేత్తలు రెగ్యులేటరీ అప్రూవల్స్ నిపుణుల కమిటీ చైర్మన్ అజయ్‌శంకర్‌కు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే కనీస గౌరవం లభించడం లేదని, తమ సమస్యలు అధికారులు వినడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 21 రోజుల్లో పరిశ్రమలకు అన్ని అనుమతులు మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం కొన్నిటిని మాత్రమే ఇస్తే వ్యాపారం ఎలా ప్రారంభించగలుగుతామని ప్రశ్నించారు.
తమపై భారీగా పన్నులు విధిస్తున్నారని, దానివల్ల వ్యాపారం చేయాలంటేనే వెనకాడాల్సి వస్తోందన్నారు. పారిశ్రామికవేత్తల సూచనలను విన్న అజయ్‌శంకర్ వారి అభిప్రాయాలను పరిశీలిస్తామన్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులనూ సకాలంలో మంజూరు చేస్తామన్నారు.