అక్రమ నిర్మాణాలకు చెక్!
మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆమోదం
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ భవన నిర్మాణాలకు అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు బుధవారం శాసనసభలో ఆమోదం లభించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇష్టానుసారంగా అక్రమ భవనాలు నిర్మించడం..కూల్చివేతకు గురికాకుండా దిగువ కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం నిత్య కృత్యమైంది. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా ట్రిబ్యునల్ ఏర్పాటు కానుండడంతో అక్రమ నిర్మాణాలపై దిగువ కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకోవడానికి ఇకపై వీలుండదు. ట్రిబ్యునల్ కార్యకలాపాలు ప్రారంభం కాగానే అక్రమ నిర్మాణాలపై కోర్టుకు వెళ్లే వారు ఇక నుంచి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది.
ఈ ట్రిబ్యునల్ బెంచ్‌లో తొలివిడతగా ఒక చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను భర్తీ చేయనున్నారు. వీరిలో ఒకరు న్యాయ విభాగానికి చెందిన జిల్లా స్థాయి న్యాయమూర్తి, మరొకరు సాంకేతిక సహకారం కోసం టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యులుగా వ్యవహరిస్తారు. ట్రిబ్యునల్ బెంచ్‌కు వచ్చిన అక్రమ నిర్మాణాల పరిస్థితి పరిశీలించి, సక్రమమైతే పరిష్కార మార్గాలు, లేకుంటే కూల్చివేయాలని తేల్చి చెప్పనున్నారు. ఈ తీర్పుపై హైకోర్టుకు వేళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైకోర్టులో 3,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రిబునల్ ఏర్పాటు అవుతున్నందున జీహెచ్‌ఎంసీ చట్టాలను సవరించనున్నారు. నగరంలోని బుద్ధభవన్‌లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది