కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం | Peela Govind Illegal Building Demolished GVMC | Sakshi
Sakshi News home page

అప్పుడు ఆగింది..ఇప్పుడు కూలింది 

Published Sun, Aug 18 2019 8:00 AM | Last Updated on Sun, Aug 18 2019 12:44 PM

Peela Govind Illegal Building Demolished GVMC - Sakshi

భారీ గెడ్డ పక్కన కనీసం చిన్న పాటి నిర్మాణం  కూడా చేపట్టకూడదు.. కానీ అడ్డగోలుగా భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మించేశారు.. స్థలం 300 గజాలే.. అందులో భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతులు జీ ప్లస్‌ 2కే.. కానీ జీ ప్లస్‌ 4.. అంటే అదనంగా రెండంతస్తులు కట్టేశారు. అంతేనా.. ఏ చిన్నపాటి నిర్మాణమైనా రోడ్డు నుంచి కనీసం పది అడుగులు వదిలి కట్టుకోవాలి.. కానీ ఇక్కడ మెయిన్‌రోడ్డుకు ఆనుకునే నిర్మాణం చేసేశారు.. ఇన్ని ‘కానీ’లు ఉన్నాయంటేనే అర్థమై ఉంటుంది.. అప్పటి టీడీపీ పాలనలో  అనకాపల్లి ఎమ్మెల్యేగా వెలగబెట్టిన పీలాగోవింద్‌ అడ్డగోలు నిర్వాకం ఇదని.. ఇంత అక్రమంగా అన్యాయంగా కట్టేసింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. విశాఖ నగర నడిబొడ్డున ద్వారకానగర్‌ బీవీకే కళాశాల రోడ్డులో.. ఈ అడ్డగోలు భాగోతాన్ని నిర్మాణ సమయంలోనే.. అంటే 2017 జనవరిలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. అయితే అప్పటి అధికారులు ‘కాణీ’లకు కక్కుర్తి పడ్డారో.. ‘పచ్చ’పాతానికి తలొంచారో గానీ.. నిర్మాణాన్ని నిలువరించలేకపోయారు. సాక్షి వరుస కథనాలతో ఎట్టకేలకు నిర్మాణ పనుల దూకుడుకు బ్రేక్‌ పడింది కానీ మొత్తంగా అక్రమాలను అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు పాలన మారింది..  నిబంధనలకు విరుద్ధంగా తప్పుచేసిన వాళ్లు ఎవరైనా.. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే శనివారం తెల్లవారుజాము నుంచి ఈ అక్రమ కట్టడాన్ని కూ ల్చే పని మొదలుపెట్టారు. అయితే పీలా స్టే తెచ్చుకోవడంతో సాయంత్రం నిలిపి వేశారు. 

సీతంపేట(విశాఖ ఉత్తర): నిబంధనలు పాటించకుండా.., జీవీఎంసీ నుంచి కనీస అనుమతులు తీసుకోకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ నగరంలోని సీతంపేట మెయిన్‌రోడ్‌లో అడ్డగోలుగా నిర్మించిన బహుళ అంతస్థుల భవంతిని జీవీఎంసీ యంత్రాంగం ఎట్టకేలకు  కూల్చివేసింది. ‘‘అధికార పార్టీ ఎమ్మెల్యేని.. నన్ను ఎవరు ప్రశ్నిస్తారు.. నిబంధనలు నేనెందుకు పాటించాలి.. నేను అక్రమంగా ఇల్లు కడితే ఆపే దమ్ము ఎవరికి ఉందంటూ’’ అధికార మదంతో తనే దగ్గరుండి అక్రమాల భవంతిని నిర్మిచాండు పీలా. సర్వే నంబరు 32/3లో పీలా గోవిందు భార్య విజయలక్ష్మికి 280 గజాల స్థలం ఉన్నట్టు వారి వద్ద డాక్యుమెంట్‌  ఉందని సమాచారం. కానీ టౌన్‌ప్లానింగ్‌ నుంచి కనీస అనుమతులు కూడా లేకుండా గెడ్డ స్థలాన్ని, వంద అడుగుల ప్రధాన రహదారిని ఆక్రమించి 340 గజాల స్థలంలో జీ ప్లస్‌ 4 తరహాలో భవంతిని 2016 సంవత్సరంలో నిర్మించాడు. సెల్లార్‌ను సైతం విడిచిపెట్టకుండా కమర్షియల్‌ షాపులు నిర్మించేశారు. పీలా అనధికార కట్టడంపై 2017 జనవరి 6న ‘నిబంధనలు గోవిందా’ శీర్షికతో ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు పీలా సమాధానం ఇవ్వలేదు. తన అక్రమ భవంతిని కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. అప్పటి జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ అక్రమంగా నిర్మిస్తున్న భవంతి పనులను మధ్యలో ఆపివేయించారు. నిర్మాణ పనులను అడ్డుకున్నారు. సెల్లార్‌ను పార్కింగ్‌కే కేటాయించాలని, షాపులు నిర్మించరాదని ఆదేశించారు. అలాగే 5వ అంతస్థులో నిర్మించిన పెంట్‌హౌస్‌ను, సెల్లార్‌ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేయించారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే అక్రమ భవంతి సగంలోనే ఆగిపోయింది. సాక్షి కథనం ప్రజాప్రతినిధి అక్రమాన్ని అడ్డుకోగలిగింది.

కూల్చివేతకు కమిషనర్‌ ఆదేశం...
ప్రస్తుతం అధికారం మారి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్రమ, అనధికార నిర్మాణాలను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్‌ సృజన కూల్చివేతకు ఆదేశించారు. గురుద్వారా కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్సుకు వెళ్లే రహదారి మాస్టర్‌ ప్లాన్‌లో 100 అడుగుల రోడ్‌గా ఉంది. ఆ రహదారిని  అక్రమించి నిర్మాణం చేపట్టడం, అలాగే పక్కనే ఉన్న గెడ్డ స్థలాన్ని (బఫర్‌జోన్‌) అక్రమించి నిర్మాణం చేపట్టడం వంటి కారణాలతో బీపీఎస్‌ కూడా తిరస్కరణకు గురైంది. దీంతో పీలా గోవిందు తన భార్య విజయలక్ష్మి పేరుతో నిర్మించిన భవనం పూర్తిగా అనధికార నిర్మాణంగా నిర్ధారించి కూల్చివేతకు జీవీఎంసీ కమిషనర్‌ సృజన టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చీఫ్‌ సిటీ ప్లానర్‌ విద్యుల్లత ఆదేశాలతో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది శనివారం ఉదయం 4 గంటల నుంచే బిల్డింగ్‌ తొలగింపు చేపట్టారు. తొలగింపు సందర్భంగా అల్లర్లు జరగకుండా సీతంపేట మెయిన్‌రోడ్‌ను ఒకవైపు బ్లాక్‌ చేసి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతలో కోర్టు నుంచి పీలా గోవిందు స్టే తీసుకురావడంతో సాయంత్రం 4 గంటల తర్వాత కూల్చివేత నిలిపివేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement