‘ఆంధ్రజ్యోతి’ ఆక్రమణ అసలు కథ ఇదీ.. | Revenue, APIIC Officers Demolish Aamoda Publications Printing Press Godown | Sakshi
Sakshi News home page

ఆక్రమణల తొలగింపులో భాగంగానే ఆంధ్రజ్యోతి గోడౌన్‌పై చర్యలు

Published Fri, Apr 9 2021 3:38 AM | Last Updated on Fri, Apr 9 2021 12:57 PM

Revenue, APIIC Officers Demolish Aamoda Publications Printing Press Godown - Sakshi

విశాఖలో ఆమోద పబ్లికేషన్స్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉన్న షెడ్‌ ఆక్రమణల్ని తొలగిస్తున్న దృశ్యం 

సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో భూబకాసురుల కబంద హస్తాల్లో చిక్కుకున్న భూములను అధికారులు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. అధికారం అండతో టీడీపీ నేతలు గతంలో చేసిన దురాక్రమణలపై ఇప్పుడు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆక్రమిత భూములు ఎవరి చేతుల్లో ఉన్నా వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు బదులు గోడౌన్లు నిర్మించి సొమ్ము చేసుకుంటున్న వాటిపైనా కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ప్రింటింగ్‌ ప్రెస్‌ ఆక్రమణల్ని తొలగించారే తప్ప.. ఉద్దేశపూర్వక, కక్షపూరిత వ్యవహారాలేమీ లేవని అధికారులు స్పష్టంచేస్తున్నారు.

నిజానికి.. విశాఖలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చ నేతల భూదందాల బాగోతం రాష్ట్రమంతటా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇలా దురాక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను వారి చెర నుంచి విడిపించేందుకు ప్రస్తుత సర్కారు సిద్ధమైంది. ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయో అధికారులు సర్వేచేసి వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా.. విశాఖ అర్బన్, రూరల్‌ పరిధిలో రూ.1,800 కోట్ల విలువైన వందల ఎకరాలు ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తున్న అక్రమ నిర్మాణంపైనా చర్యలు తీసుకున్నారు. 

స్వాధీనం చేసుకున్నవి ఇవీ..
2020 నవంబర్‌లో విశాఖ రూరల్‌ మండలం విజయరామపురం అగ్రహారం గ్రామంలో టైటిల్‌ డీడ్‌ నం.1180లోని సుమారు రూ.256 కోట్లు విలువైన 64 ఎకరాలు.. గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ చెరలో ఉన్న రూ.1,100 కోట్లు విలువైన సుమారు 40 ఎకరాలు.. ఆనందపురం మండలం భీమన్నదొర పాలెంలో సర్వే నం.156లో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కి చెందిన రూ.300 కోట్లు విలువైన సుమారు 60 ఎకరాల్ని.. విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి భార్య పేరిట ఆక్రమించిన రుషికొండలోని సర్వే నం.21లోని సుమారు రూ.2.50 కోట్లు విలువైన 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని.. కొమ్మాదిలోని సర్వే నం.66/2లో ఉన్న సుమారు రూ.98 కోట్ల విలువైన 11.25 ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక.. సాగర్‌నగర్‌ సమీపంలో మంత్రి బొత్స సమీప బంధువులకు చెందిన స్థలాన్ని 2020 డిసెంబర్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఇలా రాజకీయాలకు అతీతంగా.. పార్టీలతో పనిలేకుండా.. ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. 

‘ఆంధ్రజ్యోతి’ ఆక్రమణ అసలు కథ ఇదీ..
అక్షరానికి వక్రభాష్యం చెబుతూ అధికారులు తీసుకున్న చర్యల్ని తప్పుబడుతూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి.. ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు అమలుచేసిన నిర్ణయాలకు పొంతనలేదు. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే.. మింది పారిశ్రామిక ప్రాంతంలో ఏపీఐఐసీ కేటాయించిన స్థలాల్లో 18 ఎకరాల విస్తీర్ణంలో ఏటీఆర్‌ పేరుతో 8 గోడౌన్లు నిర్మించారు. 2007లో 24,249.66 చ.మీకు ప్లాన్‌ తీసుకున్నారు. దీనికి తోడు 16,534.05 చ.మీటర్ల మేర ఆక్రమించేసి అనధికారికంగా గోడౌన్లు నిర్మించారు. కాగా, ఇటీవల నిర్వహించిన సర్వేలో అనధికార నిర్మాణాన్ని గుర్తించిన ఐలా అధికారులు షెడ్‌ యజమానికి 2020 డిసెంబర్‌ 15న నోటీసులు జారీచేశారు. ఇందుకు స్పందించకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 25న కన్ఫర్మేషన్‌ నోటీసులు జారీచేశారు. అయినా స్పందించకపోవడంతో ఆక్రమిత స్థలంలో ఉన్న నిర్మాణాల్ని తొలగించే ప్రక్రియని చేపట్టారు. అనధికారికంగా నిర్మించిన షెడ్‌ నం.5లో ఆమోద పబ్లికేషన్‌కు సంబంధించిన ప్రింటింగ్‌ ప్రెస్‌తో పాటు మరో నాలుగు కంపెనీలు అనధికారికంగా నడుస్తున్నట్లు గుర్తించారు.

ఈ షెడ్‌ నెం.5ను ఉషా ట్యూబ్స్‌ అండ్‌ పైప్స్‌ ప్రై.లిమిటెడ్‌ పేరుతో స్టీల్‌ పైపులు, ట్యూబులు నిల్వచేసే గోడౌన్‌గా తీసుకున్నారు. అయితే, ఇందులో ఆమోదా పబ్లికేషన్స్‌తోపాటు హోంటౌన్‌ ఫర్నిచర్, రాఘవ వేర్‌హౌసింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్, హైవ్‌లూప్‌ లాజిస్టిక్స్, ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించిన గోడౌన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీటిని పరిశీలించిన అనంతరం.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీలని బుధవారం కూల్చివేశారు. ఐలా నిబంధనలకు విరుద్ధంగా గోడౌన్‌ని నిర్మించడమే ఒక అక్రమమైతే.. అందులో ప్రింటింగ్‌ సెక్షన్‌ ఏర్పాటుచేయడం కూడా మరో అక్రమమని అధికారులు చెబుతున్నారు. ఏపీఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖకు సంబంధించిన నిబంధనల్ని పాటించకుండా, వివిధ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుపుతున్నట్లు ఐలా (ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ) అధికారులు స్పష్టంచేస్తున్నారు. అందుకే చర్యలు తీసుకున్నారు తప్ప.. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిదనడం పూర్తి సత్యదూరమని చెబుతున్నారు. 

ఆక్రమణలు వెలుగుచూసింది ఇలా..
ఇదిలా ఉంటే.. గత డిసెంబర్‌లో కురిసిన వర్షాలకు షెడ్‌ నెం.5కు సంబంధించిన ప్రహరీ డ్రెయిన్‌లో కూలిపోయింది. దీంతో అక్కడ మురుగునీరు స్తంభించిపోవడంతో స్థానికుల ఫిర్యాదు చేశారు. ఐలా అధికారులు పరిశీలించగా ఆక్రమణల బాగోతం వెలుగుచూసింది. ఆ తర్వాత నోటీసులు జారీచేశారు.

అఫిడవిట్‌ దాఖలు చేస్తున్నాం..
అనధికార నిర్మాణం చేపట్టడమే కాకుండా అందులో నిబంధనలకు విరుద్ధంగా సంస్థల్ని నడిపిస్తున్నారంటూ రెండుసార్లు నోటీసులు జారీచేశాం. అయినా గోడౌన్‌ యజమాని స్పందించకపోవడంతో అక్రమ నిర్మాణం చేపట్టిన షెడ్‌ నం.5 కూల్చివేత ప్రక్రియ చేపట్టాం. అయితే, కోర్టు నుంచి స్టేటస్‌కో తీసుకొచ్చారు. మేం అఫిడవిట్‌ దాఖలు చేస్తున్నాం. ఆక్రమించి నిర్మించిన 5వ నంబర్‌ షెడ్‌లోనే ఆమోద పబ్లికేషన్స్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుస్తోంది. అందుకే చర్యలు తీసుకున్నాం.
– డా. ఎ.శామ్యూల్, ఐలా కమిషనర్‌

రాజకీయ ప్రమేయం లేకుండా..
విశాఖ భూ ఆక్రమణలపై రెవెన్యూ యంత్రాంగం ఏడాదిన్నర కాలంగా చర్యలకు ఉపక్రమించింది. రెవెన్యూ విభాగం నిర్వహిస్తున్న సర్వేలో ఆక్రమిత భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకుంటున్నాం. ఇప్పటివరకు సుమారూ 300 ఎకరాల వరకూ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఈ డ్రైవ్‌ వెనుక రాజకీయ ప్రమేయం ఏమాత్రం లేదు. ఆక్రమణల వెనుక ఎవరున్నా వాటిని విడిచిపెట్టడంలేదు. ఆక్రమణలున్నట్లు గుర్తించి ఆమోద పబ్లికేషన్స్‌ షెడ్స్‌ని తొలగించామే తప్ప.. దీని వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవు.
– పెంచల్‌ కిశోర్, ఆర్డీవో, విశాఖ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement