Legal issues
-
దుబాయ్‌లో న్యాయ సహాయ కేంద్రం: జస్టిస్ రమణ
న్యూఢిల్లీ: దుబాయ్‌లో ఉంటున్న భారతీయులంతా కలిసి లీగల్ అసిస్టెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న భారతీయులకు అది ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. దుబాయ్ పర్యటనలో ఉన్న జస్టిస్ రమణ శుక్రవారం అక్కడి గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమ కోహ్లి ఆయనతో పాటు ఉన్నారు. దుబాయ్ అత్యున్నత న్యాయస్థానం యూనియన్ సుప్రీంకోర్టు ఆఫ్ ది యూఏఈ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ హమద్ అల్ బదీ ఆహ్వానం మేరకు జస్టిస్ రమణ అక్కడ పర్యటిస్తున్నారు. అబుదాబిలోని భారత సంతతి వారి సన్మాన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఆగిన నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గడువులోగా గృహ నిర్మాణాలు పూర్తి కావట్లేదు. 2014, అంతకంటే ముందు ప్రారంభమై నేటికీ పూర్తికాకుండా కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలో ఇప్పటివరకు రూ.11,810 కోట్ల విలువ చేసే 17,960 గృహా నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయి. వీటిలో ఏడేళ్ల క్రితం ప్రారంభమైనవి 4,150 గృహాలున్నాయి. వీటి విలువ రూ.2,727 కోట్లని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. నిధుల కొరత, న్యాయపరమైన సమస్యలు, కరోనా వ్యాప్తి వంటివి నిర్మాణ ఆటంకాలకు ప్రధాన కారణాలని పేర్కొంది. హైదరాబాద్‌లో నిలిచిపోయిన గృహాలలో 36 శాతం ప్రీమియం విభాగంలోనివి కాగా.. 20 శాతం లగ్జరీ సెగ్మెంట్, 22 శాతం అందుబాటు గృహాలు. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రూ.5.05 లక్షల కోట్ల విలువ చేసే 6.29 లక్షల గృహా నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వీటిలో 2014, అంతకంటే ముందు ప్రారంభమైన గృహాలు 1.74 లక్షల యూనిట్లున్నాయి. వీటి విలువ రూ.1.40 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఆగిపోయిన గృహాలలో 39 శాతం అంటే 2,47,930 యూనిట్లు రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మిడ్‌రేంజ్ విభాగంలోనివి. 32 శాతం (2,01,350 యూనిట్లు) రూ.40 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలు, 18 శాతం (1,11,050 యూనిట్లు) రూ.80–1.5 కోట్ల ధర ఉండే ప్రీమియం విభాగంలోనివి, 68,300 యూనిట్లు రూ.1.5 కోట్లకు పైగా ధర ఉండే లగ్జరీ విభాగంలోనివి. అత్యధికంగా ఎన్సీఆర్లో 1,13,860 గృహా నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటి విలువ రూ.86,463 కోట్లు. -
మాల్యా అప్పగింతలో మరింత జాప్యం
న్యూఢిల్లీ: ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు బ్రిటన్ అప్పగించే ప్రక్రియకు మరింత సమయం పట్టేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన అప్పగింతకు ముందు కొన్ని చట్టపరమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ఎంతకాలం పడుతుందన్నది చెప్పలేమని బ్రిటన్ హై కమిషన్ ప్రతినిధి చెప్పారు. ‘అప్పగింతను వ్యతిరేకిస్తూ విజయ్ మాల్యా పెట్టుకున్న అప్పీళ్లన్నీ తిరస్కరణకు గురయ్యాయి. అయినప్పటికీ ఆయనను అప్పగించేందుకు ముందుగా పరిష్కరించుకోవాల్సిన చట్టపరమైన అంశం ఒకటి ఉంది‘ అని వివరించారు. అది పూర్తయ్యే దాకా బ్రిటన్ చట్టం ప్రకారం అప్పగింత కుదరదని, ఇంతకు మించి వివరాలు వెల్లడించడానికి లేదని ప్రతినిధి చెప్పారు. దివాలా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ మాల్యా దేశీ బ్యాంకులకు దాదాపు రూ. 9,000 కోట్లు ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2016 నుంచి ఆయన బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు. -
కోర్టుకు హాజరైన కామినేని వారసులు
సాక్షి, కామారెడ్డి: దోమకొండ కోట ఆస్తుల విషయంలో కామినేని వారసుల మధ్య తలెత్తిన ఆస్తి వివాదం చివరకు కోర్టుకు చేరింది. వారసుల్లో ఒకరైన సత్యనారాయణరావు కుటుంబం కోటలోని ఆస్తుల్లో తమ వాటా కోసం కామారెడ్డి కోర్టులో కేసు వేసింది. దీనిపై నోటీసులు అందుకున్న మిగతా వారసులందరూ గురువారం కోర్టుకు హాజరయ్యారు. కామినేని వంశస్తులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉమాపతి, అనిల్ కామినేని, సత్యనారాయణరావు, రోహిత్ రాజేశ్వర భూపాల్, లావణ్యతో పాటు మొత్తం 14మంది న్యాయస్తానం ఎదుట హాజరయ్యారు. కోటలోని వెంకటభవన్, అద్దాల బంగ్లా, అజ్గర్ మంజిల్, భరత్‌రాంభూపాల్ బంగ్లాతో పాటు స్థలాల విషయంలో వారసుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ కేసు విచారణ వచ్చే నెల 28కి వాయిదా పడినట్లు సమాచారం. చదవండి: వీధికెక్కిన ‘కామినేని’ ఆస్తుల తగాదా కోటలోని శివాలయంలో పూజలు చేస్తున్న ఉపాసన, రాంచరణ్ (ఫైల్ ఫోటో) కాగా కామినేని అనిల్...అపోల్ ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమార్తె శోభనను వివాహం చేసుకున్నారు. అలాగే వారి కూతురు ఉపాసన హీరో రాంచరణ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. ఉపాసన-రాంచరణ్ వివాహ వేడుకలు కూడా కోటలో జరిగాయి. వివాహం సందర్భంగా వారిద్దరూ కోటలోని శివాలయంలో పూజలు కూడా నిర్వహించారు. ఇక దోమకొండ కోటకు సంబంధించిన నలభై ఎకరాల ప్రహరీ గోడ ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. మిగతా భవనాలు, భూములు కామినేని వంశస్తులవి. ప్రస్తుతం ఆస్తుల వారసత్వంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది. కోటలో చిరంజీవి, రాంచరణ్, ఉపాసన -
ట్రంప్‌పై అభిశంసన కత్తి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై మరోసారి అభిశంసన కత్తి వేళ్లాడుతోందా? ట్రంప్ ఎదుర్కొంటున్న న్యాయ వివాదాలు ఆయన పదవికి ఎసరు పెడతాయా? అగ్రరాజ్యంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నాయి. ఆయన్ను పదవి నుంచి తప్పించాలన్న చర్చ ఇప్పటికే మొదలవగా నవంబర్‌లో జరిగే ప్రతినిధుల సభ ఎన్నికల్లో పట్టు సాధించి ట్రంప్‌ను గద్దె దింపాలని డెమోక్రాట్లు భావిస్తున్నారు. వెంటాడుతున్న ఎన్నికల వివాదాలు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై సాగుతున్న విచారణలో భాగంగా ట్రంప్ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్ కోహెన్, మాజీ ప్రచార మేనేజర్ పాల్ మనాఫోర్ట్లు కోర్టుల్లో దోషులుగా తేలడం ఒక్కసారిగా ట్రంప్‌ను చిక్కుల్లోకి నెట్టేసింది. అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన సెక్స్ స్కాండల్ ముడుపుల వ్యవహారం ఇప్పుడు వెలుగుచూడటంతో ట్రంప్ ఎన్నడూ లేనివిధంగా విషమ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్ కోహెన్ పన్నుల ఎగవేత, బ్యాంకుల్ని మోసగించడం, ప్రచార ఆర్థిక చట్టాల ఉల్లంఘన నేరాలను కోర్టు ఎదుట అంగీకరించడం ట్రంప్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ట్రంప్‌తో తమకు లైంగిక సంబంధాలున్నాయని చెప్పుకుంటున్న ప్లేబాయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్, పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్‌లు నోరు మూయించడానికి మూడో కంటికి తెలియకుండా ముడుపులు చెల్లించాలని ట్రంప్ తనకు చెప్పారంటూ కోహెన్ కోర్టుకు వెల్లడించారు. ఇవన్నీ ఇప్పుడు ట్రంప్‌ను గద్దె దింపాలనే చర్చకు దారి తీశాయి. ట్రంప్ సైతం తనను అభిశంసిస్తే మార్కెట్లు కుప్పకూలి అందరూ పేదవాళ్లవుతారంటూ బెదిరింపులకు దిగారంటే ఆయన కూడా ఆందోళనలో ఉన్నట్టు అర్థమవుతోంది. అధ్యక్షుడి అభిశంసన ఇలా... అమెరికా అధ్యక్షుడిని అభిశంసించడం అంత సులభం కాదు. దీనికి సుదీర్ఘ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతినిధుల సభలో సభ్యులెవరైనా అధ్యక్షుడి తప్పుల్ని ఎత్తి చూపుతూ అభిశంసనకు ప్రతిపాదించవచ్చు. దేశద్రోహం, లంచాలు ఇవ్వడం, ఘోర నేరానికి పాల్పడటం, దుష్ప్రవర్తన (అధికార దుర్వినియోగం, ప్రజావిశ్వాసాన్ని దెబ్బతీయడం దుష్ప్రవర్తన కిందకు వస్తాయి) వంటి కారణాలతో అభిశంసించే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలో అధ్యక్షుడిపై నమోదైన అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా హౌస్ జ్యుడీషియరీ కమిటీ ఎదుట విచారణకు వస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తిగల ఆ కమిటీ విచారణలో ఆరోపణలు నిజమని తేలితే ఏయే అధికరణాల కింద నేరారోపణలు చేశారనేది నిర్ధారిస్తారు. ఆ అధికరణాలపై మళ్లీ సభలో సమగ్ర చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుంది. సాధారణ మెజారిటీతో అభిశంసన తీర్మానాన్ని సభ ఆమోదిస్తే దానిని సెనేట్‌కు పంపుతారు. అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే అవకాశం ఉంటుంది. సెనేట్‌లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు (67 మంది) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది. నవంబర్ ఎన్నికలే అభిశంసనకు రెఫరెండం... ఈ పరిణామాలన్నీ నవంబర్‌లో జరిగే ప్రతినిధుల సభ ఎన్నికల్లో డెమోక్రాట్లకు లాభిస్తాయనే అంచనాలున్నాయి. ఈ ఎన్నికలే ట్రంప్‌పై అభిశంసనకు రెఫరెండంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లదే మెజారిటీ. డెమోక్రాట్లు రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రతినిధుల సభలో పట్టు పెంచుకుంటే ట్రంప్‌ను పదవి నుంచి తప్పించడానికి వ్యూహాలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ట్రంప్‌పై గతేడాది ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ప్రతినిధుల సభలో వీగిపోయింది. చాలా మంది డెమోక్రాట్లు ట్రంప్‌పై అభిశంసన తొందరపాటు చర్య అని అభిప్రాయపడ్డారు. అందుకే వచ్చే నవంబర్ ఎన్నికల వరకు వారు ట్రంప్‌ను గద్దె దింపే సాహసం చేసే అవకాశం కనిపించడం లేదు. చరిత్రలోకి తొంగి చూస్తే... ఇప్పటివరకు అమెరికా అధ్యక్షులెవరూ అభిశంసనకు గురికాలేదు. 1868లో ఆండ్రూ జాన్సన్, 1998లో బిల్ క్లింటన్లపై ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం నెగ్గినప్పటికీ సెనేట్‌లో వారిద్దరికీ ఊరట లభించింది. 1974లో వాటర్ గేట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న రిచర్డ్ నిక్సన్ అభిశంసన తీర్మానంపై చర్చకు ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సాక్ష్యం షోలు రద్దు!
సాక్షి, హైదరాబాద్: భారీ బడ్జెట్‌తో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు(జూలై 27)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే ఎర్లి మార్నింగ్ షోతోపాటు మార్నింగ్ షోలు కూడా దాదాపు రద్దయ్యాయి. ఇందుకు టెక్నికల్ ఇష్య్సూ కారణమని చెబుతున్నప్పటికీ.. మరోవైపు న్యాయపరమైన సమస్యలనే టాక్ వినిపిస్తోంది. నిర్మాత అభిషేక్ నామా, ఫైనాన్షియర్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే షోలు ఆగినట్లు సమాచారం. చిత్ర విడుదలను నిలిపివేయాలని నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా అందినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఉదయం షోలు రద్దయ్యాయంట. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పటి వరకు ఈ చిత్రం షోలు పడలేదు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో పడాల్సిన 8.45 గంటల షో కూడా రద్దయింది. ఏపీ, తెలంగాణల్లో మార్నింగ్ షోలు కూడా ఉండవని పలువురు సినీ జర్నలిస్టులు ట్వీట్లు చేశారు. మధ్యాహ్నానికి ఈ సమస్యలన్నీ పరిష్కరించకుని మ్యాట్నీ షో నుంచి చిత్ర ప్రదర్శనను ప్రారంభించాలని నిర్మాత యత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్‌కు డిజిటల్ ప్రింట్ అందలేదు. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల సమయంలో చిక్కులు ఎదుర్కొవటం గమనార్హం. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు విలన్. యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్‌గా సాక్ష్యం తెరకెక్కింది. -
వీధికెక్కిన ‘కామినేని’ ఆస్తుల తగాదా
శతాబ్దాల చరిత్ర గల దోమకొండ కోటలోని భవనాల విషయంలో వారసుల మధ్య వివాదం ముదురుతోంది. గడీకోటలోని భవనాలు తమవంటూ మూడు కుటుంబాలకు చెందిన వారు తాళాలు వేయగా.. మరో వారసుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వేసిన తాళాలను తొలగించారంటూ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. దీనిపైనా కేసు నమోదైంది. సాక్షి, కామారెడ్డి: దోమకొండ సంస్థాన వారసుల మధ్య ఆస్తుల కొట్లాట ముదురుతోంది. దోమకొండ కోట కేంద్రంగా కామినేని వంశీయులు శతాబ్దాల పాటు పాలించారు. సంస్థానాల రద్దు అనంతరం దోమకొండ కోట ఎవరిది అన్న విషయం ఎప్పుడూ చర్చకు రాలేదు. 2013లో సినీ నటుడు రాంచరణ్ తేజ పెళ్లితో కోట వివాదం వెలుగులోకి వచ్చింది. అనిల్ కామినేని కుమార్తె ఉపాసనకు రాంచరణ్‌తో పెళ్లి కుదరడం, అప్పట్లో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉండడంతో కోటలో కదలికలు మొదలయ్యాయి. ఒక దశలో గడీని రాంచరణ్ సొంతం చేసుకున్నాడన్న ప్రచారం జరిగింది. పెళ్లికి ముందు కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించారు. అప్పుడు కోటలో కొన్ని భవనాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ప్రస్తుతం కోట వ్యవహారాలు అనిల్ కామినేని చూస్తున్నారు. ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఆధీనంలోకి కోట వెళ్లింది. దీంతో సామాన్య ప్రజలకు కోట సందర్శన అవకాశం లేకుండా పోయింది. గొడవ మొదలైందిలా..... కోట పూర్తిగా అనిల్ కామినేని వశమైందన్న ప్రచారం జోరుగా సాగడంతో ఇతర వారసులైన రాజేశ్వర్రావ్, సత్యనారాయణరావ్, రాజేశ్వర్‌భూపాల్, లావణ్య కుటుంబాలకు చెందిన వారు స్థానిక కలెక్టర్‌కు ఆస్తుల విషయంలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి రాములును విచారణ అధికారిగా నియమించారు. పంచాయతీ అధికారులు విచారణ జరిపినా వివాదం తేలలేదు. దీంతో ఈ నెల 9న ఆయా కుటుంబాలకు చెందిన వారు కోటలోకి ప్రవేశించి భవనాలకు తాళాలు వేశారు. ఇవి తమ ఆస్తులని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అనిల్ కామినేని మనుషులు పోలీసులను ఆశ్రయించారు. కోటలోకి అక్రమంగా చొరబడి భవనాలకు తాళాలు వేశారని ఫిర్యా దులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు తాళాలు వేసినవారిపై కేసు నమోదు చేశారు. ఇంతటితో ఆగకుండా భవనాలకు వేసిన తాళాలను తొలగించారు. విషయం తెలిసిన సత్యనారాయణరావ్, రాజేశ్వర్‌భూపాల్, లావణ్యలు తమ ఇళ్లకు వేసుకున్న తాళాలను అనిల్ కామినేని మనుషులు తొలగించారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాశంగా మారింది. ఫిర్యాదు నమోదు.. దోమకొండ: కోటలో తమ ఆస్తులకు సంబంధించిన భవనాలకు తాళాలు వేసి ఫ్లెక్సీలు కట్టగా.. కామినేని అనిల్‌కుమార్ మనుషులు వాటిని తొలగించారని కోట వారసులుగా చెప్పుకుంటున్న కామినేని సత్యనారాయణ, కామినేని రాజేశ్వర్‌భూపాల్, లావణ్యలు బుధవారం దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఎస్సై నరేందర్ తెలిపారు. అద్దాలమేడ, అస్గర్‌మంజిల్, ఉమా మంజిల్ భవనాలకు ఈనెల 8వ తేదీన తాళాలు వేశామని, ఈనెల 12వ తేదీన కామినేని అనిల్ మనుషులు వాటిని తొలగించి, ఫ్లెక్సీలను తీసివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. వారి ఫిర్యాదు మేరకు అనిల్ కామినేని మనుషులపై కేసు నమోదు చేశామన్నారు. -
నీరవ్ మోదీపై నటి దావా.. అంతా ఉత్తదే!
సాక్షి, ముంబై : ప్రముఖ వజ్రాల వ్యాపారి, పంజాబ్ బ్యాంక్‌ను నిలువునా ముంచిన నీరవ్ మోదీపై దావా వేసినట్లు వస్తున్న వార్తలపై నటి ప్రియాంక చోప్రా స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నీరవ్‌కు చెందిన డైమండ్ కంపెనీపై దావా వేసిన వార్త అవాస్తవం’ అని అందులో ఆమె పేర్కొన్నారు. అయితే భారీ కుంభకోణం బయటపడిన నేపథ్యంలో ఆ కంపెనీతో ఆమె చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో మాత్రమే ఉన్నారని.. ఇందుకు సంబంధించి న్యాయనిపుణుల సలహాను ఆమె తీసుకుంటున్నారని ప్రియాంక వ్యక్తిగత కార్యదర్శి శుక్రవారం మీడియాకు తెలియజేశారు. గతంలో ప్రియాంక చోప్రా హీరో సిధార్థ్ మల్హోత్రాతో కలిసి నీరవ్ మోదీకి చెందిన నగల కంపెనీ ప్రకటనలో నటించింది. ఇందుకు సంబంధించి పారితోషకాన్ని సదరు కంపెనీ పూర్తిగా చెల్లించలేదు. ఇంతలోనే నీరవ్ మోదీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె సదరు కంపెనీపై దావా వేసేందుకు సిద్ధమైనట్లు కథనాలు వెలువడ్డాయి. -
'ప్రత్యేక హోదాకు న్యాయపరమైన చిక్కులు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించి న్యాయం చేస్తున్నామని పారికర్ తెలిపారు. దేశ సరిహద్దుల్లో చొరబాట్లను విజయవంతంగా నిరోధిస్తున్నామని కూడా రక్షణ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తిరిగి భారతదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. -
కంప్యూటరే లాయరు
♦ కొత్త పరిజ్ఞానాన్ని రూపొందించిన ఐబీఎమ్ ♦ న్యాయ సమస్యలకు చిటికెలో పరిష్కారాలు చూపుతున్న రాస్ ♦ విడుదలవగానే ఉద్యోగమిచ్చిన న్యూయార్క్ న్యాయ సంస్థ బేకర్ అండ్ హాస్టెట్లర్ వాషింగ్టన్: ఏళ్ల తరబడి పరిష్కారం లేకుండా ఉన్న కోర్టు కేసులను, చట్టం పుస్తకాలతో కుస్తీలు పట్టే న్యాయవాదులను చూస్తూనే ఉంటాం. ఇకపై ఇలాంటి సమస్యలకు ఊరట కలిగించేలా కంప్యూటర్ లాయర్లు అందుబాటులోకి రానున్నాయి. కేసు గురించి చెప్పగానే.. దీన్ని వాదించేందుకు కావాల్సిన సలహాలు, సూచనలను నిమిషాల్లో ఇవి అందించనున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థ ఐబీఎమ్ ‘రాస్’ అనే ప్రపంచంలోనే తొలి ‘కృత్రిమ మేధో న్యాయవాది’ని రూపొందించింది. వాట్సన్ కాగ్నిటివ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో ‘రాస్’ను రూపొందించారు. దీని కౌశలాన్ని చూసి మహామహులైన న్యాయ కోవిదులు ఆశ్చర్యపోతున్నారు. రాస్ ఏమేం చేస్తుంది? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కంప్యూటర్ టెక్నాలజీయే ‘రాస్’. ఏదైనా కేసును దీనికి అర్థమయ్యేలా సులభమైన భాషలో చెప్పినా అర్థం చేసుకుంటుంది. దీన్ని తనకున్న పూర్తి సమాచారంతో కేసును విశ్లేషించుకుని.. పూర్తి వివరణాత్మకంగా పరిష్కారం సూచిస్తుంది. దీంతోపాటు గతంలో జరిగిన ఇలాంటి కేసులేంటి? ఎక్కడెక్కడ, ఏవిధంగా దీనిపై వాదనలు జరిగాయి? ఎలాంటి ఆధారాలను పొందుపరిచారు? ఏ విధమైన తీర్పులు వెలువరించారో మనకు అర్థమయ్యేలా చెబుతుంది. ఈ రాస్తో మాట్లాడుతున్నంత సేపు సదరు కేసు గురించి మన న్యాయవాద మిత్రుడితో మాట్లాడినట్లుగానే ఉంటుందని దీన్ని రూపొందించిన ఐబీఎమ్ సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు చట్టాల్లో వస్తున్న మార్పులు, తాజా కోర్టు తీర్పులను తెలిపి.. దీనికి అనుగుణంగా న్యాయవాదులు వ్యవహరించాల్సిన తీరుపైనా స్పష్టతనిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది దివాళా కేసులకు మాత్రమే సలహాలిస్తుంది. ఆశ్చర్యపోతున్న న్యాయకోవిదులు అసలు ‘రాస్’ గురించి ఐబీఎమ్ చెప్పటం సరే ఇదేలా పనిచేస్తుందని పలువురు న్యాయకోవిదులు పరీక్షించారు. వివిధ కేసులను రాస్తో ప్రస్తావించి.. పరిష్కారం కోరారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వీరి దగ్గరున్న సమాచారంతోపాటు అదనపు సమాచారాన్ని, మారిన చట్టంలో సవరణలను చెప్పి వారందరినీ రాస్ ఆశ్చర్యపరిచింది. రాస్కు ఉద్యోగం 2011లోనే రాస్‌ను రూపొందించినా.. తర్వాత పది నెలలపాటు దీనికి దివాళా చట్టం (బ్యాంక్ప్ట్స్రీ లా)ను నేర్పించారు. 2014లో పరీక్షించినపుడు దీని కౌశలాన్ని గమనించిన న్యూయార్క్ లా ఫర్మ్ ‘బేకర్ అండ్ హాస్టెట్లర్’ రాస్కు ఉద్యోగమిచ్చింది. ‘రాస్ వంటి తెలివైన కృత్రిమ న్యాయవాది సంస్థలో చేరటం మాకు చాలా సంతోషంగా ఉంది. దీంతో మా క్లయింట్లకు మరింత విస్తృతమైన సేవలను అందిస్తాం’ అని సంస్థ తెలిపింది. మరింత పరిశోధన: ఐబీఎం రాస్కు ప్రస్తుతానికి దివాళా చట్టంపై పూర్తి అవగాహన ఉంది. దీని ఆధారంగా భవిష్యత్తులో ఇతర విభాగాల్లోనూ దీనికి శిక్షణ ఇచ్చేందుకు పరిశోధనలు చేస్తున్నామని ఐబీఎమ్ వెల్లడించింది. వినియోగిస్తున్న కొద్దీ దీని కౌశలం పెరుగుతుందని, విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుందని తెలిపింది.