Illegal building
-
టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత..
-
టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత..
సాక్షి, విశాఖపట్నం: పాత గాజువాకలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న మూడంతస్తుల భవనాన్ని అధికారులు తొలగించారు. కూల్చివేత సమయంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, అధికారం అడ్డుపెట్టుకుని నాడు తెలుగుదేశం హయాంలో అడ్డగోలుగా కాజేసిన పల్లా అండ్ కో భూ దందాల లెక్కలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆ కబ్జాల్లో చెరువులు, గయాళు వంటి ప్రభుత్వ భూములు సైతం ఇరుక్కొన్నాయి. చేతికి మట్టి అంటకుండా అందిన కాడికి భూములను మింగేసిన పల్లా అండ్ కో బాగోతంపై ఎట్టకేలకు అధికారులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చదవండి: గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ భూ అక్రమాలు నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం
భారీ గెడ్డ పక్కన కనీసం చిన్న పాటి నిర్మాణం కూడా చేపట్టకూడదు.. కానీ అడ్డగోలుగా భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మించేశారు.. స్థలం 300 గజాలే.. అందులో భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతులు జీ ప్లస్ 2కే.. కానీ జీ ప్లస్ 4.. అంటే అదనంగా రెండంతస్తులు కట్టేశారు. అంతేనా.. ఏ చిన్నపాటి నిర్మాణమైనా రోడ్డు నుంచి కనీసం పది అడుగులు వదిలి కట్టుకోవాలి.. కానీ ఇక్కడ మెయిన్‌రోడ్డుకు ఆనుకునే నిర్మాణం చేసేశారు.. ఇన్ని ‘కానీ’లు ఉన్నాయంటేనే అర్థమై ఉంటుంది.. అప్పటి టీడీపీ పాలనలో అనకాపల్లి ఎమ్మెల్యేగా వెలగబెట్టిన పీలాగోవింద్ అడ్డగోలు నిర్వాకం ఇదని.. ఇంత అక్రమంగా అన్యాయంగా కట్టేసింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. విశాఖ నగర నడిబొడ్డున ద్వారకానగర్ బీవీకే కళాశాల రోడ్డులో.. ఈ అడ్డగోలు భాగోతాన్ని నిర్మాణ సమయంలోనే.. అంటే 2017 జనవరిలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. అయితే అప్పటి అధికారులు ‘కాణీ’లకు కక్కుర్తి పడ్డారో.. ‘పచ్చ’పాతానికి తలొంచారో గానీ.. నిర్మాణాన్ని నిలువరించలేకపోయారు. సాక్షి వరుస కథనాలతో ఎట్టకేలకు నిర్మాణ పనుల దూకుడుకు బ్రేక్ పడింది కానీ మొత్తంగా అక్రమాలను అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు పాలన మారింది.. నిబంధనలకు విరుద్ధంగా తప్పుచేసిన వాళ్లు ఎవరైనా.. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే శనివారం తెల్లవారుజాము నుంచి ఈ అక్రమ కట్టడాన్ని కూ ల్చే పని మొదలుపెట్టారు. అయితే పీలా స్టే తెచ్చుకోవడంతో సాయంత్రం నిలిపి వేశారు. సీతంపేట(విశాఖ ఉత్తర): నిబంధనలు పాటించకుండా.., జీవీఎంసీ నుంచి కనీస అనుమతులు తీసుకోకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ నగరంలోని సీతంపేట మెయిన్రోడ్లో అడ్డగోలుగా నిర్మించిన బహుళ అంతస్థుల భవంతిని జీవీఎంసీ యంత్రాంగం ఎట్టకేలకు కూల్చివేసింది. ‘‘అధికార పార్టీ ఎమ్మెల్యేని.. నన్ను ఎవరు ప్రశ్నిస్తారు.. నిబంధనలు నేనెందుకు పాటించాలి.. నేను అక్రమంగా ఇల్లు కడితే ఆపే దమ్ము ఎవరికి ఉందంటూ’’ అధికార మదంతో తనే దగ్గరుండి అక్రమాల భవంతిని నిర్మిచాండు పీలా. సర్వే నంబరు 32/3లో పీలా గోవిందు భార్య విజయలక్ష్మికి 280 గజాల స్థలం ఉన్నట్టు వారి వద్ద డాక్యుమెంట్ ఉందని సమాచారం. కానీ టౌన్‌ప్లానింగ్ నుంచి కనీస అనుమతులు కూడా లేకుండా గెడ్డ స్థలాన్ని, వంద అడుగుల ప్రధాన రహదారిని ఆక్రమించి 340 గజాల స్థలంలో జీ ప్లస్ 4 తరహాలో భవంతిని 2016 సంవత్సరంలో నిర్మించాడు. సెల్లార్‌ను సైతం విడిచిపెట్టకుండా కమర్షియల్ షాపులు నిర్మించేశారు. పీలా అనధికార కట్టడంపై 2017 జనవరి 6న ‘నిబంధనలు గోవిందా’ శీర్షికతో ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు పీలా సమాధానం ఇవ్వలేదు. తన అక్రమ భవంతిని కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. అప్పటి జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ అక్రమంగా నిర్మిస్తున్న భవంతి పనులను మధ్యలో ఆపివేయించారు. నిర్మాణ పనులను అడ్డుకున్నారు. సెల్లార్‌ను పార్కింగ్‌కే కేటాయించాలని, షాపులు నిర్మించరాదని ఆదేశించారు. అలాగే 5వ అంతస్థులో నిర్మించిన పెంట్‌హౌస్‌ను, సెల్లార్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేయించారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే అక్రమ భవంతి సగంలోనే ఆగిపోయింది. సాక్షి కథనం ప్రజాప్రతినిధి అక్రమాన్ని అడ్డుకోగలిగింది. కూల్చివేతకు కమిషనర్ ఆదేశం... ప్రస్తుతం అధికారం మారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్రమ, అనధికార నిర్మాణాలను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ సృజన కూల్చివేతకు ఆదేశించారు. గురుద్వారా కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్సుకు వెళ్లే రహదారి మాస్టర్ ప్లాన్‌లో 100 అడుగుల రోడ్‌గా ఉంది. ఆ రహదారిని అక్రమించి నిర్మాణం చేపట్టడం, అలాగే పక్కనే ఉన్న గెడ్డ స్థలాన్ని (బఫర్‌జోన్) అక్రమించి నిర్మాణం చేపట్టడం వంటి కారణాలతో బీపీఎస్ కూడా తిరస్కరణకు గురైంది. దీంతో పీలా గోవిందు తన భార్య విజయలక్ష్మి పేరుతో నిర్మించిన భవనం పూర్తిగా అనధికార నిర్మాణంగా నిర్ధారించి కూల్చివేతకు జీవీఎంసీ కమిషనర్ సృజన టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత ఆదేశాలతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది శనివారం ఉదయం 4 గంటల నుంచే బిల్డింగ్ తొలగింపు చేపట్టారు. తొలగింపు సందర్భంగా అల్లర్లు జరగకుండా సీతంపేట మెయిన్‌రోడ్‌ను ఒకవైపు బ్లాక్ చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతలో కోర్టు నుంచి పీలా గోవిందు స్టే తీసుకురావడంతో సాయంత్రం 4 గంటల తర్వాత కూల్చివేత నిలిపివేశారు. -
ఆ ఉత్తర్వులను రద్దు చేయండి
సాక్షి, అమరావతి : కృష్ణానది కరకట్ట సమీపంలో రైతు సంఘం భవన్ పేరుతో నిర్మించిన కట్టడం కూల్చివేత నిమిత్తం తాము జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సీఆర్డీఏ కమిషనర్ అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ అప్పీల్‌పై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ‘ఏదైనా వ్యవహారంలో ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడు.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే దాఖలు చేసే వ్యాజ్యాల విషయంలో ఉన్నత న్యాయస్థానాలు తమ విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చు. నోటీసులు జారీ చేసిన అభ్యంతరాలు ఆహ్వానించిన దశలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పిటిషనర్ సీఆర్డీఏ చట్ట ప్రకారం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణానది పరీవాహక ప్రాంత పరిధిలో నిర్మించిన కట్టడం న్యాయ సమ్మతమైందని పిటిషనర్ చూపలేకపోయారు. రాజధాని ప్రాంత పరిధిలో అభివద్ధిని క్రమబద్ధీకరించే విషయంలో సీఆర్డీఏకు అన్నీ అధికారాలున్నాయి. నదికి 100 మీటర్లలోపు నిర్మాణాలు చేపట్టడంపై స్పష్టమైన నిషేధం ఉంది. 2007లో ఈ మేర జీవో కూడా జారీ అయింది. పిటిషనర్ ఏ కట్టడం గురించి అయితే చెబుతున్నారో, ఆ కట్టడానికి ఎటువంటి అనుమతులు లేవు. పర్యావరణాన్ని ఫణంగా పెట్టి నిర్మించిన అక్రమ కట్టడాలకు క్రమబద్ధీకరణను సాకుగా చూపడం తగదు. ఈ విషయాలన్నింటినీ సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. ఏ కోణంలో చూసినా కూడా సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు చట్ట విరుద్ధం. అందువల్ల వాటిని రద్దు చేయండి.’ అని సీఆర్డీఏ కమిషనర్ తన అప్పీల్లో పేర్కొన్నారు. ఈ అప్పీల్ గురించి అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ సోమవారం ఉదయం ఏసీజే నేతత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీంతో ధర్మాసనం ఈ అప్పీల్‌పై మంగళవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. రైతు సంఘం భవనం పేరుతో నిర్మించిన తమ కట్టడాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ, దానిని తొలగించే నిమిత్తం సీఆర్డీఏ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ చందన కేదారీష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గత వారం విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ దుర్గాప్రసాదరావు, సీఆర్డీఏ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వుల అమలును మూడు వారాల పాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
అక్రమ నిర్మాణాలకు చెక్!
మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆమోదం సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ భవన నిర్మాణాలకు అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు బుధవారం శాసనసభలో ఆమోదం లభించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇష్టానుసారంగా అక్రమ భవనాలు నిర్మించడం..కూల్చివేతకు గురికాకుండా దిగువ కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం నిత్య కృత్యమైంది. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా ట్రిబ్యునల్ ఏర్పాటు కానుండడంతో అక్రమ నిర్మాణాలపై దిగువ కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకోవడానికి ఇకపై వీలుండదు. ట్రిబ్యునల్ కార్యకలాపాలు ప్రారంభం కాగానే అక్రమ నిర్మాణాలపై కోర్టుకు వెళ్లే వారు ఇక నుంచి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ ట్రిబ్యునల్ బెంచ్‌లో తొలివిడతగా ఒక చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను భర్తీ చేయనున్నారు. వీరిలో ఒకరు న్యాయ విభాగానికి చెందిన జిల్లా స్థాయి న్యాయమూర్తి, మరొకరు సాంకేతిక సహకారం కోసం టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యులుగా వ్యవహరిస్తారు. ట్రిబ్యునల్ బెంచ్‌కు వచ్చిన అక్రమ నిర్మాణాల పరిస్థితి పరిశీలించి, సక్రమమైతే పరిష్కార మార్గాలు, లేకుంటే కూల్చివేయాలని తేల్చి చెప్పనున్నారు. ఈ తీర్పుపై హైకోర్టుకు వేళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైకోర్టులో 3,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రిబునల్ ఏర్పాటు అవుతున్నందున జీహెచ్ఎంసీ చట్టాలను సవరించనున్నారు. నగరంలోని బుద్ధభవన్‌లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది