సాక్షి, అమరావతి: మహానగరంగా వేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం సిగలో మరో మణిహారం వచ్చి చేరుతోంది. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అదానీ డేటా సెంటర్, ఐటీ బిజినెస్ పార్క్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలతో అభివృద్ధి చెందుతున్న విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో భారీ బిజినెస్ పార్క్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అంతర్జాతీయ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా మధురవాడ హిల్ నంబర్–3లో 18.93 ఎకరాల్లో ఐస్పేస్ బిజినెస్ పార్క్‌ను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేస్తోంది.
ఇందుకు సుమారు రూ.300 కోట్ల వ్యయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసే కంపెనీ (ఎస్‌పీవీ)లో ఏపీఐఐసీ 26 శాతం వాటాను కలిగి ఉంటుంది. మిగిలిన 74 శాతం వాటాను భాగస్వామ్య కంపెనీ కలిగి ఉంటుంది. భూమికి అత్యధిక ధరను కోట్ చేసిన సంస్థను ఎంపిక చేస్తారు. ఎంపికైన సంస్థ ఏపీఐఐసీకి 26 శాతం వాటా కింద రూ.78 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని భాగస్వామ్య కంపెనీ ఈక్విటీగా పరిగణిస్తారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బహుళజాతి సంస్థలను ఆకర్షించే విధంగా ఈ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఏపీఐఐసీ వీసీ, ఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఆసక్తి గల సంస్థలు జూన్ 20లోగా బిడ్లు దాఖలు చేయాలని కోరారు.
చదవండి: Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ?
మధురవాడ, రుషికొండ ప్రాంతాల్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను ఆకర్షించేలా ఈ బిజినెస్ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గత కొంతకాలంగా దిగ్గజ కంపెనీలు విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తు్తండటంతో దానికి అనుగుణంగా ఏపీఐఐసీ బిజినెస్ పార్కులను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.
డిజైన్ దగ్గర నుంచి నిర్వహణ వరకు
నూతన సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో బిజినెస్ పార్కును నిర్మించేలా డిజైన్ దగ్గర నుంచి నిధుల సమీకరణ వరకు భాగస్వామ్య కంపెనీనే చూసుకోవాల్సి ఉంటుందని ఏపీఐఐసీ స్పష్టం చేసింది.
అలాగే ఐటీ, ఐటీ ఆధారిత, ఆర్థిక కంపెనీల అవసరాలకు అనుగుణంగా కమర్షియల్ ఆఫీస్ స్పేస్, బిజినెస్ సెంటర్‌తోపాటు సమావేశ మందిరాలు, బిజినెస్ హోటల్స్, సర్విస్ అపార్ట్‌మెంట్స్, ఎయిర్ థియేటర్, ఫుడ్ బేవరేజ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇతర మౌలిక వసతులతోపాటు పార్కింగ్ సౌకర్యాలు కూడా భాగస్వామ్య కంపెనీనే కల్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment